Change Is Us: ఒడ్డును.. ఒడ్డున పడేస్తారు

Change Is Us: Change Is Us organises beach clean-ups every weekend - Sakshi

పర్యావరణ పరిరక్షణ బాధ్యత మొన్న జనవరి 1 వేడుకలు. లక్షలాది మంది ముంబై బీచుల్లో చేరి ఎంజాయ్‌ చేశారు. మంచిదే. లెక్కలేనంత చెత్త పారబోశారు. అందమైన సాగర తీరాలను శుభ్రంగా ఉంచాలన్న స్పృహ మనకు ఎప్పుడూ లేదు. అందుకే ముంబైలోని ‘చేంజ్‌ ఈజ్‌ అజ్‌’ సంస్థలోని టీనేజ్‌ పిల్లలే ఈ క్లీనింగ్‌కి పూనుకున్నారు. బుద్ధులు వినాల్సిన పిల్లలే పెద్దలకు బుద్ధులు చెబుతున్నారు.

విందామా వారి మాట?
మనిషి బావిని, చెరువును తవ్వించగలడు. సముద్రాన్ని కాదు. ఒక ప్రాంతంలో సముద్రం ఉందంటే అది ప్రకృతి ఆ ప్రాంతానికి ఇచ్చిన వరం. ఎన్ని చికాకులున్నా, ఎన్ని బాధలున్నా, ఎంత బిజీగా ఉన్నా, ఎంతో సంతోషంగా అనిపించినా అలా బీచ్‌కు వెళితే, సముద్రం ఒడ్డున కూచుంటే, అలల ఘోషను వింటూ, ఆ సమతల అగాధపు గాంభీర్యాన్ని కంటూ, ఎగిరే పక్షుల వల్ల, తిరిగే పడవల వల్ల, వీచే గాలుల వల్ల ఓదార్పు పొందడం ఎంత బాగుంటుంది!
కాని ఆ భావాలన్నీ పేరుకున్న చెత్త వల్ల నాశనమైతే?

మన దేశంలో పేద, మధ్యతరగతి వారికి ఖర్చులేని కాలక్షేపం బీచ్‌. దానికి కూడా వెళ్లలేనంతగా వాటిని గలీజ్‌ చేస్తే? అలా చేసేంత దుర్గుణం మనుషులకే ఉంది. దానికి జవాబు యువత దగ్గర ఉంది.

ఛేంజ్‌ ఈజ్‌ అజ్‌
ముంబైలో ఎంతలేదన్నా డజన్‌ అందమైన బీచ్‌లు ఉన్నాయి. అతి చిన్న ఇరుకు ఇళ్లలో జీవించే ముంబై జీవులు బీచ్‌లకు వచ్చే ఊపిరి పీల్చుకుంటారు. 75 ఏళ్ల కుంతీ ఓజా అనే మహిళ మూడు నాలుగేళ్ల క్రితం సోషల్‌ మీడియాలో ‘చిన్నప్పటి నుంచి చౌపాటి బీచ్‌కు వచ్చి ఆహ్లాదం పొందేదాన్ని. పసుపు రంగు ఇసుక చూడటం, చిరుతిళ్లు తినడం భలే ఉండేది. కాని ఇప్పుడు బీచ్‌ మొత్తం చెత్త. మా చిన్నప్పుడు మిగిలిన తిండి పారేసేవారు.

ఇప్పుడు మొత్తం ప్లాస్టిక్‌ చెత్తను పారేస్తున్నారు’ అని రాసింది. ఆమె గోడు విన్నట్టుగా ఆ సమయంలోనే సీనియర్‌ ఇంటర్‌ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అక్షత్‌ షా, శుభ్‌ మెహతా పర్యావరణ విధ్వంసం గురించి స్కూల్లో, బయట వింటున్న వార్తలతో ప్రభావితం అయ్యారు. అప్పుడే అమెజాన్‌ అడవులు తగలబడటం వారిని కలిచి వేసింది. ‘మన వంతుగా ఏదో ఒకటి చేద్దాం’ అని సోషల్‌ మీడియా వేదికగా ‘ఛేంజ్‌ ఈజ్‌ అజ్‌’ గ్రూప్‌ను ప్రారంభించి ముంబైలోని బీచ్‌ల క్లీనింగ్‌కి నడుం కట్టారు.

జూలై 2019న మొదటిసారి
అక్షత్‌ షా, శుభ్‌ మెహతా జూలై, 2019లో మొదటిసారి చౌపాటి బీచ్‌ను క్లీన్‌ చేయడానికి సోషల్‌ మీడియాలో పిలుపునిచ్చినప్పుడు కేవలం 18 మంది టీనేజ్‌ విద్యార్థులు హాజరయ్యారు. వారంతా కలిసి బీచ్‌ను క్లీన్‌ చేయడం జనం వింతగా చూశారు. కాని మంచి పనికి కొత్త తరం అండ తప్పక లభిస్తుంది. క్రమం తప్పకుండా బీచ్‌లను క్లీన్‌ చేయడం, ఫొటోలను ప్రచారంలో పెట్టడంతో హైస్కూల్, కాలేజీ స్థాయి పిల్లలు స్పందించడం మొదలెట్టారు. తల్లిదండ్రులు కూడా ఈ మంచి పనికి అడ్డు చెప్పలేదు. ‘ఇప్పటి వరకూ మేము ముంబై బీచ్‌ల నుంచి 480 టన్నుల చెత్త పారబోశాం’ అంటారు అక్షత్‌ షా, శుభ్‌. ప్రస్తుతం అక్షత్‌ ముంబైలోనే ఉంటూ చదువుకుంటుంటే శుభ్‌ యూకేలో చదువుకుంటూ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నాడు.

పాతిక వేలమంది వాలంటీర్లు
‘ఛేంజ్‌ ఈజ్‌ అజ్‌’ గ్రూప్‌ ఎంత సక్సెస్‌ అయ్యిందంటే ముంబై మొత్తం నుంచి 25,200 మంది విద్యార్థినీ విద్యార్థులు ఇందులో వాలంటీర్లుగా చేరారు. బీచ్‌ల శుభ్రత గురించి ఛేంజ్‌ ఈజ్‌ అజ్‌ సభ్యులు స్కూళ్లు, కాలేజీలకు తిరిగి ప్రచారం చేయడం వల్ల కూడా ఈ చేరిక సాధ్యమైంది. వీరంతా తమకు వీలున్నప్పుడల్లా ముంబైలోని బీచ్‌లను శుభ్రం చేస్తుంటారు. ముఖ్యంగా పండగలప్పుడు, డిసెంబర్‌ 31 వంటి సందర్భాల్లో వీరి పని ఎక్కువగా ఉంటుంది.

మన దేశంలో బీచ్‌లు టూరిస్ట్‌ అట్రాక్షన్‌ కూడా. పట్టణ, నగర సంస్థలు బీచ్‌ల శుభ్రత కోసం ఎంతోకొంత నిధులు వెచ్చిస్తున్నా నిరంతర అలల్లాగే నిరంతరం చెత్త పడుతూనే ఉంటుంది. అందుకే ఇటు బంగాళాఖాతం, అటు అరేబియా సముద్రం... తీరాల పొడవునా బీచ్‌లను శుభ్రం చేయడానికి విద్యార్థినీ విద్యార్థులు నడుం బిగించాలి. వారు కదిలితే పెద్దలూ కదులుతారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top