
ఏ పేరుతో పిలిచినా...
కలియుగంలో మోక్షానికి ఏకైక మార్గం నామ సంకీర్తన అని అందరికీ తెలుసు. అయితే పాడటం తెలీదని చింతించనక్కర్లేదు. భజనలు ఎలా చేయాలో కూడా తెలీదు అని చింతించ నక్కర్లేదు. సంస్కృత శ్లోకాలను తప్పులు లేకుండా ఉచ్చరించలేనుగా అని చింతించనక్కర్లేదు. నిజాయతీగా, భక్తితో ఉచ్చరించడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చని పెద్దలు చెబుతారు.
‘శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే’ – దీనిని చెప్పుకుంటే విష్ణు సహస్రనామం మొత్తం పఠించిన ప్రయోజనం పొందుతాం అంటారు. అది కూడా సాధ్యం కాదా? ఐదు నామాలు చాలు. అయిదింటిలో మొదటి నామం: ‘రామ’. చింతలు, దుఃఖాలు తలెత్తినప్పుడు ఏకాంత ప్రదేశంలో కూర్చుని రామ నామాన్ని జపిస్తే చాలు, రామ నామం విన్న వెంటనే హను మంతుడు ఆ ప్రదేశంలోకి వచ్చి కూర్చుంటాడని అంటారు. ‘యత్ర యత్ర రఘునాథ కీర్తనమ్/ తత్ర తత్ర కృతమస్త కాంజలిమ్’.
రెండవ నామం: ‘కృష్ణ’. ఈ నామమే పాండవులను రక్షించింది. ‘కృష్ణా! నాకు కష్టాలు ఇవ్వు! అప్పుడే, నిన్ను నేను ఎప్పటికీ మర్చిపోలేను’ అని కృష్ణుడిని వరం అడిగింది కుంతి. మానసిక బలాన్నీ, కష్టాలను భరించే ఓర్పునూ ఇచ్చే నామమిది. మూడవ నామం: ‘నారాయణ’. బాలుడు ప్రహ్లాదుడిని రక్షించిన నామం. ఎన్ని ప్రమాదాలు ఎదురైనా రక్షించిన నామం. నాలుగవ నామం: ‘గోవింద’. దుశ్శాసన సభలో ద్రౌపది తన రెండు చేతులను పైకెత్తి ‘గోవింద! గోవింద!’ అని అన్నప్పుడు ఆమె గౌరవాన్ని కాపాడిన నామమిది. తిరుమలలో ఎల్లవేళలా ప్రతిధ్వనించే నామం. ఇక ఐదవ నామం: ‘నరసింహ’. నీవే శరణాగతి అని నమ్మిన భక్తులకు కష్టాల నుంచి విముక్తిని ఇస్తాడు నరసింహుడు. వేరు వేరు పేర్లతో ఉన్న దేవుని ఏ పేరుతో ఎక్కడ స్మరించినా ఆయన ఆలకించి ఆదుకుంటాడు.
– యామిజాల జగదీశ్