
‘కమలజ ఘటనా సమయంబైన, నసంభావ్యములైనను సంభవించు’ నన్నాడు ‘సింహాసన ద్వాత్రింశిక’ కావ్యకర్త కొఱవి గోపరాజు. ఆదిదేవుడైన శ్రీహరి నాభికమలం నుండి పుట్టిన బ్రహ్మ దేవుడి తలపుల నుంచి ఉద్భవించినవే స్థావర జంగమాత్మకమైనట్టి ఈ సృష్టిలోని సకల చరాచర వస్తు సంచయమంతా! బ్రహ్మదేవుడు అనుకోవాలేగాని, ఇదెలా సాధ్యం అనిపించేవి కూడా జరుగుతాయి.
ప్రహ్లాదుడు హరిభక్తుడు. ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు హరిద్వేషి. హిరణ్యకశిపుడంటే ముల్లోకాల జనులకు భయమే. దేవతలచే, దేవతల సంతతిచే, దైత్యులచే, గ్రహములచే, తారకలచే, మునుల చేత, అగ్ని, వాయువు, యముడు, నరులు, గిరులు, తరులు, పశు పక్ష్య మృగ కీటకాదుల చేతిలో, ఏరకమైన ఆయుధముల వలన, అవని పైన, అంతరిక్షంలోను, పగటియందు, రాత్రియందు తనకు మరణం కలగకుండా బ్రహ్మ దేవుడి నుండి పొందిన వరంతో హిరణ్యకశిపుడి ఆగడాలకు అంతం లేకుండాపోయింది. అందరూ సుఖంగా ఉండాలంటే హిరణ్యకశిపుడి మరణం ఒక్కటే మార్గం కాగా, ఆ మరణం ఇలా సంభవమైందని ఈ కింది పద్యంలో చెప్పాడు కొఱవి గోపరాజు.
కం. ఇది మానిసి యిది సింగం / బిది దేవత యను వివేక మెడలగ బలసం
పద నుక్కుగంబమున హరి / యుదయింపడె దైత్యవరుని నుక్కడగింపన్.
‘ఇది మనిషి, ఇది సింహము, ఇది దేవత అని గుర్తించి, విడదీసి చెప్పడానికి వీలు లేని విధంగా... అటు భూమి మీద గాని, ఇటు ఆకాశం గాని కాకుండా, మహోగ్ర రూపంలో ఉక్కు స్తంభం నుండి నృసింహావతారంలో హిరణ్య కశ్యపుడిని పరిమార్చడానికి ఉదయించాడు కదా శ్రీహరి’ అని పై పద్యం భావం. కనుక బ్రహ్మదేవుడి వినూత్న సృష్టికి సమయం ఆసన్నమైతే సంభవం కాదనుకున్నది కూడా సంభవమై కనపడుతుంది.
ఇదీ చదవండి : బంగారం కాదు..కానీ కిలో కోటి రూపాయలు
– భట్టు వెంకటరావు