ప్రవర్తన... పర్యవసానం

Conduct and its consequences Special Story - Sakshi

ప్రవర్తన, దాని పర్యవసానం మనిషి ప్రగతి, పతనాలకు కారణాలవుతాయి. మనిషి ప్రవర్తన తనకో, తన పక్కనున్న వ్యక్తికో, సమాజానికో పతనకారణం కాకూడదు. ప్రవర్తన కారణంగా మనిషంటే మనిషికి భయంగా ఉంటోంది, మనిషి వల్ల మనిషికి హాని జరుగుతోంది. ఇంతకీ ప్రవర్తన పర్యవసానాలేమిటి?

’నేను సరిగానే ప్రవర్తిస్తున్నానా?’ అని ప్రతి మనిషీ తన ప్రవర్తనను తాను పరిశీలించుకుంటూ ఉండాలి. ఈ అర్థాన్నిస్తూ ‘ప్రత్యహం ప్రత్యవేక్షేత నర శ్చరిత మాత్మనః / కింసు మే పశుభిస్తుల్యం కింసు సత్పురుషై రివ‘ అని కొన్ని శతాబ్దుల క్రితం కాళిదాసు (తన కావ్యం రఘువంశంలో) చెప్పాడు. కాళిదాసు చెప్పినట్టు ప్రతి మనిషికీ తన ప్రవర్తనను తాను పరిశీలించుకుంటూండే అభ్యాసమో, అలవాటో ఆ కాలం నుంచే ఉండుంటే బావుండేది.

మన సమాజంలో నేరాలు, ఘోరాలూ, శత్రుత్వం వంటివి లేకుండా పోయేవి. లోకంలో అమానుషత్వం ఇంతలా వ్యాపించి ఉండేది కాదు. మనిషికి మనిషి వల్ల కష్టాలు, నష్టాలు కలుగుతూండకపోయేవి. మన జీవనాలు ప్రశాంతంగా సాగుతూండేవి. ఏ మనిషీ కూడా తాను ’పశువులాగా ప్రవర్తిస్తున్నాడా? లేక సత్పురుషుడిలాగా ప్రవర్తిస్తున్నాడా’ అని నిజాయితీతో పరిశీలించుకోవడం లేదు.

చైనా కవి, తాత్త్వికులు లావొచు ఒక సందర్భంలో ఇలా అన్నారు: ‘నేను మూడు విషయాల్ని మాత్రమే బోధిస్తాను...
సరళత, ఓర్పు, కనికరం. ఈ మూడూ నీ మహానిధులు. సరళత పనుల్లోనూ, ఆలోచనల్లోనూ ఉంటే నువ్వు నీ ఉనికికి ఆధారమైనదానికి మరలుతావు.

ఓర్పుగా మిత్రులతోనూ, శత్రువులతోనూ ఉంటే, నువ్వు విషయాల వాస్తవికతతో కలుస్తావు. కనికరాన్ని నీపైనే చూపించుకుంటే, నువ్వు ప్రపంచంలోని అన్ని ప్రాణులతోనూ పునరైక్యమౌతావు‘. లావొచు చెప్పిన సరళత, ఓర్పు, కనికరం ఈ మూడూ మనిషి ప్రవర్తనలో నిండి ఉండాలి. అప్పుడే మనిషి పశువులాగా ప్రవర్తిస్తున్నాడా? అన్న పరిశీలనకు ‘కాదు‘ అని సత్పురుషుడిలాగా ప్రవర్తిస్తున్నాడా? అన్న పరిశీలనకు ‘అవును‘ అని జవాబులు వస్తాయి.

సత్పురుషులు వసంత ఋతువు వంటి వాళ్లనీ, వాళ్లు లోకహితాన్ని చేస్తారనీ, వాళ్లు శాంతం కలవాళ్లనీ, వాళ్లు గొప్పవాళ్లనీ ఆదిశంకరాచార్య ‘శాంతా మహాంతో నివసంతి సంతో వసంతవల్లోక హితం చరంతః‘ అంటూ చెప్పారు. వసంత ఋతువులాగా హితకరంగా ఉండాలంటే ప్రతి మనిషికీ ప్రవర్తన పునాది.

‘నీ నమ్మకాలు నిన్ను మేలైన వ్యక్తిని చెయ్యవు నీ ప్రవర్తన చేస్తుంది‘ అని అంటూ గౌతమ బుద్ధుడు మనిషికి సరైన దిశానిర్దేశం చేశాడు. ప్రతిమనిషీ తన నమ్మకాలకు అతీతంగా ప్రవర్తనను పరిశీలించుకుంటూ ఆ ప్రవర్తనను చక్కగా చెక్కుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.

’నేను పశువులాగా ప్రవర్తిస్తున్నానా? లేక సత్పురుషుడిలాగా ప్రవర్తిస్తున్నానా’ అని ప్రతి మనిషీ తన ప్రవర్తనను తాను పరిశీలించుకుంటూ ఉండాలి. ఆ పరిశీలన మనిషిని సత్పురుషుణ్ణి చెయ్యగలిగితే అప్పుడది సమాజానికి హితం ఔతుంది. ఆ పరిశీలనతో మనిషి సత్పురుషత్వాన్ని  పొందగలిగితే గొప్ప. అలా కాని పక్షంలో పశుత్వాన్నైనా తనంతతాను వదిలించుకోవాలి.

అంతటా అందరూ సుఖులై ఉండాలి, అందరూ రోగాలు లేనివాళ్లై ఉండాలి, అందరూ భద్రంగా ఉండాలి, ఏ ఒక్కరూ దుఃఖాన్ని పొందకుండా ఉండాలి అన్న ఆకాంక్ష ఒక పూర్వ శ్లోకం ‘సర్వత్ర సుఖిన స్సంతు సర్వే సంతు నిరామయాః / సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చి ద్దుఃఖభాగ్భవేత్‌‘ ద్వారా మనలో చాల కాలంగా ఉంది. ఈ ఆకాంక్ష సాకారమవాలంటే ప్రతి మనిషీ తన ప్రవర్తనను తాను పరిశీలించుకుంటూండాలి. రండి, ఒక అభ్యాసంగా, ఒక అలవాటుగా మనం మన ప్రవర్తనను పరిశీలించుకుంటూ ప్రశాంతతను సాధించుకుందాం.

జీవితంలో నీవు ఎవరిని కలవాలన్నదికాలం నిర్ణయిస్తుంది. నీకెవరు కావాలన్నది హృదయం నిర్ణయిస్తుంది. కానీ నీ దగ్గర ఎవరుండాలనేది నిర్ణయించేది నీ ప్రవర్తన మాత్రమే.

తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తే పిల్లలూ అలాగే ప్రవర్తిస్తారు. తల్లిదండ్రుల ప్రవర్తన బాగుండాలంటే తల్లిదండ్రులు తమ ప్రవర్తన గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది.

– రోచిష్మాన్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top