
ఆఫీసులో ఉండగా కలుద్దామని ఫ్రెండ్ ఫోన్ చేస్తే సమీపంలో ఉన్న ఏ ఛాయ్ క్యాంటీన్‌లోనో, కేఫ్‌లోనో కలుద్దాం అని చెబుతాం.. ఏ పార్క్‌లోనో, ట్యాంక్ బండ్ మీదో ఒంటరిగా కూర్చున్నప్పుడు పల్లీలు అమ్మేవాడో, ముంత కింద పప్పు వాడో కనిపిస్తే.. నోటికి పని చెబుతాం.. ఇలా ఎందుకు చేస్తాం? ఆకలి తీర్చుకోడానికా? లేక అవి తినాలనే ఆతృతతోనా? అంటే రెండూ కాదు.. మన మూడ్‌ను మెరుగుపరుచుకోవడం కోసం అంటున్నారు హైదరాబాద్ నగరవాసులు.
రోడ్డు పక్కన దొరికే పానీ పూరీ కావచ్చు, థియేటర్‌లో కరకరమనిపించే పాప్ కార్న్ కావచ్చు.. సరదాగా లాగించే సమోసాలు కావచ్చు.. చిది్వలాసంతో నమిలేసే చిప్స్‌కావచ్చు.. ఇవన్నీ ఇంట్లో ముప్పూటలా తినేతిండికి అదనం. మన మూడ్స్‌ను మెరుగుపరిచే ఇంధనం.. గోద్రెజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఎస్‌టీటీఈఎమ్ 2.0 స్నాకింగ్ రిపోర్ట్ ప్రకారం గత కొంతకాలంగా అధ్యయనాలు చెబుతున్న ఇదే అంశాన్ని అంగీకరిస్తున్నారు నగరవాసులు.
చిరుతిండి మనలో ఉత్సాహాన్ని పెంచుతుంది. మన భావోద్వేగాలను మెరుగుపరచడంలో శక్తిమంతమైన పాత్ర పోషిస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఎప్పుడు? ఎందుకు? ఏమిటి ఎలా.. సిటిజనులు స్నాక్‌కు సై అంటున్నారు? ఈ రిపోర్ట్‌లో పేర్కొన్న ప్రకారం చూస్తే..
మంచి మూడుకు స్నాక్ బూస్ట్..
చిరుతిండి, హ్యాపీ మూడ్స్ ఒకదానికొకటి అనుబంధంగా ఉంటున్నాయనేది స్పష్టంగా తెలుస్తోంది. సర్వేలో పాల్గొన్నవారిలో 62% మంది మూడ్స్‌ను హ్యాపీగా ఉంచడం కోసం స్నాక్స్ తీసుకుంటారని అంగీకరించారు. అదే విధంగా 45% మంది పార్టీలు, వేడుకల సమయంలో ఫ్రోజెన్ స్నాక్స్ కోసం చూస్తామని చెప్పారు.
అంటే విభిన్న రకాల వంటకాలు ఉన్నప్పటికీ స్నాక్స్ విలువ తగ్గదు అని దీనిద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకంటే అవి వారి అనుభవాలను మరింతగా మెరుగుపరుస్తాయనే ఆలోచనతోనే అని చెబుతున్నారు. అలాగే నగరంలో 45% మంది వారాంతాల్లో కూడా ఫ్రోజెన్ స్నాక్స్‌ను ఇష్టపడతారు. వారి విశ్రాంతి సమయాలకు కొత్త రుచులను జత చేస్తారు. ఆరోగ్యకరమైనవి
ఎంచుకుంటే మేలు..
స్నాక్స్ తీసుకోవడం తప్పుకాకున్నా.. ఒబెసిటీ ముప్పు వెంటాడుతూనే ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మితంగా తీసుకునే చిరుతిండిలో ఆరోగ్యకరమైన బాదం తదితర పప్పులు చేర్చాలని, విటమిన్లు, జింక్, ఫోలేట్ ఐరన్‌తో సహా 15 ముఖ్యమైన పోషకాల సహజ మూలంగా ఆల్మండ్స్ రోగనిరోధకతను మెరుగుపరుస్తాయని పోషక నిపుణులు చెబుతున్నారు.
ఇవి ఎప్పుడైనా ఆస్వాదించడానికి అనుకూలమైన చిరుతిండిగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తేల్చింది. అలాగే నారింజ, ద్రాక్షపండు వంటి సిట్రస్ పండ్లు విటమిన్–సీ అందిస్తాయి. ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకం–ఇన్‌ఫెక్షన్‌లకు వ్యతిరేకంగా రక్షణ ఇస్తుంది. ఈ పండ్లను స్నాక్స్‌గా మార్చుకోవడం రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. అలాగే ఆకుకూరలతో కూడిన వెజ్ సలాడ్స్ కూడా మేలైనవేనని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు.
టైం ఏదైనా.. అటెన్షన్ కోసం..
పరీక్షల ముందు టెన్షన్ కావచ్చు.. రొమాంటిక్ సమయంలో అటెన్షన్ కావచ్చు.. కాదే సందర్భమూ స్నాకింగ్‌కు అనర్హం అంటున్నారు నగరవాసులు. నగరంలో 17% మంది విద్యార్థులు పరీక్షా సన్నాహక సమయంలో ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం చిరుతిండికి జై కొడుతున్నామని అంటున్నారు. మరోవైపు శృంగార సమయంలోనూ మానసిక స్థితిని బెటర్‌గా ఉంచేందుకు స్నాక్స్ తోడు కోరుకుంటున్నామని 16 శాతం మంది చెప్పారు.
ఆట పాటల్లోనూ అదే బాట..
ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ పోటీ జరుగుతోంది. ఇలాంటి ప్రత్యక్ష క్రీడా ఈవెంట్‌లను కేఫ్స్‌లోనో, పబ్స్/క్లబ్స్‌లోనో వీక్షించే సమయంలో దాదాపు అందరి ముందూ ఏదో ఒక చిరుతిండి కనబడడం మనం గమనించవచ్చు. ఇదే విషయాన్ని అంగీకరిస్తూ నగరంలో 50% మంది తమ వీక్షణ అనుభవాన్ని మెరుగుపరచుకోడానికి స్నాక్స్‌కి సై అంటారు. అదే విధంగా 54% మంది నగరవాసులు టీవీ/ఒటీటీ/మొబైల్‌లో వెబ్ సిరీస్, సినిమాలు లేదా షోలను చూస్తున్నప్పుడు స్నాక్స్ తీసుకోడాన్ని ఇష్టపడతామని చెప్పారు.