ఇస్లాం వెలుగు
మానవ సంబంధాలన్నింటిలోకి అత్యంత పవిత్రమైనది ’సహోదరత్వం’. అయితే నేటి సమాజంలో స్వార్థం, అహంకారం పెరిగిపోయి ఇతరుల హక్కులను కాలరాయడం, బలహీనులపై దౌర్జన్యం చేయడం సర్వసాధారణమైపోయింది. కానీ, ఇస్లామీయ బోధనల ప్రకారం దౌర్జన్యం (జులుమ్) అనేది అల్లాహ్ దృష్టిలో క్షమించరాని మహాపరాధం.
దౌర్జన్యం అంటే ఏమిటి?
అరబీలో ’మజాలిమ్’ అంటే అకారణంగా ప్రజలను వేధించడం, ఒకరి ఆస్తిని అక్రమంగా కబళించడం మరియు ఒకరి హక్కులను బలవంతంగా లాక్కోవడం. వివేకవంతులైన విశ్వాసులు అల్లాహ్ హెచ్చరికను గుర్తుంచుకోవాలి: ‘దుర్మార్గులు చేస్తున్న దానిని అల్లాహ్ పట్టించుకోవడం లేదని భావించకండి. ఆయన వారిని శిక్షించే రోజును వాయిదా వేస్తున్నాడు మాత్రమే.‘ ఆనాడు ఏ అధికార బలగం, ఏ సంఖ్యా బలం వారిని రక్షించలేదు.
పరలోకంలో శిక్షా రూపం
ప్రవక్త ముహమ్మద్ (సఅసం) హెచ్చరించినట్లుగా, ఈ లోకంలో ఇతరులపై చేసే దౌర్జన్యం ప్రళయదినాన దట్టమైన చీకటిగా మారుతుంది. పీడితుని ఆక్రందనకూ, అల్లాహ్ కీ మధ్య ఎలాంటి అడ్డుతెర ఉండదు. ఒక వ్యక్తి వేరొకరి జానెడు భూమిని అన్యాయంగా ఆక్రమిస్తే, ప్రళయదినాన ఏడు భూభాగాల గుదిబండను అతని మెడలో వేయడం జరుగుతుంది. ఇది కేవలం భూమికే కాదు, ఇతరుల మాన మర్యాదలను మంటగలిపేవారికి కూడా వర్తిస్తుంది.
అసలైన సహాయం: బాధితునికీ, దౌర్జన్యపరునికీ!
మత సామరస్యం, సామాజిక న్యాయం వెల్లివిరియాలంటే ముస్లింలు తమ తోటి సోదరులకు అండగా ఉండాలి. ప్రవక్త (సఅసం) ఒక అద్భుతమైన సూత్రం చెప్పారు: ‘మీ సోదరునికి అతను దౌర్జన్యపరుడైనా, బాధితుడైనా తోడ్పడండి. బాధితునికి సహాయం చేయడం అంటే అతనికి న్యాయం జరిగేలా చూడటం. మరి దౌర్జన్యపరునికి సహాయం చేయడం అంటే ఏమిటి? అతను అన్యాయం చేయకుండా అతని చేతిని పట్టుకోవడం, అతన్ని తప్పు నుండి మళ్ళించడం.
క్షమ – ప్రాయశ్చిత్తం
ఒక వ్యక్తి చేసిన పాపాలను అల్లాహ్ క్షమిస్తాడేమో కానీ, తోటి మనిషికి చేసిన అన్యాయాన్ని ఆ బాధితుడు క్షమించే వరకు అల్లాహ్ కూడా క్షమించడు. అందుకే పారలౌకిక విచారణ రాకముందే, ఈ లోకంలోనే బాధితుని వద్ద క్షమాపణ పొంది, వారి హక్కులను తిరిగి చెల్లించాలి. లేదంటే, పుణ్యాలన్నీ బాధితుని ఖాతాలోకి వెళ్లిపోయి పాపాలే మిగిలే ప్రమాదం ఉంది.
ఆక్రందనలు అరణ్య రోదనలు కావు
లోకంలో పీడితుల ఆక్రందనలు అరణ్య రోదనలు కావు. న్యాయం ఆలస్యం కావచ్చు కానీ తప్పక జరుగుతుంది. ఒక విశ్వాసి మరో విశ్వాసికి భవనంలోని ఇటుకల వలె ఒకరికొకరు బలం చేకూర్చుకోవాలి. అప్పుడే సమాజంలో శాంతి, అల్లాహ్ కారుణ్యం లభిస్తాయి. క్షమించడం, సర్దుకుపోవడం అనేది కేవలం బలహీనత కాదు, అది ఒక గొప్ప సాహసం, దృఢ సంకల్పం.
– ముహమ్మద్ ముజాహిద్


