గుండె గుబుక్కు.. గుబుక్కుమంటోందా!

Canadian Research Team Study On Heart Problems - Sakshi

కార్యాలయాల్లో ఎక్కువ పని గంటలు పనిచేసే వారికి హైబీపీ

ఉద్యోగులు గుర్తించలేని స్థాయిలో సమస్య తీవ్రత

ముసుగు రక్తపోటుగా అభివర్ణిస్తున్న వైద్యులు

దీనివల్ల గుండె సమస్యలు వస్తున్నట్టు గుర్తింపు

కెనడియన్‌ వైద్యుల బృందం అధ్యయనంలో వెల్లడి 

సాక్షి, అమరావతి: కార్యాలయాల్లో సాధారణ పని గంటల కంటే ఎక్కువ సమయం గడిపే వారిలో అధిక రక్తపోటు (హైబీపీ) ఉంటోందని ఓ అధ్యయనంలో తేలింది. తమకు హైబీపీ ఉన్న విషయం, దానివల్ల కలిగే అనర్థాలను వీరు కనిపెట్టలేరని ఆ అధ్యయనంలో స్పష్టమైంది. బీపీ ఎక్కువగా ఉన్న విషయాన్ని గుర్తించకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తేలింది. ఏదో తెలియని ఇబ్బంది అనిపించి వైద్యులకు చూపించుకున్నా.. ఇలాంటి వారిలో హైబీపీ ఉన్న విషయం అంత సులభంగా బయటపడటం లేదు.

వారానికి 49 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే..
►కెనడియన్‌ పరిశోధనా బృందం భారతదేశం తోపాటు వివిధ దేశాల్లో దీనిపై అధ్యయనం జరిపింది.
►వారానికి 35 గంటల కన్నా తక్కువ పనిచేసే ఉద్యోగులతో పోలిస్తే.. 49 కంటే ఎక్కువ గంటలు పని చేయడం వల్ల 70 శాతం ఎక్కువ తెలియని రక్తపోటు వచ్చే అవకాశం ఉందని గుర్తించింది. 
►వీరిలో పెరిగిన రక్తపోటు రీడింగ్‌లను తెలుసుకోవడం కష్టమవుతుందని, అందువల్ల వారికి రక్తపోటు లేదనే అభిప్రాయం కలుగుతోందని అధ్యయనం తేల్చింది.
►శరీరంలో మార్పులు తీవ్రమైన తర్వాత ఒకేసారి ఇది బయటపడుతుందని గుర్తించింది.

అది ముసుగు రక్తపోటు
►ప్రతి వారం 41 నుంచి 48 గంటలు పనిచేసే వ్యక్తులు తెలియని రక్తపోటు (ముసుగు రక్తపోటు) బారిన పడటానికి 54 శాతం ఎక్కువ అవకాశం ఉందని అధ్యయనంలో స్పష్టమైంది.
►ఉద్యోగుల్లో తెలియని విధంగా ఉండే రక్తపోటు వల్ల వారిలో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నట్టు వైద్యులు స్పష్టం చేశారు.
►ఈ అధ్యయనంలో ఉద్యోగులను బృందాలుగా విభజించి కొన్నేళ్లపాటు పదేపదే పరీక్షలు జరిపారు.
►ఎక్కువ పని గంటలు తమ గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని ఉద్యోగులు చాలామందికి ముందే తెలుసని అధ్యయనంలో తేలింది.
►అయితే దీన్ని నియంత్రించుకోవడానికి, తగ్గించుకోవడానికి అవసరమైన పరిస్థితులు ఉండడం లేదని గుర్తించారు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top