మేధావి కీర్తిని ‘రేంజర్‌ దీదీ’ అని ఎందుకు పిలుస్తారో తెలుసా?

Forest Range Officer Medhavi Kirti Helps Local Manufacturers In Uttarakhand - Sakshi

ఉత్తరాఖండ్‌లోని భద్రగడ్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు మేధావి కీర్తి. గతేడాది మే నెలలో ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారిగా బాధ్యతలు చేపట్టిన కీర్తిని స్థానికులంతా ‘రేంజర్‌ దీదీ’ అని ప్రేమగా పిలుచుకుంటారు. పేరుకు తగ్గట్టుగానే స్థానిక మహిళలకు తోడబుట్టిన అక్కలా వ్యవహరిస్తున్నారు ఈ యంగ్‌ ఆఫీసర్‌. ఫారెస్ట్‌ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న అనేకమంది మహిళలకు చేయూతనిస్తూ వారి ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారు కీర్తి .  ‘ధాత్రీ’ అనే సంస్థను స్థాపించి, భుట్‌గావ్, నెగ్యానా, బండసరి, తిక్రీ సుమన్‌కారి గ్రామాల్లోని  మహిళల ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తున్నారు. ధాత్రీ సంస్థ ద్వారా కుట్లు, అల్లికలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ వంటి పనుల్లో స్థానిక మహిళలకు శిక్షణ ఇప్పిస్తున్నారు.

ట్రైనింగ్‌ పూర్తయిన మహిళలతో వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేయించి వాటిని మంచి లాభాలకు విక్రయిస్తూ ఆదాయాన్ని పదింతలు చేస్తున్నారు. దీపాలు, పూజాసామగ్రి, కుండల తయారీ, సుంగధ ద్రవ్యాల ఉత్పత్తులు, స్థానికంగా పండే బార్లీ, రాజ్మా, మండెవా, రోడోడెండ్రాన్‌ రసం వంటివాటిని తయారు చేయిస్తున్నారు. అంతేగాక స్థానికంగా పెరిగే మలు, తిమ్లీ అనే మొక్కల నుంచి తయారు చేసిన ప్లేట్స్, గిన్నెలను ‘వేదిక్‌ పత్రావళి’ పేరుతో విక్రయిస్తున్నారు. కొంతమంది మహిళలను ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి ఆవుపేడతో కళాఖండాలు తయారు చేయిస్తున్నారు. ‘నందినీ’ అనే బ్రాంచ్‌ ప్రారంభించి దీనిలో పెళ్లికాని అమ్మాయిలతో వివిధ రకాల వస్తువులను ఉత్పత్తి చేయిస్తున్నారు.

ప్రారంభంలో ఇక్కడి మహిళలను ఒప్పించడం చాలా కష్టమైంది. కానీ తరువాత సీనియర్‌ అధికారుల సాయంతో ముందుకు సాగగలిగానని కీర్తి చెప్పారు. మహిళలకు శిక్షణ నివ్వడం గతేడాది దీపావళి పండుగకు ఒక నెలముందు ప్రారంభించాం. అప్పుడు కొన్ని రకాల మెషిన్లు, కొంతమంది ట్రైయినర్లతో శిక్షణ ఇప్పించడంతో.. నెలరోజుల్లోనే వేగంగా నేర్చుకుని దీపావళి పండుగ సమయంలో అనేక ఉత్పత్తులు అందించిన మహిళలు వాటిని విక్రయించడం ద్వారా రూ.40 వేలు ఆదాయం పొందారు’’ అని కీర్తి చెప్పారు. ‘‘ఆవుపేడతో కళాఖండాలు తయారు చేయడంలో నైపుణ్యం కలిగిన నాగ్‌పూర్‌కు చెందిన ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం. పశువులు పాలు ఇవ్వడం ఆపేసిన తరువాత వాటిని పెద్దగా పట్టించుకోరు. అటువంటి పశువుల నుంచి పేడ సేకరించి వాటిని ఉపయోగపడే కళాఖండాలుగా తీర్చితిద్ది వాటి ద్వారా గ్రామీణ మహిళలకు మరికొంత ఆదాయం సృష్టించడమే తమ లక్ష్యం’’ అని ఆమె పేర్కొన్నారు.

‘‘మేధావి కీర్తి ఎంతో కష్టపడి ఇక్కడి మహిళలను అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారు. నాణ్యతతో కూడిన స్వదేశీ ఉత్పత్తులకు ధాత్రీ మంచి బ్రాండ్‌గా ఎదుగుతుంది’’ అని ముస్సోరీ డివిజినల్‌ ఫారెస్ట్‌ అధికారి కహంకన్‌ నసీమ్‌ అన్నారు. ధాత్రీ ద్వారా ఉపాధి పొందుతున్న తమకు రేంజర్‌ దీదీ తల్లిలా, అక్కలా తమని ఆదుకుంటున్నారని ధాత్రీద్వారా లబ్ధి పొందుతున్న మహిళలు చెప్పారు. ఎప్పటికప్పుడు తమని మోటివేట్‌ చేస్తూ తమలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి ఆదాయంగా మలుస్తున్నారు. మహా కుంభమేళా–2021లో మా ఉత్పత్తులను విక్రయించేందుకు దీదీ అధికారుల నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. దీనిద్వారా తమ ఆదాయం పెరుగుతుందని వారు ఆనందం వ్యక్తం చేశారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top