ఎస్‌ఎఫ్‌టీ రూ.12,779
ఈ రేటుతోనే శాశ్వత సచివాలయం నిర్మాణం
అందుకోసం రూ. 2,316.88 కోట్లకు పరిపాలనా అనుమతులు
2018లో ఐదు టవర్ల నిర్మాణ పనులకు మూడు ప్యాకేజీల కింద టెండర్లు
ఎస్‌ఎఫ్‌టీ రూ.4,350.42 చొప్పున షాపూర్‌జీ పల్లోంజీ, ఎన్‌సీపీ, ఎల్ అండ్ టీకి పనులు అప్పగింత
2024లో ఆ కాంట్రాక్టు ఒప్పందాలను రద్దు చేసిన చంద్రబాబు సర్కార్
భారీగా పెంచిన కొత్త రేట్లతో అనుకూల కాంట్రాక్టర్లకు దోచిపెట్టే ఎత్తుగడ..
నాటికీ నేటికీ స్టీల్, డీజిల్ సిమెంటు ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు.. పైగా ఇసుక ఉచితం
కానీ అంచనా వ్యయం భారీగా పెంచేసి పాత సంస్థలకే పనుల అప్పగింత..
రూ.6,671.31 కోట్లకు చేరుకున్న శాశ్వత సచివాలయం నిర్మాణ వ్యయం
దానిని బట్టి చూస్తే రూ.12,779.07కు చేరుకున్న చదరపు అడుగు నిర్మాణ వ్యయం
బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో ఫైవ్‌స్టార్ వసతులతో నిర్మాణవ్యయం ఎస్‌ఎఫ్‌టీకి రూ. 4వేలు మించడం లేదు
భారీ ముడుపుల కోసమే అంచనా వ్యయం పెంచేశారంటున్న నిపుణులు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ వ్యయం పెంచేయడంలో చంద్రబాబు సర్కార్ తన రికార్డులను తానే బద్దలు కొడుతోంది. శాశ్వత సచివాలయం నిర్మాణ వ్యయమే ఇందుకు తార్కాణం. నేలపాడు వద్ద అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్(ఏజీసీ)లో శాశ్వత సచివాలయం, హెచ్‌వోడీ(శాఖాధిపతులు) కార్యాలయాల కోసం ఐదు టవర్లను డయాగ్రిడ్ విధానంలో ప్రభుత్వం నిర్మిస్తోంది.
ఈ భవనాలకు హై సైడ్ ఎలక్ట్రికల్(విద్యుత్ సరఫరా), హెచ్‌వీఏసీ(వాతావరణం స్థిరంగా ఉండేలా చూసే వ్యవస్థ), అగ్నిమాపక వ్యవస్థ, లిఫ్ట్‌లు, ప్లంబింగ్ పనులు చేపట్టడం కోసం రూ.2,316.88 కోట్లతో పరిపాలన అనుమతి ఇస్తూ ఇటీవల పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని బట్టి చూస్తే శాశ్వత సచివాలయం నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.12,779.07 అని అర్ధమౌతోంది.
బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఫైవ్ స్టార్ సదుపాయాలు, ఇటాలియన్ మార్బుల్స్‌తో నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.4 వేలకు మించడం లేదని ఇంజినీరింగ్ నిపుణులు గుర్తు చేస్తున్నారు. అంటే.. శాశ్వత సచివాలయం కాంట్రాక్టు పనుల్లో భారీగా కమీషన్లు చేతులు మారాయన్నది స్పష్టమవుతోందని ఆరోపిస్తున్నారు. శాశ్వత సచివాలయం నిర్మాణం పూర్తయ్యే సరికి వ్యయం ఇంకెంత పెరుగుతుందో అని లెక్కలు వేస్తున్నారు.
గతంలో తాత్కాలిక సచివాలయం నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.3,350తో మొదలై.. పూర్తయ్యే సరికి చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. రాజధాని నిర్మాణం కోసం అంతర్జాతీయ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల వద్ద అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చిన నిధులను కాంట్రాక్టర్లతో కలిసి ప్రభుత్వ పెద్దలు దోచుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
నాడూ–నేడూ కాంట్రాక్టర్ ఒక్కరే..:
» సచివాలయం 1, 2 టవర్లను బీ+జీ+39 అంతస్తులతో నిర్మిస్తోంది. ఈ పనులకు రూ.1,423.07 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి 2025లో టెండర్లు పిలిచింది. సచివాలయం 3, 4 టవర్లను బీ+జీ+39 అంతస్తులతో నిర్మిస్తోంది. ఈ పనులకు రూ.1,247.22 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. సీఎం కార్యాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం సచివాలయంలో జీఏడీ టవర్‌ను బీ+జీ+49 అంతస్తులతో నిర్మిస్తోంది. ఈ పనులకు రూ.844.22 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ఈ టెండర్లలో మూడు ప్యాకేజీలకు ముఖ్యనేత ఏర్పాటుచేసిన సిండికేట్‌లోని ఎన్‌సీసీ, ఎల్ అండ్ టీ, షాపూర్‌జీ పల్లోంజీ సంస్థలే బిడ్లు దాఖలు చేశాయి.
» 1, 2 టవర్ల నిర్మాణ పనులను 4.50 శాతం అధిక ధరకు అంటే రూ.1,487.11 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన షాపూర్‌జీ పల్లోంజీ దక్కించుకుంది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ పన్నుల రూపంలో రూ.275.70 కోట్లు రీయింబర్స్ చేస్తామని సీఆర్‌డీఏ పేర్కొంది. అంటే.. 1, 2 టవర్ల కాంట్రాక్టు విలువ రూ.1,762.81 కోట్లు. ఇదే పనులను 2018లో రూ.932.46 కోట్లకే పూర్తి చేసేందుకు సీఆర్‌డీఏతో షాపూర్‌జీ పల్లోంజీ ఒప్పందం చేసుకుంది. అంటే.. 2018తో పోలిస్తే ఇప్పటికే ఈ కాంట్రాక్టు వ్యయం రూ.830.35 కోట్లు పెరిగినట్లు స్పష్టమవుతోంది.
» 3, 4 టవర్ల నిర్మాణ పనులను 4.54 శాతం అధిక ధరకు అంటే రూ.1,303.85 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన ఎల్ అండ్ టీ సంస్థ దక్కించుకుంది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ పన్నుల రూపంలో రూ.241.70 కోట్లు రీయింబర్స్ చేస్తామని సీఆర్‌డీఏ పేర్కొంది. అంటే.. 3, 4 టవర్ల కాంట్రాక్టు విలువ రూ.1,545.55 కోట్లు. 2018లో ఇదే పనులను రూ.784.62 కోట్లకే పూర్తి చేసేందుకు సీఆర్‌డీఏతో ఎల్ అండ్ టీ ఒప్పందం చేసుకుంది. అంటే.. 2018 తో పోలిస్తే ఇప్పటికే ఈ టవర్ల కాంట్రాక్టు వ్యయం రూ.760.93 కోట్లు పెరిగినట్లు తేటతెల్లమవుతోంది.
» జీఏడీ టవర్ నిర్మాణ పనులను 4.53 శాతం అధిక ధరకు అంటే రూ.882.47 కోట్లకు కోట్ చేసి ఎల్–1 నిలిచిన ఎన్‌సీసీ సంస్థ దక్కించుకుంది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ పన్నుల రూపంలో రూ.163.60 కోట్లను రీయింబర్స్ చేస్తామని సీఆర్‌డీఏ పేర్కొంది. అంటే ఆ పనుల కాంట్రాక్టు విలువ రూ.1,046.07 కోట్లు. 2018లో ఇదే పనులను రూ.554.06 కోట్లకు ఎన్‌సీసీ సంస్థకు సీఆర్‌డీఏ అప్పగించింది. అంటే.. 2018తో పోలిస్తే ఇప్పటికే ఈ కాంట్రాక్టు వ్యయం రూ.492.01 కోట్లు పెరిగింది.
అప్పు చేసి.. దోచిపెట్టి.. పంచుకు తినేలా
శాశ్వత సచివాలయం టవర్ల నిర్మాణాన్ని 2018లోనూ.. ఇప్పుడూ డయాగ్రిడ్ విధానంలోనే నిర్మించేలా కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. అప్పటితో పోలిస్తే సిమెంట్, స్టీల్, డీజిల్, పెట్రోల్, నిర్మాణ సామగ్రి ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు. పైగా ఇప్పుడు ఇసుక ఉచితం. అదీ నాలుగైదు కిలోమీటర్ల దూరంలోనే కృష్ణా నదిలో కావాల్సినంత దొరుకుతుంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. 2018తో పోలిస్తే టవర్ల కాంట్రాక్టు విలువ ఇప్పుడు పెరగడానికి వీల్లేదని అధికార వర్గాలే స్పష్టం చేస్తున్నాయి.
ఇదే టవర్ల నిర్మాణ పనులను 2018 ఏప్రిల్ 26న చదరపు అడుగు రూ.4,350.42 చొప్పున రూ.2,271.14 కోట్లకు షాపూర్‌జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ, ఎన్‌సీసీ సంస్థలకు అప్పగిస్తూ ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు మళ్లీ అదే సంస్థలకు వాటి నిర్మాణ పనులను రూ.4,354.43 కోట్లకు అప్పగించింది. అంటే.. 2018తో పోలిస్తే ఇప్పుడు వాటి కాంట్రాక్టు వ్యయం రూ.2,083.29 కోట్లు పెరిగింది. ఐదు టవర్ల నిర్మిత ప్రాంతం 4,85,000 చదరపు మీటర్లు (52,20,496 చదరపు అడుగులు). అంటే.. చదరపు అడుగు రూ.8,339.12 చొప్పున ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులను కాంట్రాక్టు సంస్థలకు అప్పగించినట్టు స్పష్టమవుతోంది.
ఇక ఈ భవనాలకు హై సైడ్ ఎలక్ట్రికల్(విద్యుత్ సరఫరా), హెచ్‌వీఏసీ(వాతావరణం స్థిరంగా ఉండేలా చూసే వ్యవస్థ), అగ్నిమాపక వ్యవస్థ, లిఫ్ట్‌లు, ప్లంబింగ్ పనులు చేపట్టడం కోసం రూ.2,316.88 కోట్లు మంజూరు చేసింది. దాంతో శాశ్వత సచివాలయం నిర్మాణ వ్యయం రూ.6,671.31 కోట్లకు చేరుకుంది. చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.12,779.07కు చేరింది. సంప్రదాయ పద్ధతిలో నిర్మించినా.. డయాగ్రిడ్ విధానంలో నిర్మించినా నిర్మాణ వ్యయంలో పెద్దగా తేడా ఉండదని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
డయాగ్రిడ్ విధానంలో అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుందని స్పష్టం చేస్తున్నారు. కానీ.. శాశ్వత సచివాలయం టవర్ల నిర్మాణాన్ని చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.12,779.07కు చేరడంపై ఇంజినీర్లు విస్మ యం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, కేఎఫ్‌డబ్ల్యూ, హడ్కో వంటి సంస్థల నుంచి అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చి వాటిని కాంట్రాక్టు సంస్థలకు దోచి పెడుతూ.. నీకింత నాకింత అంటూ ముఖ్యనేత పంచుకుతినేలా కుట్ర పన్నారంటూ ఆగ్రహం వ్యక్తమవుతోంది.
నిర్మాణం పూర్తయ్యే సరికి తడిసిమోపెడు
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2015లో ఓటుకు కోట్లను ఎరగా వేసి.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపులతో సీఎం చంద్రబాబు తెలంగాణ సర్కార్‌కు అడ్డంగా దొరికిపోయారు. ఓటుకు కోట్లు కేసు భయంతో హైదరాబాద్ నుంచి ఉండవల్లి కరకట్టలోని లింగమనేని అక్రమ బంగ్లాలోకి మకాం మార్చారు.
ఆ తర్వాత అమరావతి నుంచే పరిపాలన చేయడం కోసం 6 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో తాత్కాలిక సచివాలయం పనులను చదరపు అడుగు రూ.3,350 చొప్పున రూ.201 కోట్లకు షాపూర్‌జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థలకు అప్పగించారు. కానీ.. వాటి నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం రూ.1,151 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారాయనే ఆరోపణలు బలంగా వ్యక్తమయ్యాయి.
షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ నుంచి కమీషన్లు వసూలు చేసిన సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి అప్పట్లో ఐటీ శాఖకు పట్టుబడటం కలకలం రేపింది. ఇప్పుడు శాశ్వత సచివాలయం పేరుతో నిర్మిస్తున్న ఐదు టవర్ల నిర్మాణంలోనూ అదే తరహా దోపిడీకి పథకం రచించారని.. వాటి నిర్మాణం పూర్తయ్యే సరికి కాంట్రాక్టు వ్యయం ఇంకెంతకు పెరుగుతుందోనని ఇంజినీరింగ్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


