తెలుగు పండగ.. తెంగ్లిష్ శుభాకాంక్షలు | English Wishes For Telugu Ugadi | Sakshi
Sakshi News home page

తెలుగు పండగ.. తెంగ్లిష్ శుభాకాంక్షలు

Mar 30 2025 3:42 PM | Updated on Mar 31 2025 9:04 AM

English Wishes For Telugu Ugadi

ఒకసారి కర్ణాటక లోని కూర్గ్ ట్రెక్ కి వెళ్ళాను.. సాహసికుల పరిచయాలు అయ్యాయి.. ఇంతలో ఒక కన్నడ మిత్రుడు నా దగ్గరికి వచ్చి.. "మీ తెలుగు రాష్ట్రాల నుంచి నువ్వే వచ్చావా?... అంటూ వచ్చీరాని తెలుగులోనే పలకరించాడు.

.. మరో ఇద్దరు తెలుగు వాళ్ళు కూడా వచ్చారని.. వారిని చూపించాను... ఆ ఇద్దరిని చూసి.. "నువ్వు చెప్పింది నిజమేనా?.. తెలుగు వాళ్లేనా?" అన్నాడు.

"మరేం లేదు.. వచ్చినప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఇంగ్లిష్ లేదా  హిందీ లో సంభాషిస్తుంటేనూ... అంటూ నసిగాడు..

ఆయన చెప్పింది నిజమే.. అదేదో 30 రోజుల్లో ఆంగ్లం, హిందీ నేర్చుకోవడం ఎలాగో సాధన చేస్తున్నట్టు.. ఇద్దరూ కూడబలుక్కుని తెలుగు తప్ప ఆంగ్లం, హిందీలో మాట్లాడుతుండటం గమనించాను..

"మా తెలుగు వాళ్ళం... ఏ ఇద్దరం కలుసుకున్నా.. తెలుగులో తప్ప మిగిలిన భాషల్లో మాట్లాడుకుంటామ్... అంతే".. అని కన్నడ మిత్రుడికి సమాధానం ఇచ్చి వెళ్ళిపోయాను. నా మాటల్లో వెటకారం అర్థమైన కన్నడ మిత్రుడు నవ్వుకున్నాడు..

ఈ జ్ఞాపకం ఇప్పుడు ఎందుకంటే.. 
ఈ రోజు ఉదయం నుంచి "హ్యాపీ ఉగాది".. అంటూ శుభాకాంక్షల వెల్లువ...

పైగా "ఎంజాయ్ ఉగాది... హౌ డూ యూ సెలబ్రేట్ ఫెస్టివల్ బ్రో".. అంటూ సందేశాలు.. .

తెలుగువారి పండగైన మకర సంక్రాంతికి.. హ్యాపీ పొంగల్ (ఇది కేవలం తమిళులది) అంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. మీ పరాయి మోజు పాడుగాను..

ఉండేది.. అమెరికా అయినా.. అన్నవరమైనా.. కనీసం తెలుగు వారి దగ్గరైనా.. తెలుగు పండగ రోజయినా.. తెలుగులో వెలగండి. మాతృభాషలో మాట్లాడుకునే మన పొరుగు రాష్ట్రాల సోదరుల్ని చూసైనా మారండి..

అందరికీ ఉగాది శుభాకాంక్షలు..
- బాలు అయ్యగారి

Advertisement
 
Advertisement
Advertisement