రూబిక్‌ క్యూబ్‌తో ప్రపంచ రికార్డు!

Fastest Time To Solve Three Rotating Puzzle Cubes - Sakshi

పెద్దవాళ్లు సైతం కష్టపడి పరిష్కరించే రూబిక్‌ క్యూబ్‌ను నేటితరం పిల్లలు ఇట్టే పరిష్కరిస్తూ ఔరా అనిపిస్తున్నారు. చిచ్చర పిడుగులాంటి ఎనిమిదేళ్ల అధర్వ ఒకేసారి మూడు రూబిక్‌ క్యూబ్‌లను పరిష్కరించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. బెంగళూరుకు చెదిన అధర్వ ఆర్‌భట్‌ ఒకేసారి చేతులు, కాళ్లు ఉపయోగించి మూడు రూబిక్‌క్యూబ్‌లను పరిష్కరించి గిన్నిస్‌ రికార్డు నెలకొల్పాడు. అంతేగాకుండా ‘వరల్డ్‌ బెస్ట్‌ మల్టీ టాస్కర్‌’ను కనుగొన్నామని గిన్నీస్‌ యాజమాన్యం నుంచి ప్రశంస అందుకున్నాడు.  అధర్వ 2020 డిసెంబర్‌ 9న ఈ రికార్డు సృష్టించినప్పటికీ... తాజాగా గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ (జీడబ్ల్యూర్‌) అధికారిక యూట్యూబ్‌ చానెల్‌లో అధర్వ వీడియో పోస్టు చేయడంతో అతని రికార్డు వెలుగులోకి వచ్చింది. గిన్నిస్‌ యాజమాన్యం పోస్టు చేసిన వీడియోలో... అధర్వ ఒక్కో చేతిలో ఒక్కో రూబిక్‌ క్యూబ్‌నూ, రెండు కాళ్లతో ఒక రూబిక్‌ క్యూబ్‌ను ఒకేసారి పరిష్కరిస్తుంటాడు. అతని పక్కనే ఒక వ్యక్తి అధర్వ ఎంత సమయం లో పజిల్‌ను క్లియర్‌ చేస్తున్నాడో తెలిపే టైమర్‌ ను పట్టుకుని కూర్చుని ఉంటాడు. చాలా వేగంగా క్యూబిక్‌ పజిల్‌ను అటూ ఇటూ కదుపుతూ ఒక నిమిషం ఇరవైతొమ్మిది సెకన్లలోనే పూర్తిచేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అత్యంత వేగంగా క్యూబ్‌ పజిల్‌ పరిష్కరించి రికార్డులు తిరగరాసిన అధర్వకు మన దేశానికి చెందిన  కృష్ణంరాజు, చైనాకు చెందిన జియాన్యూ క్యూలు ప్రేరణ. వీరు గతంలో అత్యంత వేగంగా క్యూబిక్‌ పజిల్‌ను పూర్తిచేసి గిన్నిస్‌ రికార్డుల్లో చోటు దక్కించుకున్నారు.

వీరికంటే వేగంగా పజిల్‌ను పూర్తిచేసి రికార్డు కొట్టాలనుకున్న అధర్వ ఆ దిశగా సాధన చేసి చివరికి తను అనుకున్నది సాధించాడు.  2017 నుంచి రికార్డు కోసం సాధన చేస్తున్న అధర్వ 2018లో రాష్ట్ర స్థాయి ‘ బెస్ట్‌ ట్యాలెంట్‌ ఆఫ్‌ కర్ణాటక’ లో పాల్గొని కాళ్లతో క్యూబ్స్‌ను పరిష్కరిస్తూ ఫైనల్స్‌ వరకు చేరుకుని వీక్షకులను ఆశ్చర్యపరుస్తూ విజయం సాధించాడు. అయితే ఈ పోటీ టాలెంట్‌ను ప్రదర్శించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. మరింత కష్టపడి ప్రయత్నిస్తే గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు టైటిల్‌ గెలుచుకోవచ్చని అధర్వ అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా కరోనా కాలంలో ఆన్‌లైన్‌ తరగతులు వింటూ..తన గిన్నిస్‌ రికార్డు కోసం సాధనం చేసేవాడు. ఈ క్రమంలోనే పలుమార్లు క్యూబ్‌లు పరిష్కరిస్తూ సర్టిఫికెట్‌లు కూడా అందుకున్నాడు. ‘‘పజిల్స్‌ అంటే ఎంతో ఇష్టం, వాటిని పరిష్కరించడం మరెంతో ఇష్టమని చెబుతూ.. కుటుంబ ప్రోత్సాహంతోనే తానీ స్థాయికి చేరుకున్నానని అధర్వ చెప్పాడు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top