
మంచిమాట
మన జీవితంలో సవాళ్లు మనల్ని ముంచెత్తే తుఫానులా వస్తాయి. ఆ అలల తాకిడికి మన మనసు అలజడి చెందుతుంది. కానీ, ఆ తుఫాను మధ్యలో నిశ్చలంగా నిలబడిన కొండలా మనల్ని నిలబెట్టేదే ఓర్పు. బయటి ప్రపంచం ఎంత అల్లకల్లోలంగా ఉన్నా, మన అంతరంగంలో తుఫానులోనూ చెదరని ప్రశాంతతను నింపుకునే శక్తి ఇది. ఓర్పు కేవలం నిరీక్షించడం కాదు, అది ఆత్మబలానికి అసలైన నిర్వచనం.
ఓర్పు అనేది మనసును నియంత్రించే ఒక శక్తి. సనాతన ధర్మంలో ఇది ఒక అత్యున్నత విలువగా పరిగణించబడింది. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు కష్టాలను, సుఖాలను సమంగా చూడమని అర్జునుడికి ఉపదేశిస్తాడు. అదే నిజమైన జ్ఞానానికి, స్థిరత్వానికి పునాది అని వివరిస్తాడు.
క్షమా వీరస్య భూషణం
శక్తిమతాం క్షమా శ్రేయః
ఓర్పు అనేది వీరులకు ఆభరణం. శక్తిమంతులకు ఓర్పు ఒక గొప్ప ధర్మం. ఈ సూక్తి ఓర్పును బలహీనతగా కాకుండా, అత్యంత ఉన్నతమైన ధైర్యంగా, శక్తిగా గుర్తిస్తుంది. నిజమైన బలం శారీరక శక్తిలో కాదు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా శాంతంగా, స్థిరంగా ఉండగల మానసిక శక్తిలో ఉందని ఇది నొక్కి చెబుతుంది.
శానైర్గచ్ఛన్ శనైర్గచ్ఛన్ పంథాః
సంపూర్ణో భవతి
నెమ్మదిగా, ఓర్పుతో అడుగులు వేసేవాడు దారిని పూర్తిగా చేరుకుంటాడు. అంటే, ఓర్పుతో, నిలకడగా కృషి చేసేవారు ఖచ్చితంగా తమ గమ్యాన్ని చేరుకుంటారు. ఇది ఆధునిక జీవితంలో కూడా అంతే సత్యం. పరీక్షల్లో విజయం సాధించడానికి రోజూ కొంతసేపు చదవాలి, ఒక్కరోజులో కాదు. ఒక వ్యాపారం విజయవంతం కావడానికి ఎన్నో ఏళ్ల నిరంతర కృషి, ఓర్పు అవసరం. ఓర్పు అనేది మన లక్ష్యంపై మనకున్న నమ్మకాన్ని, నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.
క్షమా బలం అశక్తానాం,
శక్తానాం భూషణం క్షమా
ఓర్పు అనేది బలహీనులకు బలం, శక్తిమంతులకు ఆభరణం. ఓర్పును అలవరచుకోవడం ద్వారా బలహీనులు కూడా శక్తివంతులుగా మారగలరు. అది ఒక శక్తిమంతుని కీర్తిని, గౌరవాన్ని పెంచుతుంది. ఈ సూక్తి ఓర్పు సార్వత్రిక శక్తిని, అది అందరికీ ఎలా ప్రయోజనకరంగా ఉంటుందో స్పష్టం చేస్తుంది.
ఓర్పు అనేది కేవలం నిరీక్షించడం కాదు, అది జీవితాన్ని అర్థవంతంగా, ప్రశాంతంగా జీవించే ఒక గొప్ప కళ. ఓర్పును అలవరచుకోవడం ద్వారా మనం అనవసరమైన ఆందోళనల నుండి విముక్తి పొందవచ్చు, ప్రశాంతంగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. కష్టాల పర్వతాలను చిన్న మెట్లుగా మార్చగల శక్తి ఓర్పుకు మాత్రమే ఉంది. ఓర్పు అనే బలం మనకు జీవితంలో ఎలాంటి తుఫానులనైనా ఎదుర్కొనే ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఈ గొప్ప గుణాన్ని మన జీవితంలో నిత్యం సాధన చేయడం ద్వారా విజయం, ప్రశాంతత, ఆనందం తప్పక లభిస్తాయి.
భారతంలో సత్యవంతుడి భార్య సావిత్రి, తన భర్త జీవితం ముగిసే రోజున యమధర్మరాజు వెంట వెళ్లి, తన పట్టుదల, వాదన, అపారమైన ఓర్పుతో తన భర్త ప్రాణాలను తిరిగి తెచ్చుకుంది. ఈ కథ ఓర్పు దృఢ సంకల్పానికి ఉండే అద్భుత శక్తికి నిదర్శనం. అలాగే, హరిశ్చంద్రుడు తన సర్వస్వాన్ని కోల్పోయినా, చివరి క్షణం వరకు సత్యానికే కట్టుబడి ఉన్నాడు. ఆయన సత్యనిష్ఠకు, ఓర్పుకు అంతర్జాతీయంగా ప్రసిద్ధి.
ప్రఖ్యాత శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ విద్యుత్ బల్బును కనిపెట్టే క్రమంలో వేలసార్లు విఫలమయ్యారు. ప్రతి వైఫల్యం తర్వాత, ఆయన ‘ఈసారి పని చేయని ఇంకో మార్గాన్ని కనుగొన్నాను‘ అని ఓర్పుతో, పట్టుదలతో కృషి చేశారు. ఆయన ఓర్పు కారణంగానే ప్రపంచం చీకటి నుంచి వెలుగులోకి వచ్చింది. అలాగే, మహాత్మాగాంధీ తన జీవితంలో ఎదురైన ఎన్నో అవమానాలను, కఠిన పరిస్థితులను ఓర్పుతో ఎదుర్కొని, అహింసను, సత్యాగ్రహాన్ని తన ఆయుధాలుగా మలచుకున్నారు. ఆయన ఓర్పు, శాంతం, అకుంఠిత విశ్వాసంతో ప్రపంచంలోనే అతిపెద్ద బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఓడించి, భారతదేశానికి స్వాతంత్య్రం సాధించారు. ఇది ఓర్పుకు, దాని శక్తికి ఉన్నతమైన ఉదాహరణ.
– కె. భాస్కర్ గుప్తా
(వ్యక్తిత్వ వికాస నిపుణులు)