రైతు శాస్త్రవేత్త విజయకుమార్‌కు ‘సృష్టి సమ్మాన్‌’ పురస్కారం! | Sakshi
Sakshi News home page

రైతు శాస్త్రవేత్త విజయకుమార్‌కు ‘సృష్టి సమ్మాన్‌’ పురస్కారం

Published Wed, Dec 27 2023 9:51 AM

Farmer Scientist Kommuri Vijayakumar Awarded Srishti Samman - Sakshi

చిరుధాన్య పంటల జీవవైవిధ్యానికి విశేష కృషి చేస్తున్న వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన ప్రముఖ సేంద్రియ రైతు శాస్త్రవేత్త కొమ్మూరి విజయకుమార్‌(60)కు ప్రతిష్టాత్మక ‘సృష్టి సమ్మాన్‌’ పురస్కారం లభించింది. అహ్మదాబాద్‌లోని భగవత్‌ విద్యాపీఠంలో ఈ నెల 23 నుంచి 26 వరకు జరుగుతున్న సాత్విక్‌ సంప్రదాయక ఆహారోత్సవంలో సోమవారం విజయకుమార్‌కు గుజరాత్‌ మాజీ ప్రధాన కార్యదర్శి పి.కె. లహరి, ఐఐఎం అహ్మదాబాద్‌ డైరెక్టర్‌ భరత్‌ భాస్కర్, అహ్మదాబాద్‌ ఐఐఎం మాజీ ఆచార్యులు ప్రొ. అనిల్‌ కె గుప్తా జీవవైవిధ్యం విభాగంలో సృష్టి సమ్మాన్‌ పురస్కారాన్ని ప్రదానం చేశారు.

ప్రొ.అనిల్‌ కె గుప్తా నెలకొల్పిన సొసైటీ ఫర్‌ రీసెర్చ్‌ అండ్‌ ఇనీషియేటివ్స్‌ ఫర్‌ సస్టయినబుల్‌ టెక్నాలజీస్‌ అండ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ (సృష్టి) సంస్థ 1995 నుంచి ప్రతి ఏటా గ్రామీణ రైతు శాస్త్రవేత్తలు, జీవవైవిధ్యం పర్యావరణ పరిరక్షణకు విశేష కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలకు జాతీయ స్థాయిలో సృష్టి సమ్మాన్‌ పురస్కారాలు ప్రదానం చేస్తోంది. వైఎస్సార్‌ కడప జిల్లాలోని ఈవీ పల్లె గ్రామంలో పుట్టిన కొమ్మూరి విజయకుమార్‌ వర్షాధార భూముల్లో సేంద్రియ పద్ధతుల్లో చిరుధాన్యాల సాగును పునరుద్ధరించటానికి విశేష కృషి చేస్తున్నారు. చిరుధాన్యాల విత్తనాలను అనేక రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతులకు ఉచితంగా పంపిణీ చేయటం ద్వారా తిరిగి చిరుధాన్యాల సంప్రదాయ సేంద్రియ సాగు వ్యాప్తికి కృషి చేశారు.

స్థానికంగా లభించే అనేక మొక్కల వినూత్న కషాయాలను రూపొందించి రైతులకు అందిస్తూ సేంద్రియ వ్యవసాయంలో అనేక పంటలను ఆశించే చీడపీడల నియంత్రణకు విజయకుమార్‌ కృషి చేస్తున్నారు. ఆయన కృషిపై గత దశాబ్దకాలంగా అనేక కథనాలు ‘సాక్షి సాగుబడి’ పాఠకులకు సుపరిచితమే. ఆయనకు గతంలో బళ్లారికి చెందిన సఖి ట్రస్ట్, రైతునేస్తం ఫౌండేషన్‌ పురస్కారాలు లభించాయి. గతంలో ‘సృష్టి సమ్మాన్‌’ పురస్కారం అందుకున్న వారిలో ఖమ్మంకు చెందిన పర్యావరణ ఉద్యమకారుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత దరిపల్లి రామయ్య కూడా ఉన్నారు.

(చదవండి: అరుదుగా కనిపించే భారీ నిమ్మకాయలు.. చూసేందుకు క్యూ కడుతున్న జనాలు!)

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement