యువ దంప‌తుల విషాదం | Kerala Couple Reshma and Jinesh Sukumaran Tragedy | Sakshi
Sakshi News home page

యువ దంప‌తుల విషాదం.. ఎవ‌రీ రేష్మ‌, జినేష్?

Jan 3 2026 3:02 PM | Updated on Jan 3 2026 3:07 PM

Kerala Couple Reshma and Jinesh Sukumaran Tragedy

విదేశాల్లో భ‌ర్త‌, సొంతూరిలో భార్య మృతి

ఒక్కోసారి అంతే. జీవితం ఎప్పుడు ఎలాంటి మ‌లుపు తిరుగుతుందో ఎవ‌రూ ఊహించ‌లేరు. అంతా బాగానే ఉంద‌నుకున్న స‌మ‌యంలో అనుకోని విధంగా ఏదైనా జ‌రిగితే జీవితం త‌ల‌కిందులవుతుంది. అంతా చీక‌టి అవుతుంది. రేష్మ జీవితంలోనూ అలాగే జ‌రిగింది. ఊహించ‌ని విధంగా భ‌ర్త చ‌నిపోవ‌డంతో ఆమె బాగా కుంగిపోయింది. త‌న భ‌ర్త మ‌ర‌ణానికి కార‌ణం తెలుసుకునేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌క‌పోవ‌డంతో విర‌క్తితో తాను కూడా అర్థాంత‌రంగా త‌నువు చాలించింది. ఎవ‌రీ రేష్మ‌, ఆమె క‌థేంటి?

అస‌లేం జ‌రిగింది?
కేర‌ళ (Kerala) వయనాడ్‌లోని కొలయాడి గ్రామానికి చెందిన‌ 32 ఏళ్ల రేష్మ విషం తాగి బుధవారం (డిసెంబ‌ర్ 31) మరణించింది. 5 నెలల క్రితం ఆమె భ‌ర్త జినేష్ సుకుమారన్ (38) ఇజ్రాయెల్‌లో అనుమానాస్ప‌ద ప‌రిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయాడు. గత జూలైలో జెరూసలేంకు స‌మీపంలో ఉన్న మెవాస్సెరెట్ ప‌ట్ట‌ణంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉరేసుకుని చ‌నిపోయిన‌ట్టు అక్క‌డి పోలీసులు గుర్తించారు. అక్క‌డే 80 ఏళ్ల వృద్ధురాలు కూడా క‌త్తి గాయాల‌తో చనిపోయి కనిపించింది. మంచాన పడిన ఆ మహిళ భర్తను చూసుకోవడానికి సంర‌క్షుడిగా జినేష్ ఉద్యోగం చేసేవాడు. కాగా, వృద్ధురాలిని చంపి అత‌డు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌న్న అనుమానాలు అప్ప‌ట్లో వ్య‌క్త‌మ‌య్యాయి. అయితే ఈ ఆరోప‌ణ‌ల‌ను రేష్మ తోసిపుచ్చింది.

వీడ‌ని మిస్ట‌రీ..
త‌న భ‌ర్త మ‌ర‌ణానికి గ‌ల కార‌ణాలు తెలుసుకునేందుకు రేష్మ శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించింది. జినేష్ మ‌ర‌ణం వెనుకున్న మిస్ట‌రీని ఛేదించాల‌ని ప‌లుమార్లు ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయానికి వెళ్లి స్వ‌యంగా విన్న‌వించుకుంది. ఈ కేసులో కోర్టు పరిధిలో ఉంద‌ని ఆమెకు స‌మాధానం వ‌చ్చేది త‌ప్పా ఎటువంటి పురోగ‌తి ల‌భించ‌లేదు. జినేష్ అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకుని కనిపించగా, ఆ వృద్ధురాలు కత్తిపోట్ల గాయాలతో మరణించిన‌ట్టు మాత్ర‌మే ఆమెకు రాయ‌బార కార్యాల‌యం తెలిపింది. వయనాడ్‌కు తిరిగి వచ్చిన తర్వాత భార‌త ప్ర‌భుత్వంతో పాటు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించింది.   నెల‌లు గడుస్తున్నా ఎటువంటి పురోగ‌తి లేక‌పోవడంతో నిరాశ‌తో రేష్మ బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. త‌ల్లితండ్రులు ఇద్ద‌రూ చ‌నిపోడంతో ప‌దేళ్ల వారి కుమార్తె అనాథగా మిగిలింది.

ఇజ్రాయెల్‌కు వెళ్లిన 2 నెల‌ల‌కే.. 
ఊహించ‌ని విధంగా భ‌ర్త ప్రాణాలు కోల్పోవ‌డంతో రేష్మ బాగా కుంగిపోయింద‌ని కొలయాడి పంచాయతీ మాజీ సభ్యురాలు సుజా జేమ్స్ తెలిపారు.  “జినేష్ మరణం తర్వాత రేష్మ తీవ్ర నిరాశకు గురైంది. వృద్ధురాలిని చంపిన తర్వాత తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె అస్సలు నమ్మలేదు. త‌న భ‌ర్త హ‌త్య చేసేంత క‌ర్కోఠ‌కుడు కాద‌ని ఆమె న‌మ్మ‌కం. అసలేం జ‌రిగిందో క‌నిపెట్టాల‌ని అధికారులకు చాలా ఆమె ఈ-మెయిళ్లు పంపింది, కానీ ప్రయోజనం లేకపోయింది” అని మీడియాతో చెప్పారు.

చ‌ద‌వండి: ఇండియా అబ్బాయి.. జ‌పాన్ అమ్మాయి!

ఇజ్రాయెల్‌కు వెళ్ల‌డానికి ముందు మెడిక‌ల్ రిప్రజెంటేటివ్‌గా జినేష్ ప‌నిచేశాడ‌ని, గ్రాడ్యుయేట్ అయిన రేష్మ ఇంట్లోనే ఉండేద‌ని సుజా జేమ్స్ తెలిపారు. కొలయాడిలో క‌ట్టుకున్న ఇల్లు అప్పులు తీర్చ‌డానికే జినేష్ ఇజ్రాయెల్‌కు వెళ్లిన‌ట్టు వెల్ల‌డించారు. వీసా కోసం చాలా డ‌బ్బులు ఖ‌ర్చు చేశాడ‌ని కూడా తెలిపారు. మ‌రోవైపు ఇజ్రాయెల్ ప్రభుత్వం నుంచి రేష్మ‌కు ఎటువంటి ప‌రిహారం అంద‌లేదు. జినేష్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్టుగా అక్క‌డి అధికారులు న‌మోదు చేశారు. జినేష్ ఇజ్రాయెల్‌కు వెళ్లి కేవలం రెండు నెలలు మాత్రమే అవ‌డంతో ఎటువంటి ప‌రిహారం ద‌క్క‌లేదని వివ‌రించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement