అడవి పాఠం

Forest Man Jadav Payeng Life Story In American Textbooks - Sakshi

అమెరికా స్కూళ్లలో ఇప్పుడు ఓ అరణ్య పురుషుడి పేరు అక్కడి పిల్లల లేత మెదళ్లలో వేళ్లూనుకుంటోంది. అతడి పేరు జాదవ్‌ పయేంగ్‌. ఫారెస్ట్‌ మ్యాన్‌గా ఖ్యాతి గడించిన పయేంగ్‌ జీవిత చరిత్రను యుఎస్‌ లోని, కనెక్టికట్‌ రాష్ట్రంలో ఉన్న బ్రిస్టల్‌లోని ఒక స్కూల్‌ పాఠ్యాంశాల్లో చేర్చారు. అస్సాంకు చెందిన సాధారణ రైతు అయిన పయేంగ్‌ నాలుగు దశాబ్దాలలో 550 హెక్టార్లలో ఓ అడవినే పెంచాడు. ఆ అడవిలో ఏనుగులు, జింకలు, ఖడ్గమృగాలు, పులులు, అనేక ఇతర జంతువులు నివసిస్తున్నాయి. ‘విద్యార్థులు తమ పాఠ్యాంశాల్లో భాగంగా 57 ఏళ్ల ‘పద్మశ్రీ’ జాదవ్‌ పయేంగ్‌ గురించి చదువుతున్నారు’ అని బ్రిస్టల్‌లోనే ఇంకో పాఠశాల ఉపాధ్యాయురాలైన నవమీశర్మ తెలిపారు. గౌహతిలో పుట్టి పెరిగిన పయేంగ్‌ 1979 నుంచి తన గ్రామంలో మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం చేస్తూ వచ్చాడు.

‘‘అమెరికా పాఠశాలలోని విద్యార్థులు తమ పాఠ్యాంశాల్లో భాగంగా పయేంగ్‌పై రెండు డాక్యుమెంటరీలను కూడా చూశారు. పయేంగ్‌ కథ చాలా శక్తిమంతమైంది. చిన్న వయసు నుంచే పర్యావరణ సమస్యను పరిష్కరించడంలో పయేంగ్‌ ముందున్నాడు.. అని గ్రీన్‌ హిల్స్‌ స్కూల్‌ టీచర్‌ డాన్‌ కిల్లియాని చెబుతుంటే నాకెంతో గర్వంగా అనిపించింది ఇక్కడివాళ్లు పయేంగ్‌ నుంచి ప్రేరణ పొందుతున్నారు. ఈ ఫారెస్ట్‌ మ్యాన్‌ గురించి నాకు ముందే తెలుసు. ఇక్కడ స్కూల్‌ పిల్లలు పాఠంగా అతని గురించి తెలుసుకుంటుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది’’ అని అంటున్నారు నవమీశర్మ.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top