Captain Shiva Chouhan: సియాచిన్‌ పై వీర వనిత

Captain Shiva Chouhan becomes first woman officer operationally deployed at Siachen - Sakshi

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సరిహద్దు రక్షణ స్థానం సియాచిన్‌లో మొట్టమొదటిసారిగా ఒక మహిళా ఆఫీసర్‌ దళాధిపతిగా నియమితురాలయ్యింది. 15 వేల అడుగున ఎత్తున దేశ రక్షణకు నిలిచిన కెప్టెన్‌ శివ చౌహాన్‌ ఈపోస్ట్‌ పొందడానికి ఎంతో కష్టతరమైన ట్రయినింగ్‌ను పూర్తి చేశారు. శివ చౌహాన్‌ వివరాలు.

గతంలో సియాచిన్‌కు విధి నిర్వహణకు పంపే సైనికులతో అధికారులు ‘మీరు ముగ్గురు వెళితే ఇద్దరే తిరిగి వస్తారు’ అని హెచ్చరించి పంపేవారు. ‘ఇద్దరే తిరిగి వచ్చినా దేశం కోసంపోరాడతాం’ అని సైనికులు సమరోత్సాహంతో వెళ్లేవారు. అయితే వారి ప్రథమ శత్రువు పాకిస్తాన్‌ కాదు. ప్రతికూలమైన ప్రకృతే. మైనస్‌ 55 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత, తీవ్రమైన చలి గాలులు, హిమపాతం, కాలు జారితే ఆచూకీ తెలియని మంచులోయలు... సియాచిన్‌లో 35 అడుగుల ఎత్తు మేరకు కూడా మంచు పడుతుందంటే ఊహించండి. ప్రపంచంలోనే ఎత్తయిన యుద్ధస్థావరమైన సియాచిన్‌ అటు పాకిస్తాన్‌ నుంచి ఇటు చైనా నుంచి రక్షణ ΄పొందడానికి ఉపయోగపడే కీలక్రపాంతం. అక్కడ ఇన్నాళ్లు మగవారే విధులు నిర్వహించారు. మొదటిసారి ఒక మహిళా ఆఫీసర్‌ అడుగు పెట్టింది ఆమె పేరే శివ చౌహాన్‌.

1984 నుంచి
దేశ విభజన సమయంలో వాస్తవాధీన రేఖకు అంచున మానవ మనుగడకు ఏమాత్రం వీలు లేని సియాచిన్‌ ్రపాంతాన్ని అటు పాకిస్తాన్‌ కాని ఇటు ఇండియాగాని పట్టించుకోలేదు. కాని 1984లో దాని మీద ఆధిపత్యం కోసం పాకిస్తాన్‌ ప్రయత్నిస్తున్నదని తెలుసుకున్న భారత్‌ సియాచిన్‌ అధీనం కోసం హుటాహుటిన రంగంలో దిగి ‘ఆపరేషన్‌ మేఘదూత్‌’ పేరుతో విజయవంతమైన సైనిక చర్య చేయగలిగింది. ఆ తర్వాత 1999 వరకూ ఇరు పక్షాల మధ్య చర్యలు, ప్రతిచర్యలు సాగాయి. ‘వాస్తవ మైదాన స్థానరేఖ’ను ఇరుపక్షాలు అంగీకరించి అక్కడ సైనిక స్థావరాలు నిర్మించుకున్నా మంచు ఖండం వంటి సియాచిన్‌ మీద భారత్‌ గాని, పాకిస్తాన్‌గాని తన స్థావరాలను తీసేయలేదు. ఇప్పటివరకూ ఇరువైపులా అక్కడ 2000 మంది సైనికులు మరణించారని అంచనా. వారిలో ఎక్కువ మంది కేవలం ప్రతికూల వాతావరణానికే మరణించారు. సైనిక కాల్పుల్లో కాదు.

అడుగు పెట్టిన ఆఫీసర్‌
సంప్రదాయిక విధానాలతోనే నడిచే ఇండియన్‌ ఆర్మీ మహిళల ప్రవేశాన్ని అన్నిచోట్ల అంగీకరించరు. ఇంతవరకూ 9000 అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్‌ బేస్‌ క్యాంప్‌ వరకే మహిళా ఆఫీసర్లను అనుమతించింది ఆర్మీ. కాని 15000 అడుగుల నుంచి 20 వేల అడుగుల (బాణాసింగ్‌ బంకర్‌) ఎత్తు వరకూ సియాచిన్‌లో వివిధ స్థానాలలో ఉండే స్థావరాలకు మహిళా ఆఫీసర్లను పంపలేదు. మొదటిసారిగా శివ చౌహాన్‌కు ఆర్మీ సియాచిన్‌ హెడ్‌క్వార్టర్స్‌లోపోస్టింగ్‌ ఇచ్చింది.

రాజస్థాన్‌ సాహసి
శివ చౌహాన్‌ది రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌. 11వ ఏట తండ్రి మరణిస్తే గృహిణి అయిన తల్లి శివ చౌహాన్‌ను పెంచింది. ‘మా అమ్మే నాకు చిన్నప్పటి నుంచి ఆర్మీ మీద ఆసక్తి కలిగించింది’ అంటుంది శివ. ఉదయ్‌పూర్‌లో సివిల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన శివ 2020 సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ పరీక్షలు రాసి ఆలిండియా మొదటి ర్యాంకు సాధించింది. చెన్నైలో ట్రైనింగ్‌ అయ్యాక 2021లో లెఫ్టినెంట్‌గా ఇంజనీర్‌ రెజిమెంట్‌లో బాధ్యత తీసుకుంది. ఆ వెంటనే కెప్టెన్‌ హోదా ΄పొందింది. 2022 కార్గిల్‌ దివస్‌ సందర్భంగా సియాచిన్‌ వార్‌ మెమోరియల్‌ నుంచి కార్గిల్‌ వార్‌ మెమోరియల్‌ వరకు 508 కిలోమీటర్ల సైకిల్‌ యాత్రను శివ చౌహాన్‌ తన నాయకత్వంలో పూర్తి చేయడంతో ఆమె అధికారుల దృష్టిలో పడింది. దాంతో ఆమెను సియాచిన్‌లో టీమ్‌ లీడర్‌గాపోస్ట్‌ వరించింది.
త్రివిధ దళాలలో చరిత్ర సృష్టిస్తున్న స్త్రీల సరసన ఇప్పుడు శివ చౌహాన్‌ నిలిచింది.

కఠిన శిక్షణ
సియాచిన్‌లో ఏ స్థావరంలో విధులు నిర్వహించాలన్నా సియాచిన్‌ హెడ్‌క్వార్టర్స్‌లోని బేటిల్‌ స్కూల్‌లో మూడు నెలల శిక్షణ పూర్తి చేయాలి. మిగిలిన మగ ఆఫీసర్లతో పాటు శివ ఈ శిక్షణను పూర్తి చేసింది. ఇందులో కఠినమైన మంచు గోడలను అధిరోహించడం, మంచులోయల్లో పడినవారిని రక్షించడం, శారీరక ఆరోగ్యం కోసం డ్రిల్‌ పూర్తి చేయగలగడం వంటి అనేక ట్రయినింగ్‌లు ఉంటాయి. ‘ఆమె శిక్షణను విజయవంతంగా పూర్తి చేసింది. మూసను బద్దలు కొట్టింది’ అని ఆర్మీ అధికారులు అన్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top