దెయ్యప్పిల్ల | Disaster Girl Zoe Roth recreates the iconic meme 20 years later | Sakshi
Sakshi News home page

దెయ్యప్పిల్ల

Jun 8 2025 12:49 AM | Updated on Jun 8 2025 5:51 AM

Disaster Girl Zoe Roth recreates the iconic meme 20 years later

జో రోత్‌ (నాలుగేళ్ల వయసులో): ఇదే ఐదు లక్షల డాలర్‌ల ఫొటో!!

పాపం మంచమ్మాయే! ‘దెయ్యప్పిల్ల’ అని పేరొచ్చేసిందంతే. అసలు పేరు జో రోత్‌(Girl Zoe Roth). ఆమె నాలుగేళ్ల వయసులో తండ్రి తీసిన ‘విపత్తు’ ఫొటోపై ఇరవై ఐదేళ్లుగా ఇంటర్నెట్‌లో ‘మీమ్స్‌’ వస్తూనే ఉన్నాయి. ఎక్కడైనా ఏదైనా పెద్ద విపత్తు సంభవించింది అనుకుందాం. ఆ విపత్తు ఫొటోను, ఈ పాప ఫొటోను జాయింట్‌ చేసి ఇంటర్నెట్‌లోకి వదిలేస్తుంటారు ‘మీమర్స్‌’. టైటానిక్‌ నౌక ఎప్పుడో వందేళ్ల క్రితం కదా మునిగిపోయింది.

ఆ ఫొటోక్కూడా ఈ పాప ఫొటోను తగిలించేశారు. సరదాకే అనుకోండి. ఆ చిన్నారి ఇప్పుడు ముప్పై ఏళ్ల యువతి అయింది. ఇటీవలే తన చిన్నప్పటి ‘విపత్తు ఫొటో’లో తనెక్కడైతే నిలబడి ఉందో సరిగ్గా అక్కడే నిలబడి ఫొటో తీయించుకుని ఆ ఫొటోను సోషల్‌ మీడియాలో పెట్టింది. సీన్‌ని రీక్రియేట్‌ చేసిందన్నమాట! ఇదంతా సరే, అసలు పాతికేళ్ల క్రితం నాటి జో రోత్‌ ఫొటోపై సోషల్‌ మీడియాలో ఇప్పటికీ మీమ్స్‌ ఎందుకు వస్తున్నాయి?

ఓసారి 2005లోకి వెళ్దాం. ఇయర్‌ సరే. ప్లేస్‌ ఎక్కడ? అమెరికాలోని నార్త్‌ కరోలినా. అప్పుడు జో రోత్‌ వయసు 4 సంవత్సరాలు. ఆ రోజు.. వీధిలో ఏదో కాలిపోతున్నట్లు పొగలు వస్తుంటే చుట్టు పక్కల వాళ్లు ఇళ్లల్లోంచి బయటికి వచ్చారు. జో రోత్‌ ఇంట్లోంచి ఆమె తండ్రి డేవ్, ఆమె వచ్చారు. డేవ్‌ ఫొటోగ్రాఫర్‌. అతడి మెడలో ఎప్పుడూ కెమెరా వేలాడుతూ ఉంటుంది. ఇంట్లోంచి వాళ్లొచ్చి చూసేటప్పటికి బయట ఎవరిదో ఇల్లు కాలిపోతోంది! అగ్ని మాపక సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. డేవ్‌కు వెంటనే ఒక ఆలోచన వచ్చింది. కెమెరాను సెట్‌ చేసుకుని, ‘‘తల్లీ.. ఫొటోకు పోజ్‌ ఇవ్వరా..’’ అన్నాడు.

బ్యాక్‌ డ్రాప్‌లో కాలిపోతున్న ఇంటి మంటలు. వాటి ముందు రోత్‌. ఇదీ యాంగిల్‌. తండ్రి చెప్పినట్లే రోత్‌ పోజ్‌ ఇచ్చింది. ‘‘కొంచెం నవ్వు ముఖం పెట్టు’’ అన్నాడు! తనకేం తెలుసు. తండ్రి స్మైల్‌ అన్నాడు కాబట్టి స్మైల్‌ ఇచ్చింది. ఇల్లు కాలిపోతుంటే నవ్వుతున్నట్లుగా ఉంది జో రోజ  ఆ ఫొటోలో!

జో రోత్‌ సీన్‌ రీక్రియేషన్‌ ఫొటో  

ఐదు లక్షల డాలర్ల ఫొటో!
ఆ ఫొటోలో రోత్‌ నవ్వు ‘డెవిలిష్‌’గా ఉంది. అంటే దెయ్యప్పిల్ల నవ్వుతున్నట్లు! రెండేళ్ల తర్వాత ఆ ఫొటోను ఏదో పోటీకి పంపుతూ ‘డిజాస్టర్‌ గర్ల్‌’ అనే పేరు పెట్టాడు డేవ్‌. ప్రైజ్‌ వచ్చింది. అలా ఆ ఫొటో ప్రపంచానికంతటికీ తెలిసింది. అప్పట్నుంచీ జో రోత్‌ ‘డిజాస్టర్‌ గర్ల్‌’ అయింది. ప్రపంచంలో ఎక్కడైనా ఘోరం జరిగితే ఫొటోషాప్‌ తెలిసిన సృజనశీలురు ఆ ఘటనకు, రోత్‌ చిరునవ్వు ఫొటోను కలిపి సోషల్‌ మీడియాలో పెట్టేవారు.

అలా ఆ ఫొటో ఇంకా పాపులర్‌ అయింది. స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలితే రోత్‌ ఫొటో. సునామీలు వస్తే రోత్‌ ఫొటో. ఘోర ప్రమాదాలు జరిగితే రోత్‌ ఫొటో. అలా నెట్‌లో, వార్తాపత్రికల్లో తరచు తన చిన్ననాటి ఫొటోని చూస్తూ పెరిగింది రోత్‌. ఇప్పుడు ముప్పై ఏళ్ల యువతి అయింది. అప్పటి చిరునవ్వులో మాత్రం మార్పులేదు. అన్నట్లు – ఐదేళ్ల క్రితం ఆ ‘విపత్తు ఫొటో’ ఒరిజినల్‌ ఐదు లక్షల డాలర్లకు వేలంలో అమ్ముడైంది. 

రోమ్‌ తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడన్నట్లు – ఆ రోజు రోత్‌ తండ్రి డేవ్‌ ఎందుకు అలా వెనుక మంటలు, ముందు కూతురి చిరునవ్వులు కలిపి ఫొటో తీసినట్లు! ఎప్పటికైనా ఆ ఫొటో భారీ ధరకు అమ్ముడుపోతుందని ముందే ఊహించాడా? లేదు లేదు. ఊరికే అతడికో సరదా ఆలోచన  వచ్చింది.

ఆ సరదా ఆలోచన కూడా ఎందుకొచ్చిందంటే.. పొగని చూసి హడావిడిగా బయటికి వచ్చారు తండ్రీ కూతుళ్లు.. అయితే అది అగ్ని ప్రమాదం కాదనీ, అగ్ని మాపకదళం వారే ట్రైనింగ్‌లో భాగంగా ఒక సెట్టింగ్‌ను తగలబెట్టి మంటల్ని ఆర్పుతున్నారని తెలిసి ఆశ్చర్యపోయి, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని, ఆ సంతోషంలో కూతురి ముఖంలో నవ్వుల్ని పూయించాడు డేవ్‌. ఆ ఫొటోని చూస్తే ఎవరికైనా వెంటనే వచ్చే ఆలోచన.. ‘‘ఏంటీ పిల్ల.. ఇల్లు తగలబడిపోతుంటే నవ్వుతూ చూస్తోంది!’’... అనే కదా. అలాంటి ఆలోచన రప్పించడం కోసమే డేవ్‌ అలా ఫొటో తీశాడు. అనుకోకుండా ఫొటోగ్రాఫర్‌గా ఆయనకు పేరు, ఫొటోలో ఉన్న చిన్నారిగా రోత్‌కు భారీగా డబ్బూ వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement