గేమింగ్‌ యాప్స్‌కి అట్రాక్ట్‌ అవుతున్న యూత్‌.. కారణాలివే

The Boom In Gaming Industry In India How It Growing - Sakshi

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఇండియా గేమ్‌ డెవలప్‌ కాన్ఫరెన్స్‌ (ఐజీడీసీ)లో విడుదల చేసిన ‘లుమికై స్టేట్‌ ఆఫ్‌ ఇండియా గేమింగ్‌ రిపోర్ట్‌’ మన దేశంలో డిజిటల్‌ గేమింగ్‌ ఇండస్ట్రీ ఉజ్వల భవిష్యత్తు గురించి చెప్పకనే చెప్పింది. డిజిటల్‌ గేమ్స్‌కు యూత్‌ మహారాజ పోషకులే అయినప్పటికీ ‘యూజర్‌’ స్థానానికి మాత్రమే పరిమితం కావడం లేదు. గేమింగ్‌ ఇండస్ట్రీ ముఖ చిత్రాన్ని మార్చడంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. సొంతంగా గేమ్‌ బిల్డింగ్‌ కంపెనీలు స్టార్ట్‌ చేస్తున్నారు.

ఇండియా గేమ్‌ డెవలప్‌ కాన్ఫరెన్స్‌(ఐజీడీసీ)లో గేమింగ్‌ వెంచర్‌ క్యాపిటల్‌ ఫర్మ్‌ లుమికై గూగుల్‌తో కలిసి ‘లుమికై స్టేట్‌ ఆఫ్‌ ఇండియా గేమింగ్‌ రిపోర్ట్‌’ విడుదల చేసింది. మన దేశంలో గేమింగ్‌ ఇండస్ట్రీ స్పీడ్‌కు ఇది అద్దం పడుతుంది. మన గేమింగ్‌ ఇండస్ట్రీ 2028 నాటికి అరవై రెండు వేల కోట్లను దాటుతుందని ఈ రిపోర్ట్‌ తెలియజేస్తుంది. ‘డిజిటల్‌ గేమ్స్‌’ అనగానే గుర్తుకు వచ్చేది యువతరమే. వారు డిజిటల్‌ గేమ్స్‌ వైపు ఆకర్షితం కావడానికి ప్రధాన కారణాలు...

∙సోషల్‌ కనెక్షన్‌: ఫోర్ట్‌నైట్, మైన్‌క్రాఫ్ట్‌లాంటి గేమ్స్‌ ఫిజికల్‌ లొకేషన్‌తో పనిలేకుండా వర్చువల్‌ ఎన్విరాన్‌మెంట్‌లో ప్లేయర్స్‌ ఇతరులతో ఇంటరాక్ట్‌ అయ్యే, స్నేహం చేసే, ఆన్‌లైన్‌ కమ్యూనిటీలను నిర్మించుకునే అవకాశాన్ని కలిగిస్తున్నాయి. జెన్‌ జెడ్‌ హైలీ సోషల్‌ జెనరేషన్‌గా పేరు తెచ్చుకుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్లేయర్స్‌ ఒకరితో ఒకరు కనెక్ట్‌ కావడానికి, పోటీ పడడానికి తమ గేమ్స్‌లో సోషల్‌ ఫీచర్స్‌ను తీసుకువస్తున్నాయి కంపెనీలు.

యూజర్‌–జనరేటెడ్‌ కంటెంట్‌: యూజర్‌లు తమ సొంత కంటెంట్‌ను క్రియేట్‌ చేసుకోవడానికి ఎన్నో పాపులర్‌ గేమ్స్‌ అనుమతిస్తున్నాయి. తమ స్వీయ అనుభవాలను ఉపయోగించి యూజర్‌–జనరేటెడ్‌ కంటెంట్‌ను వర్చువల్‌ వరల్డ్‌లో వైబ్రెంట్‌ అండ్‌ డైనమిక్‌గా క్రియేట్‌ చేయడానికి వీలవుతుంది.
∙ఎన్నో ఎన్నెన్నో: యూత్‌ ప్లేయర్స్‌కు మోడ్రన్‌ గేమ్స్‌ కాంపిటేటివ్, కో–ఆపరేటీవ్‌ గేమ్‌ప్లే, ఎక్స్‌΄్లోరేషన్, స్టోరీ టెల్లింగ్‌కు సంబంధించి సరికొత్త అనుభవాలను అందిస్తున్నాయి. ప్లేయర్స్‌కు గ్రాఫిక్స్, సౌండ్, గేమ్‌ ప్లే మెకానిక్స్‌ను చేరువచేయడంపై దృష్టి పెడుతున్నాయి.

స్ట్రేస్‌ ఫ్రీ–క్రియేటివిటీ: యూత్‌లో కొద్దిమంది ఒత్తిడి నుంచి బయట పడడానికి గేమింగ్‌కు దగ్గరవుతున్నారు. ఆర్ట్, డిజైన్, స్టోరీ టెల్లింగ్‌లాంటి సృజనాత్మక ప్రక్రియలను ఇష్టపడే యువతరం  క్రియేటివ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ కోసం వీడియో గేమ్స్‌ ఆడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కంపెనీలు తమ గేమ్స్‌లో ప్లేయర్స్‌కు సొంత గేమ్‌ మోడ్స్, మ్యాప్స్‌ క్రియేట్‌ చేయడానికి అనుమతిస్తున్నాయి.

యువతరమే కారణం...
మొబైల్‌ డివైజ్‌లకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మొబైల్‌ గేమింగ్‌ అభివృద్ధికి యూత్‌ ఉపయోగపడుతుంది. సంప్రదాయ గేమింగ్‌ కన్సోల్స్‌ కంటే అఫర్డబుల్‌ అండ్‌ యాక్సెసబుల్‌గా ఉండే మొబైల్‌ డివైజ్‌లకే ప్రాధాన్యత ఇస్తోంది యువతరం. ఇ–స్పోర్ట్స్‌ లేదా కాంపిటీటివ్‌ గేమింగ్‌ మెయిన్‌ స్ట్రీమ్‌లోకి రావడానికి ప్రధాన కారణం యువత. యువతరం చూపిస్తున్న ఆసక్తి వల్ల ఎన్నో టెలివిజన్‌ నెట్‌వర్క్‌లు ఇ–స్పోర్ట్స్‌ను నిర్వహిస్తున్నాయి. ప్రొఫెషనల్‌ ఇ–స్పోర్ట్స్‌ ప్లేయర్స్‌ తయారవుతున్నారు.

బోలెడు ఉపాధి అవకాశాలు...
గేమ్స్‌ నుంచి అపారమైన ఆనందాన్ని సొంతం చేసుకోవడమే కాదు గేమింగ్‌ ఇండస్ట్రీ నుంచి ఉపాధి అవకాశాలను కూడా వెదుక్కుంటోంది యువతరం. ఇ- స్పోర్ట్స్‌ ఇటీవల కాలంలో మల్టీ–బిలియన్‌–డాలర్‌ ఇండస్ట్రీగా ఎదిగింది. ప్రొఫెషనల్‌ ప్లేయర్స్‌కు జీతాలతో పాటు స్పాన్సర్‌షిప్‌ అవకాశాలు కూడా వస్తున్నాయి. గేమింగ్‌ ఇండస్ట్రీలో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష ఉద్యోగావకాశాలు ఉన్నాయి అంటుంది టీమ్‌లీజ్‌ డిజిటల్‌ ఫర్మ్‌ రిపోర్ట్‌ ‘గేమింగ్‌: టుమారోస్‌ బ్లాక్‌బస్టర్‌. ప్రోగ్రామింగ్‌ (గేమ్‌ డెవలపర్స్, యూనిటీ డెవలపర్స్‌), టెస్టింగ్‌ (గేమ్స్‌ టెస్ట్‌ ఇంజనీరింగ్, క్వాలిటీ అండ్‌ అసూరెన్స్‌), యానిమేషన్, డిజైన్‌(మోషన్‌ గ్రాఫిక్‌ డిజైనర్స్, వర్చువల్‌ రియాలిటీ డిజైనర్స్‌), ఆర్టిస్ట్స్‌ (వీఎఫ్‌ఎక్స్‌ అండ్‌ కాన్సెప్ట్‌ ఆర్టిస్ట్స్‌), కంటెంట్‌ రైటింగ్, గేమింగ్‌ జర్నలిజం మొదలైన విభాగాలలో యువతకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.
 
స్ఫూర్తిదాయక సూపర్‌స్టార్స్‌
యువతలో ఎంతోమందిలాగే ఈ ముగ్గురికి గేమ్స్‌ అంటే చాలా ఇష్టం. గేమింగ్‌ను వీరు అభిరుచిగా మాత్రమే చూడలేదు. గేమింగ్‌ రంగంలో తమ వ్యాపారదక్షతను నిరూపించుకోవాలకున్నారు. సొంతంగా గేమ్‌ బిల్డింగ్‌ కంపెనీ  ప్రారంభించి తమ సత్తా చాటారు. యువతరంలో ఎంతో మందికి స్ఫూర్తి ఇస్తున్నారు.

సూపర్‌ గేమింగ్‌
యూనివర్శిటీ ఆఫ్‌ ముంబైలో కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ చేసింది క్రిస్టెల్‌ డీక్రూజ్‌. ఆ తరువాత కొలరాడో స్టేట్‌ యూనివర్శిటీ(యూఎస్‌)లో కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ చేసింది. ‘టాప్‌టూలెర్న్‌’లో ఎడ్యుకేషనల్‌ గేమ్‌ డెవలపర్‌గా ఉన్నప్పుడు గేమ్స్‌కు ఉండే పవర్‌ ఏమిటో దగ్గర నుంచి చూసింది. ఆ కంపెనీలో చేరిన తొలి మహిళా ఉద్యోగి క్రిస్టెల్‌. ఆ తరువాత ఫ్రెండ్స్‌తో కలిసి ‘సూపర్‌ గేమింగ్‌’ అనే గేమ్‌బిల్టింగ్‌ కంపెనీ  స్టార్ట్‌ చేసింది.

అపార్‌ గేమ్స్‌
ముంబై యూనివర్శిటీలో ఫైన్‌ ఆర్ట్స్‌లో డిగ్రీ చేసిన లక్ష్మీ కానోల్కర్‌ ముంబైలోని వెలింగ్‌కర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీలో మాస్టర్స్‌ డిగ్రీ చేసింది. ఇంటరాక్టివ్‌ ఇ–లెర్నింగ్‌ చిల్డ్రన్స్‌ కంటెంట్‌ను డిజైనింగ్‌ చేయడం ద్వారా గేమింగ్‌ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. గేమింగ్‌ ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాలు పనిచేసిన అనుభవంతో సొంతంగా గేమ్‌ డెవలపింగ్‌ కంపెనీ ‘అపార్‌ గేమ్స్‌’ ప్రారంభించింది.

వినో జో
ది యూనివర్శిటీ ఆఫ్‌ మాంచెస్టర్‌(ఇంగ్లాండ్‌)లో సైకాలజీలో మాస్టర్స్‌ చేసిన తరువాత కేపీఎంజీ కన్సల్టింగ్‌ వింగ్‌లో చేరింది సౌమ్యా సింగ్‌ రాథోడ్‌. టైమ్స్‌ గ్రూప్‌లో పనిచేసిన తరువాత ‘వినో జో’ పేరుతో సొంతంగా ఆన్‌లైన్‌ సోషల్‌ గేమింగ్‌ కంపెనీని మొదలు పెట్టింది. ‘ఒక విషయంపై మనకు ఇష్టం ఉన్నప్పుడు అదే మన బలంగా మారుతుంది. ఆ బలంతోనే విజయం సాధించవచ్చు’ అంటుంది సౌమ్యా సింగ్‌.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top