
హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) కారణంగా సర్వైకల్ క్యాన్సర్ సోకే ముప్పు యువతులకు, నడివయసు మహిళలకు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే! అరవై ఏళ్లు నిండిన వయసులోని మహిళలకు కూడా ఈ ముప్పు ఎక్కువగానే ఉంటుందని ఇటీవలి పరిశోధనల్లో తేలింది.
అందువల్ల అరవైలలోని మహిళలు కూడా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం మంచిదని అంతర్జాతీయ వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2022లో సర్వైకల్ క్యాన్సర్ సోకిన మహిళల్లో 65 ఏళ్లు పైబడిన మహిళలు 1,57,182 మంది ఉంటే, వారిలో 1,24,269 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ లెక్కన వార్ధక్యంలో సర్వైకల్ క్యాన్సర్ సోకిన మహిళలు ప్రాణాపాయం బారిన పడే అవకాశాలే ఎక్కువగా ఉంటున్నట్లు స్పష్టమవుతోంది. సాధారణంగా ఈ వయసులోని మహిళలు వ్యా«ధి రెండో దశలోను, ఇంకా ముదిరిన దశలోను ఆస్పత్రుల్లో చేరుతున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ నివేదికలు చెబుతున్నాయి.
అందువల్ల అరవైలలో ఉన్న మహిళలు కూడా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సూచనలపై ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని, దానివల్ల వ్యాధిని తొలిదశలోనే గుర్తించి ప్రాణాపాయాన్ని నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
సర్వైకల్ క్యాన్సర్ ముప్పును చాలావరకు తప్పించగల హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందు బాటులోకి వచ్చినా, వ్యాక్సిన్ తీసుకుంటున్న మహిళల సంఖ్య ఇంకా తక్కువగానే ఉంటోంది. డబ్ల్యూహెచ్‌ఓ లెక్కల ప్రకారం 2017–2023 మధ్య కాలంలో 25–54 ఏళ్ల వయసు గల మహిళల్లో కేవలం రెండు శాతం మంది మాత్రమే ఈ వ్యాక్సిన్ తీసుకున్నారు.
(చదవండి: సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చా?)