Porgai Art: ట్రైబల్‌ హార్ట్‌.. ‘పోర్గై’ కళ.. ఎంబ్రాయిడరీతో మంచి ఆదాయం!

Fashion: Porgai Art Embroidery Work Speciality Interesting Facts - Sakshi

అడవి బిడ్డల మనసు ఎంత స్వచ్ఛమైనదో వారి కళారూపాలు మన కళ్లకు కడతాయి. వాటిలో గిరి తరుణుల చేత రూపుదిద్దుకున్న ఎంబ్రాయిడరీ వర్క్‌ ఇప్పుడు ఫ్యాషన్‌లో భాగమైంది.ఇంటి అలంకరణలో అద్దమై వెలుగుతోంది. ఆధునిక దుస్తుల మీద అందంగా అమరిపోతోంది.

అంతరించిపోతున్న సంప్రదాయ లంబాడీ ఎంబ్రాయిడరీని పునరుద్ధరించి సమకాలీన శైలులకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు ‘పోర్గై’ కళాకారులు. మోడర్న్‌ డ్రెస్సులు, సంప్రదాయ చీరలు.. ఏవైనా ట్రైబల్‌ ఆర్ట్‌ ఫామ్‌ ఒక్కటైనా ఉండాలనుకుంటున్నారు నాగరీకులు.

దీంట్లో భాగంగా ఇటీవల తెలంగాణ క్రాఫ్ట్‌ కౌన్సిల్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో ‘పోర్గై’ కళ ఆకట్టుకుంది. తమిళనాడులోని ధర్మపురి జిల్లా సిత్లింగి వ్యాలీలో ఈ గిరిజనుల సంప్రదాయ ఎంబ్రాయిడరీ వినూత్నంగా మెరుస్తోంది. 
∙∙ 


అంతరించిపోతున్న లంబాడీ ఎంబ్రాయిడరీని మహిళల బృందం పునరుద్ధరించింది. ‘మా కళ మాకు ఎంతో గర్వం’ అని చాటేలా దాదాపు 60 మంది లంబాడీ మహిళలు ఒక సంస్థగా ఏర్పడి దుస్తులు, గృహాలంకరణలో ప్రత్యేకతను చూపుతున్నారు. డిజైన్, నైపుణ్యం, కొత్తకళాకారులకు శిక్షణ, మార్కెటింగ్‌–ఆన్‌లైన్‌ సపోర్ట్, ఎగ్జిబిషన్లలో పాల్గొనడం వంటివి విస్తృతంగా జరుగుతున్నాయి. 
∙∙ 
దాదాపు రెండు దశాబ్దాల క్రితం అక్కడి గ్రామంలోకి వచ్చిన వైద్యులు డాక్టర్‌ లలిత రేగి దంపతులు ఈ కళ ద్వారా గిరి పుత్రికలకు ఉపాధి లభించాలని కోరుకున్నారు. ఆరోగ్యసంరక్షణతో పాటు కళను బతికించే ప్రయత్నం చేశారు. దీంట్లో భాగంగా ‘పోర్గై’ అనే స్వచ్ఛంధ సంస్థను నెలకొల్పి కళాకారులకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేశారు.

గతంలో వ్యవసాయ కూలీలుగా ఉండే మహిళలు ఈ ఎంబ్రాయిడరీ కళ ద్వారా ఒక్కటై మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. విదేశాలకు కూడా ఈ కళాకారుల చేతిలో రూపుదిద్దుకున్న ఎంబ్రాయిడరీ దుస్తులు, గృహాలంకరణ వస్తువులు ఎగుమతి చేస్తున్నారు. 
∙∙ 
బెంగళూరు, ఢిల్లీ, ముంబై నుండి ఫ్యాషన్‌ డిజైనింగ్‌ పాఠశాలల కొంతమంది విద్యార్థులు ‘పోర్గై’ కళను తెలుసుకోవడానికి, డిజైన్లను మెరుగు పరచడానికి గిరిజన మహిళలతో కలిసి పనిచేస్తున్నారు.  

చదవండి: మోదీకి యాదమ్మ మెనూ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top