తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్! కూతురు మరణం దిగమింగి మరీ వాయనాడ్‌..! | Deepa Joseph Returned to Duty After Daughters Death To Assist In Wayanad Landslides | Sakshi
Sakshi News home page

తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్! కూతురు మరణం దిగమింగి మరీ వాయనాడ్‌..!

Aug 12 2024 5:23 PM | Updated on Aug 12 2024 5:25 PM

 Deepa Joseph Returned to Duty After Daughters Death To Assist In Wayanad Landslides

కేరళలో ప్రకృతి ప్రకోపానికి శవాల దిబ్బగా మారింది వాయనాడ్‌. కొండచరియలు వాయనాడ్‌ని తుడిచిపెట్టేశాయి. ఈ ఘటనలో మొత్తం 295 మంది మృతి చెందారు. వాయనాడ్‌ విషాదం ఎందరినో కదిలించింది. ప్రముఖులు, సెలబ్రెటీలు తమ వంతుగా బాధితులకు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు కూడా. అయితే ఈ ఘటనలో ఎన్నో కన్నీటి కథలు, వ్యథలు ఉన్నాయి. ఈ విషాద ఘటనలో ఒక మహిళ తమ వ్యక్తిగత బాధను పక్కన పెట్టి మరీ ప్రజలను కాపాడేందుకు ముందుకు వచ్చి అందరిచేత ప్రశంసలందుకుంది. ఆమెనే దీపా జోసెఫ్‌. ఎవరంటే ఆమె..!

కేరళలో తొలి మహిళా అంబులెన్స్‌ డ్రైవర్‌ దీపా జోసెఫ్‌. దారుణ వినాశనాన్ని చవిచూసిన వాయనాడ్‌లో తన అంబులెన్స్‌ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించింది. ఈ విపత్కర పరిస్థితుల నుంచి బాధితులు రక్షించి నిస్వార్థంగా సహాయ సహకారాలు అందించింది. తమ ప్రియమైన వారిని పోగొట్టుకున్న వారికి తన వంతుగా సాయం అందించి ఆయా మృతదేహాలను వారికి చేరవేసింది. ఆ ఘటనలో బాధితుల మృతదేహాలను అందజేసేటప్పుడూ కొన్ని దృశ్యాలు మెలితిప్పేసేవని చెబుతోంది దీపా. ఒక్కోసారి తనకు కూడ కన్నీళ్లు ఆగేవి కావని చెబుతోంది. 

ఎవరంటే ఆమె..?
కరోనా మహమ్మారి సమయంలో దీపా జోసెఫ్‌ కాలేజీ బస్సు డ్రైవర్‌గా ఉద్యోగం కోల్పోయింది. ఆ తర్వాత కుటుంబ జీవనాధారం కోసం అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేయడం ప్రారంభించింది. కేరళలో ఈ వృత్తిలో పనిచేస్తున్న తొలి మహిళ దీపానే కావడం విశేషం. సవాళ్లతో కూడిన ఈ వృత్తిలో చాలా ధైర్యంగా సాగిపోయింది దీపా. అయితే వ్యక్తిగత విషాదం కారణంగా తన వృత్తి నుంచి కొన్ని రోజులు విరామం తీసుకుంది. తన కన్న కూతురు బ్లడ్‌ కేన్సర్‌తో చనిపోవడంతో డిప్రెషన్‌కి వెళ్లిపోయింది దీపా. దీంతో విధులకు గత కొద్ది రోజులుగా దూరంగానే ఉండిపోయింది.

వాయునాడ్‌ దుర్ఘటన గురించి విని మళ్లీ విధుల్లోకి వచ్చి బాధితులకు తన వంతుగా సాయం అందించింది. తన బాధను దిగమింగి ప్రజలకు నిస్వార్థంగా సాయం అందించింది. నిరంతరం రోడ్లపై ప్రజలకు అందుబాటులో ఉంటూ..సహాయ సహకారాలు అందించి అందరిచేత ప్రశంసలందుకుంది దీపా. కాగా, ఆమె నాటి విషాద దృశ్యాలను గుర్తు చేసుకుంటూ..బాగా కుళ్లిపోయిన మృతదేహాలను కూడా తరలించినట్లు తెలిపింది. కొన్ని ఘటనల్లో అయితే తెగిపోయిన అవయవాల ఆధారంగా తమ వాళ్లను గుర్తించాల్సిన పరిస్థితి చూసి తట్టుకోలేకపోయానని చెప్పుకొచ్చింది దీపా. 

ఈ అనుభవాలను తనను తీవ్రంగా ప్రభావితం చేశాయని, అదే తన బాధను పక్కన పెట్టి సాయం చేయాలనే దిశగా పురిగొల్పిందని అంటోంది దీపా. ప్రస్తుతం తానింకా విధుల్లోకి వెళ్లడం లేదు కానీ ఇక నుంచి పూర్తి స్థాయిలో అంబులెన్స్‌డ్రైవర్‌గా పనిచేస్తానని తెలిపింది. నిజంగా గ్రేట్‌ జీవనాధారం కోసం ఈ వృత్తిని ఎంచుకున్నా.. వ్యక్తిగత విషాదంతో పనికి దూరమయ్యింది. కానీ ఆ బాధను కూడా పక్కనపెట్టి వాయనాడ్‌ విషాదంలోని బాధితులకు సాయం చేసేందుకు ముందుకు రావడం అనేది నిజంగా ప్రశంసనీయం, స్ఫూర్తిదాయకం కూడా.

(చదవండి: గాయకుడు అద్నానీ ఇంట ఇర్ఫాన్‌ పఠాన్‌కి భారీ విందు..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement