
అమెరికాకు చెందిన ప్రముఖ యూ ట్యూబర్ కేవలం 46 రోజుల్లో 11 కిలోల బరువు తగ్గడం విశేషంగా నిలుస్తోంది. అదీ 56 ఏళ్ల వయసులో జిమ్‌కు వెళ్లకుండానే, ఎలాంటి ట్రైనర్ లేకుండానే దీన్ని సాధించాడు. అన్నట్టు ఎలాంటి ఫ్యాషన్ డైట్ కూడా పాటించలేదు. మరి అతని వెయిట్ లాస్ సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందామా.
పసిఫిక్ నార్త్‌వెస్ట్‌లోనివసిస్తున్న 'మిస్టర్ రాంగ్లర్ స్టార్'గా పాపులర్ అయిన అమెరికన్ కోడి క్రోన్ తన వెయిట్ లాస్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. చాట్ జీపీటీ వంటి ఏఐ సాయంతో తన బరువు తగ్గే ప్లాన్‌ను పక్కాగా అమలు చేశాడు. విజయం సాధించాడు.
తన 56వ పుట్టిన రోజునాడు ఆరోగ్యం , ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడుకోడి క్రోన్. బరువు తగ్గాల్సిందే అని తీర్మానించుకున్నాడు. ఇందుకోసం AI ని ఆశ్రయించాడు. తన బరువు, ఎత్తు, జీవనశైలి, శారీరక స్థితిగతులను బట్టి చాట్ జీపీటీ సహాయంతో ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించుకున్నాడు. (6 నెలల్లో 27 కిలోలు తగ్గాను..ఇదంతా దాని పుణ్యమే!)
అలా చాట్‌జీపీటి సాయంతో 95 కిలోల నుండి 83 కిలోలకు బరువు తగ్గించుకున్నాడు కోడి. కేవలం ఒకటిన్నర నెలల్లో 25.2 పౌండ్లు (సుమారు 11.4 కిలోలు) కోల్పోయాడు. ఇందుకోసం అతను ఓజెంపిక్ లాంటి బరువు తగ్గించే మందులను ఉపయోగించ లేదు, వ్యక్తిగత కోచ్‌ను నియమించుకోలేదు. దీనికి బదులుగా ఇంట్లోనే చేయగలిగే సాధారణ వ్యాయామాలు, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు, జీవనశైలి మార్పులకు ప్రాధాన్యత ఇచ్చాడు. క్రమశిక్షణ, క్లీన్ ఈటింగ్, స్మార్ట్ సప్లిమెంటేషన్, వ్యాయామాలు ఇవే అతని సీక్రెట్స్.
కోడి క్రోన్ పాటించిన నియమాలు
పోషకాహారం & ఉపవాసం : లాంగ్ ఫాస్టింగ్ తరువాత రోజుకు రెండు సార్లు సంపూర్ణ భోజనాలు.
సాయంత్రం 5 గంటల తరువాత నో ఫుడ్
అల్పాహారం: 4 గుడ్లు, అర పౌండ్ లీన్ గ్రాస్-ఫెడ్ బీఫ్, స్టీల్-కట్ ఓట్స్ (తీపి లేనివి), ఆకుకూరల సప్లిమెంట్. ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెర, స్నాక్స్ . సీడ్ ఆయిల్స్ , పాల ఉత్పత్తులకు పూర్తిగా దూరం.
రాత్రి భోజనం: 1/3 కప్పు జాస్మిన్ రైస్, సుమారు 225 గ్రా. లీన్ స్టీక్, ఆలివ్ ఆయిల్ లేదా సగం అవకాడో.
సప్లిమెంట్లు: క్రియేటిన్, బీటా-అలనైన్, వె ప్రోటీన్, కొల్లాజెన్, మెగ్నీషియం మరియు ఇతర క్లీన్-లేబుల్ పెర్ఫార్మెన్స్ బూస్టర్‌లు
వర్కౌట్స్: ఇంట్లోనే పుల్-అప్ బార్, రెసిస్టెన్స్ బ్యాండ్‌లు, కెటిల్‌బెల్స్, డిప్ బార్ లాంటి వ్యాయామాలు చేసేవాడు. వారానికి ఆరు రోజులు, ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు వ్యాయామం.గంట నుంచి గంటన్నర పాటు ఎక్సర్‌పైజ్‌లు
స్లీప్: 7–8 గంటల నిద్ర. మంచి నిద్ర కోసం నిద్రవేళకు ఒక గంట ముందు స్క్రీన్స్ ఆఫ్. గది అంతా చీకటిగా ఉండేలా ఏర్పాటు.
రోజువారీ 4 లీటర్ల నీళ్లు తాగడం. అలాగే జీవక్రియ శక్తిని పెంచడానికి ప్రతిరోజూ ఉదయం 15–20 నిమిషాలు ఉదయం పూట సూర్యరశ్మి తగిలేలా చూసుకునేవాడు.
ట్రాకింగ్ ప్రోగ్రెస్: ప్రతి ఉదయం తన ఉపవాస బరువును చెక్ చేసుకునేవాడు. దీన్ని బట్టి AI ప్లాన్‌ను తు.చ తప్పకుండా పాటిస్తూ, ప్రణాళికను సర్దుబాటు చేసుకునేవాడు. దీంతో బరువు తగ్గడమే కాకుండాకీళ్ల నొప్పులు తగ్గాయి, మంచి నిద్ర, శక్తి వీటన్నిటితోపాటు, స్పష్టమైన ఆలోచన, మెరుగైన మానసిక ఆరోగ్యం కూడా లభించిందని చెప్పుకొచ్చాడు. 46 రోజుల్లో 11 కజీల బరువు తగ్గడం అనేది సాధారణ విషయం కాదు దీనికి ఎంతో పట్టుదల శ్రమ, ఉండాలి అంటున్నారు నెటిజన్లు.
ఖరీదైన జిమ్‌లు, ట్రైనర్లు లేకుండానే సరైన సమాచారంతో ఇంట్లోనే ఆరోగ్యకరంగా బరువు తగ్గొచ్చని కోడి క్రోన్ నిరూపించాడు. దీనికి సంబంధించి తన అనుభవాలను యూట్యూబ్ వీడియోల ద్వారా పంచుకుంటూ, ఇతరులకూ స్ఫూర్తినిస్తున్నాడు
నోట్: అంతర్లీనంగా మరేతర ఆరోగ్య సమస్యలు లేనపుడు బరువు తగ్గే విషయంలో అనుకున్న ఫలితాలు సాధించాలంటే ముందు నిబద్ధత అవసరం. పోషకాహారం తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ, మంచి నిద్ర, రోజుకు కనీసం మూడు లీటర్ల నీళ్లు తదితర సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే శారీరక ఆరోగ్యాన్ని పొందడం సాధ్యమే.