
ఒకనాడు యవ్వనంలో ఎంతో మిసమిసలాడుతున్న వ్యక్తి... వృద్ధాప్యం వచ్చేసరికి ఒళ్ళంతా ముడతలు పడిపోయి, దవడలు జారిపోయి, జుట్టు తెల్లబడిపోయి ఉండవచ్చు. కానీ భౌతికంగా ఎంత అందంగా ఉన్నారన్నది కాదు, కాలక్రమంలో అది నిలబడదు. భగవంతుడిచ్చిన విభూతులను వయసులో ఉన్నప్పుడే సక్రమంగా వాడుకుని ఆ అందాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఆ చివరి సమయంలో మనిషికి అందం – ఆయన అనుభవం, గతంలో ఆయన ప్రవర్తించిన తీరు, ఆయన నడవడిక మాత్రమే.
‘‘హస్తస్య భూషణం దానం, సత్యం కంఠస్య భూషణం, కర్ణస్య భూషణం శాస్త్రం, భూషణైః కిం ప్రయోజనం’’ చేతికి కంకణములు, కేయూరములు, అంగదములు, ఉంగరములు... ఇవన్నీ కూడా అలంకారాలే.. భగవంతుడిచ్చినప్పుడు వేసుకోవడంలో తప్పేమీ లేదు. కానీ అన్ని ప్రాణులలో ఉన్న ఆత్మ ఒక్కటే...అని.. అవతలి ప్రాణి కష్టాన్ని తన కష్టంగా భావించి ఆదుకోవడం కోసం తన చేతితో తనదైన దానిని ఇవ్వగలిగిన వాడు ప్రాజ్ఞుడు. ఆ చేతికి దానమే అతి పెద్ద అలంకారం. మిగిలిన అలంకారాలు తొలగిపోయినా... పైకి కనబడకపోయినా అది శాశ్వతంగా నిలిచిపోయే, వెలిగిపోయే అలంకారం. దానం చేయడం అంటే ఏమీ మిగుల్చుకోకుండా అని కాదు. తనకున్న దానిలో తన శక్తికొద్దీ ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయడం... అలా ఎందుకు? అంటే అలా చేయకుండా ఉండలేకపోవడమే మానవత్వం.
శరీరంలో ఎక్కువగా ఆభరణాలు అలంకరించుకునే అవయవం కంఠం. వాటిలో మంగళప్రదమైనవి, ఐశ్వర్య సంబంధమైనవి ఉంటాయి.. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ... మనిషిని భగవంతుడికి దగ్గరగా తీసుకెళ్ళేది... సత్య భాషణం. నిజాన్ని నిర్భయంగా, ప్రియంగా మాట్లాడడం. సత్యాన్ని మించిన ఆభరణం మరేదీ కంఠానికి అంత శోభనివ్వదు. ఇతర ఆభరణాలను తీసినట్లుగా ఈ ఆభరణాన్ని తీయడం అసాధ్యం. భగవంతుడు మనకు రెండు చెవులిచ్చాడు. మన అందాన్ని పెంచడానికి వీటిని కూడా అలంకరించుకుంటూ ఉంటాం. కానీ వాటికి నిజమైన ఆభరణం.. శాస్త్రాన్ని ఎప్పుడూ వింటూ ఉండడం, అంటే మన అభ్యున్నతికి దోహదపడే మంచి విషయాలను వినడం, అలా విన్న వాటితో సంస్కరింపబడి ఉన్నతిని పొందడం. నోటితో తిన్నది శరీర పుష్టికి కారణమవుతున్నది. చెవులద్వారా విన్నది... మనిషి సౌశీల్యానికి కారణం కావాలి.
ఆయన ఊపిరి వదలడు, ఊపిరి తియ్యడు..అని నిర్ధారించుకున్న తరువాత చిట్టచివరన శరీరాన్ని పంచభూతాల్లో కలిపివేసేటప్పుడు ఇక ఆ శరీరం మీద ఏ ఒక్క ఆభరణాన్ని కూడా ఉంచరు.. అన్నీ తీసేస్తారు... అప్పుడు తీయలేనివి, పైకి కనపడనివి కొన్ని ఉంటాయి... తన జీవిత కాలంలో దానగుణంచేత, సత్యభాషణం చేత, తన ఉన్నతికి పనికొచ్చే విషయాలను శాస్త్రాల ద్వారా వినడం చేత సమకూర్చుకున్న ఆభరణాలు మాత్రం ఉండిపోతాయి. ఇవి నీ పేరు శాశ్వతంగా ఉండిపోవడానికి, కాలంతో సంబంధం లేకుండా నిన్ను పదిమంది ఎప్పుడూ స్మరిస్తూ ఉండడానికి, నిన్ను చాలా మంది ఆదర్శంగా తీసుకోవడానికి, నిన్ను పరమాత్మకు చేరువ చేయడానికి ఎప్పుడూ నిన్ను అలంకరించి నీ అందాన్ని, వైభవాన్ని పెంచుతుంటాయి.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు