కొత్త కేకులు చేసి పాత స్నేహితులకు పంచుదాం...

Baking Tips For Perfect Cakes - Sakshi

కొత్త సంవత్సరం.. కొత్త ఉత్సాహం.. కొత్త నిర్ణయాలు.. కొత్త ఆలోచనలు.. కొత్త వంటలు... కొత్త కొత్త రుచులు... కేకులు... చాకొలేట్లు మామూలే. ఈసారి కొత్తగా కేక్‌లెట్‌లు చేద్దామా... కొత్త వంటేమీ కాదు... సరదాగా కొత్త పిలుపు... అంతే... కొత్త కేకులు చేసి పాత స్నేహితులకు పంచుదాం... కొత్త సంవత్సరానికి కేక్‌లెట్లతో స్వాగతం పలుకుదాం...

చాకొలేట్‌ బర్ఫీ
కావలసినవి: పాలు – ఒకటిన్నర లీటర్లు; పంచదార – ఒక కప్పు; పటిక లేదా నిమ్మ రసం – కొద్దిగా; కోకో పొడి – అర కప్పు; జీడి పప్పు తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు; బాదం పప్పుల తరుగు – ఒక టేబుల్‌ స్పూను; 

తయారీ: స్టౌ మీద ఒక పాత్రలో ఒకటిన్నర లీటర్ల పాలు, ఒక కప్పు పంచదార వేసి బాగా కలపాలి ∙పాలు సగం అయ్యాక కొద్దిగా పటిక/నిమ్మ రసం జత చేయాలి  పాలు బాగా చిక్కబడి ముద్దలా అయ్యేవరకు కలుపుతూనే ఉండాలి (చిక్కబడటానికి సుమారు అరగంట సమయం పడుతుంది)  పావు కప్పు కోకో పొడి, రెండు టేబుల్‌ స్పూన్ల జీడిపప్పు పలుకులు జత చేసి, మంట పెంచి, ఆపకుండా బాగా కలియబెట్టాలి ∙మిశ్రమం బాగా దగ్గర పడ్డాక దింపేయాలి  అల్యూమినియం ప్లేటుకి నెయ్యి పూసి, తయారైన చాకొలేట్‌ మిశ్రమాన్ని అంగుళం మందంలో సమానంగా పరిచి, అప్పడాల కర్రతో జాగ్రత్తగా ఒత్తి, చాకుతో కట్‌ చేయాలి ∙జీడిపప్పు, బాదం తరుగులతో అలంకరించి, అందించాలి.

బ్లాక్‌ ఫారెస్ట్‌ కేక్‌
కావలసినవి: డార్క్‌ చాకొలేట్‌ – పావు కప్పు; బటర్‌ – 100 గ్రా. (అరకప్పు కంటె తక్కువ + ఒక టేబుల్‌ స్పూను); పంచదార – 200 గ్రా. కోడి గుడ్లు – 3; మైదా పిండి – 150 గ్రా. బేకింగ్‌ పౌడర్‌ – ఒక టీ స్పూను కోకో పౌడర్‌ – పావు కప్పు; వెనిలా ఎసెన్స్‌ – ఒక టీ స్పూను; ఇన్‌స్టంట్‌ కాఫీ పొడి – ఒక టేబుల్‌ స్పూను; నెయ్యి – ఒక టీ స్పూను; సిరప్‌ కోసం... నీళ్లు – పావు లీటరు; పంచదార – 200 గ్రా.; దాల్చిన చెక్క – చిన్న ముక్క; క్రీమ్‌ – 400 గ్రా.

తయారీ: స్టౌ మీద ఒక పాత్రలో నీళ్లు పోసి మరిగించాలి ∙ఒక చిన్న పాత్రలో డార్క్‌ చాకొలేట్‌ వేసి, ఆ నీళ్ల మీద ఉంచి కరిగించాలి ∙ఒక పాత్రలో బటర్, పంచదార వేసి కరిగే వరకు బ్లెండర్‌తో బాగా గిలకొట్టాలి ∙కోడి గుడ్డు సొనలు జత చేస్తూ మరోమారు గిలకొట్టాలి ∙కరిగించిన చాకొలేట్‌ జత చేసి మరోమారు గిలకొట్టాలి ∙బేకింగ్‌ పౌడర్, కోకో పొడి జల్లెడలో వేసి జల్లించాలి ∙వెనిలా ఎసెన్స్, ఇన్‌స్టంట్‌ కాఫీ పొడి జత చేసి, మరోమారు కలపాలి (కట్‌ అండ్‌ ఫోల్డ్‌ అంటే ఒకే వైపుగా కలపాలి, రెండో వైపు నుంచి కలపకూడదు)

180 డిగ్రీల దగ్గర అవెన్‌ను సుమారు పావు గంట సేపు ప్రీహీట్‌ చేయాలి ∙వెడల్పుగా లోతుగా ఉన్న కేక్‌ మౌల్డ్‌కు బటర్‌ పూసి, దానిలోనే చాకొలేట్‌ మిశ్రమాన్ని సమానంగా పరిచి, ప్రీహీట్‌ చేసిన అవెన్‌లో ఉంచాలి (కుకర్‌లో అయితే, కుకర్‌ గ్యాస్‌ కట్, విజిల్‌ తీసేసి, లోపల స్టాండ్‌ పెట్టి, మూత పెట్టి, హై ఫ్లేమ్‌ మీద పది నిమిషాలు వేడి చేసి, అప్పుడు కేక్‌ మౌల్డ్‌ పెట్టి, మూత పెట్టి 40 నిమిషాలు సన్నటి మంట మీద బేక్‌ చేయాలి.

పంచదార సిరప్‌ తయారీ
∙స్టౌ మీద ఒక పాత్రలో నీళ్లు పోసి, దాల్చిన చెక్క చిన్న ముక్క, 200 గ్రా. పంచదార జత చేసి మరిగించి, దింపాలి ∙ఒక పాత్రలో క్రీమ్‌ వేసి, క్రీమ్‌ బాగా గట్టిగా అయ్యేవరకు ఆపకుండా స్పీడ్‌గా గిలకొట్టాలి ∙బేక్‌ చేసుకున్న కేక్‌ పూర్తిగా చల్లారాక, పైన ఉన్న పొరను తీసేసి, ఒక ప్లేటులోకి బోర్లించి, అర అంగుళం మందంలో రెండు పొరలుగా కట్‌ చేయాలి ∙కేకు కింది భాగాన్ని ప్లేట్‌లో ఉంచి, దాని మీద పంచదార సిరప్, ఆ తరవాత క్రీం వేసి సమానంగా పరవాలి

మొదటి పొరను అంటే కేక్‌ మీద ఉన్న లేయర్‌ను పెట్టి, దాని మీద పంచదార సిరప్, క్రీమ్‌ వేసి సమానంగా పరవాలి ∙మధ్య పొరను కూడా ఉంచి ఇదేవిధంగా చేయాలి ∙కేకు మీద కొద్దిగా డార్క్‌ చాకొలేట్‌ను తురుముకుని, పక్కల వరకు వెళ్లేలా పరచుకోవాలి ∙కేక్‌ మీద, పక్కల... నచ్చిన ఆకారంలో డిజైన్‌ చేసుకోవాలి ∙ఇలా కేకు పూర్తిగా తయారైన తరవాత ఫ్రిజ్‌లో ఉంచి, గంట తరవాత బయటకు తీసి, ముక్కలుగా చేసి, అందించాలి.

ఎగ్‌లెస్‌ చాకొలేట్‌ నట్స్‌ కేక్‌ 
కావలసినవి: మైదా పిండి – కప్పు; కార్న్‌ఫ్లోర్‌ – 2 టేబుల్‌ స్పూన్లు; బేకింగ్‌ పౌడర్‌ – టీ స్పూను; కోకో పొడి – 2 టేబుల్‌ స్పూన్లు; బటర్‌ – పావు కప్పు; పంచదార పొడి – పావు కప్పు; కండెన్స్‌డ్‌ మిల్క్‌ – అర కప్పు; జీడిపప్పు తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు; బాదం పప్పుల తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు; బ్లూ బెర్రీలు – 2 టేబుల్‌ స్పూన్లు (ఎండబెట్టినవి); కిస్‌మిస్‌ – టేబుల్‌ స్పూను; ఖర్జూరం తరుగు – టేబుల్‌ స్పూను; ఉప్పు – ఒకటిన్నర కప్పులు.

తయారీ:  ∙ఒక పాత్రలో అర కప్పు వేడి నీళ్లు, కోకో పొడి వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి ∙ ప్రెజర్‌ కుకర్‌లో కింద ఉప్పు వేసి, దాని మీద వైర్‌ స్టాండ్, పెర్ఫరేట్‌ ప్లేట్‌ ఉంచి మూతపెట్టి, సన్నని మంట మీద ఉంచాలి ∙ బేకింగ్‌ పౌడర్, మైదా పిండి, కార్న్‌ఫ్లోర్‌లను జల్లించి పక్కన ఉంచాలి ∙ మిక్సింగ్‌ బౌల్‌లో బటర్, పంచదార పొడి వేసి బాగా గిలకొట్టాక, కండెన్స్‌డ్‌ మిల్క్‌ జత చేసి మరోమారు గిలకొట్టాలి (ఎంత ఎక్కువ సేపు గిలకొడితే అంత రుచిగా వస్తుంది) ∙ ఒక పాత్రలో మైదాపిండి మిశ్రమంలో సగం భాగం, కోకో పొడి, డ్రైఫ్రూట్స్‌ (జీడిపప్పు, బాదం పప్పు, కిస్‌మిస్, ఖర్జూరం) ముక్కలు వేసి కలిపాక, మిగిలిన సగం పిండి జత చేసి కలపాలి

ఏడు అంగుళాల మందం ఉన్న అల్యూమినియం గిన్నెకు బటర్‌ పూసి ఈ మిశ్రమాన్ని అందులో పోసి సమానంగా పరవాలి  (బటర్‌ బదులు బటర్‌ పేపర్‌ను కూడా ఉపయోగించవచ్చు) ∙ ఈ గిన్నెను కుకర్‌లో ఉంచి మూత పెట్టి (విజిల్‌ పెట్టకూడదు) సన్నని మంట మీద సుమారు అర గంటసేపు ఉంచాలి (పుల్లతో గుచ్చితే పూర్తిగా తయారైనదీ లేనిదీ తెలుస్తుంది. ఒకవేళ ఇంకా పూర్తి కాలేదనిపిస్తే మరి కాసేపు స్టౌ మీద ఉంచాలి) ∙పూర్తయిన తర్వాత బయటకు తీసి, అంచుల మీదుగా చాకుతో కట్‌ చేస్తూ కేక్‌ను బయటకు తీసి, పైన పంచదారను కొద్దిగా చల్లి అందించాలి.

రవ్వ కేక్‌
కావలసినవి: బొంబాయి రవ్వ – ఒక కప్పు; మైదా పిండి – అర కప్పు; పంచదార పొడి – ముప్పావు కప్పు; తాజా పెరుగు – అర కప్పు; వేడి పాలు – ఒక కప్పు; నెయ్యి – 3 టీ స్పూన్లు; ఏలకులు – 4; బేకింగ్‌ పౌడర్‌ – ఒక టీ స్పూను

తయారీ: ఒక పాత్రలో ముందుగా పెరుగు వేసి గిలకొట్టాలి ∙పంచదార పొడి జత చేసి మరోమారు గిలకొట్టాలి ∙నెయ్యి, మైదా పిండి, ఒకదాని తరవాత ఒకటి వేసి కలియబెట్టాలి ∙బొంబాయి రవ్వ వేసి మరోమారు కలపాలి ∙చివరగా పాలు జత చేసి అన్నీ కలిసేలా బాగా కలియబెట్టాలి ∙మూత పెట్టి అరగంటసేపు వదిలేయాలి ∙స్టౌ మీద కుకర్‌లో ఉప్పు వేసి దాని మీద స్టాండ్‌ ఉంచాలి ∙విజిల్‌ లేకుండా మూత ఉంచి కుకర్‌ను వేడి చేయాలి ∙తయారుచేసి ఉంచుకున్న మిశ్రమానికి ఏలకుల పొడి, బేకింగ్‌ పౌడర్, కొద్దిగా పాలు జత చేసి కలియబెట్టి, మౌల్డ్‌లో సమానంగా పోయాలి ∙ప్రీ హీట్‌ చేసిన కుకర్‌లో ఈ పాత్రను జాగ్రత్తగా ఉంచి మూత పెట్టి, మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, సుమారు అర గంటసేపు ఉంచాలి (పుల్లతో గుచ్చితే అంటుకోకపోతే కేక్‌ సిద్ధమైనట్లే) ∙గిన్నె బయటకు తీసి, కొద్దిగా చల్లారాక కేక్‌ను జాగ్రత్తగా బయటకు తీసి, నచ్చిన ఆకారంలో కట్‌ చేసుకోవాలి. 

ఎగ్‌లెస్‌ మిల్క్‌ కేక్‌
కావలసినవి: మైదా పిండి – ముప్పావు కప్పు; కరిగించిన వెన్న – ముప్పావు కప్పు; నీళ్లు – ముప్పావు కప్పు; పాల పొడి – పావు కప్పు; బేకింగ్‌ పౌడర్‌ – ఒక టేబుల్‌ స్పూను; పంచదార – ముప్పావు కప్పు; మిక్స్‌డ్‌ డ్రైఫ్రూట్స్‌ – పావు కప్పు

తయారీ: ఒక పాత్రలో నీళ్లు, పంచదార వేసి పంచదార కరిగే వరకు బాగా కలపాలి ∙పాల పొడి జత చేసి ఉండలు లేకుండా  కలపాలి ∙కరిగించిన వెన్న జత చేసి క్రీమ్‌లా అయ్యే వరకు బాగా కలపాలి ∙జల్లెడ పట్టిన మైదా, బేకింగ్‌ పౌడర్‌ మిశ్రమాన్ని జత చేసి బాగా కలియబెట్టాలి (ఒకే దిశలో కలపాలి, రెండో వైపుకి కలిపితే కేక్‌ గట్టిగా వస్తుంది) ∙కేక్‌ టిన్‌లో బటర్‌ పేపర్‌ వేసి దాని మీద పిండి పోయాలి (ఆలస్యం చేయకూడదు) ∙డ్రైఫ్రూట్స్‌కి మైదా పిండి జత చేసి, కేక్‌ మీద సమానంగా పరవాలి ∙ప్రీహీట్‌ చేసిన అవెన్‌లో 180 డిగ్రీల దగ్గర 25 నిమిషాలు పాటు కేక్‌ను బేక్‌ చేయాలి ∙కొద్దిగా చల్లారాక టిన్‌లో నుంచి బయటకు తీసి, కట్‌ చేసుకోవాలి.

వెనిలా కప్‌ కేక్స్‌
కావలసినవి: ఉప్పు – 2 కప్పులు; బటర్‌ – పావు కప్పు; పంచదార పొడి – పావు కప్పు; వెనిలా ఎసెన్స్‌ – టీ స్పూను; కండెన్స్‌డ్‌ మిల్క్‌ – అర కప్పు; బేకింగ్‌ పౌడర్‌ – టీ స్పూను; మైదా పిండి – కప్పు; సోడా – అర కప్పు (క్లబ్‌ సోడా); చెర్రీస్‌ – 20. 

తయారీ:  ∙కుకర్‌లో రెండు కప్పుల ఉప్పు వేసి, దాని మీద ఒక స్టాండు, ఆ పైన ఒక ప్లేట్‌ పెట్టి, మీడియం మంట మీద ఉంచాలి ∙మిక్సింగ్‌ బౌల్‌లో బటర్, పంచదార పొడి వేసి బాగా గిలకొట్టాక, వెనిలా ఎసెన్స్, కండెన్స్‌డ్‌ మిల్క్‌ జత చేసి మరోమారు బాగా గిలకొట్టాలి ∙ఒక పాత్రలో బేకింగ్‌ పౌడర్, మైదా పిండి వేసి బాగా కలిపి, సగం మిశ్రమాన్ని పైన తయారుచేసి ఉంచుకున్న బటర్‌ మిశ్రమానికి జత చేసి బాగా కలిపాక, మిగిలిన సగం వేసి మరోమారు కలపాలి ∙సోడా (క్లబ్‌ సోడా వంటివి) వేసి బాగా కలపాలి ∙కప్‌ కేక్‌లను తీసుకుని అందులో ఒక్కోదానిలో ఒక్కో చెర్రీ వేసి, తయారుచేసి ఉంచుకున్న మిశ్రమం అందులో పోసి, వీటిని చిన్న ట్రేలో ఉంచి, ట్రేను కుకర్‌లో ఉంచి మూత పెట్టాలి (విజిల్‌ పెట్టకూడదు)  సుమారు అరగంటసేపయ్యాక తీసేయాలి  చల్లారాక బయటకు తీసి అందించాలి.

ఎగ్‌లెస్‌ ఫ్రెష్‌ ఫ్రూట్‌ కేక్‌
కావలసినవి: మైదా పిండి – కప్పు; బటర్‌ – పావు కప్పు; పంచదార పొడి – పావు కప్పు; కండెన్స్‌డ్‌ మిల్క్‌ – అర కప్పు; తాజా క్రీమ్‌ – పావు కప్పు; బేకింగ్‌ పౌడర్‌ – టీ స్పూను; కస్టర్డ్‌ పౌడర్‌ – టీ స్పూను; వెనిలా ఎసెన్స్‌ – టీ స్పూను; ఉప్పు – 2 కప్పులు; చిలకరించిన క్రీమ్‌ – 500 గ్రా.; పంచదార పొడి – పావు కప్పు; పంచదార సిరప్‌ – పావు కప్పు; తాజా పండ్ల ముక్కలు – (కివి, కమలాపండు తొనలు, దానిమ్మ గింజలు, చెర్రీలు, ఆపిల్‌ ముక్కలు, పైనాపిల్‌ ముక్కలు....)– ఒక కప్పు; స్ట్రాబెర్రీ వేఫర్స్‌ – తగినన్ని.

తయారీ: ∙కుకర్‌లో రెండు కప్పుల ఉప్పు వేసి, దాని మీద ఒక స్టాండు, ఆ పైన ఒక ప్లేట్‌ ఉంచి, స్టౌ మీద సన్నని మంట మీద ఉంచాలి ∙మిక్సింగ్‌ బౌల్‌లో బటర్, పంచదార వేసి బాగా క్రీమీగా వచ్చేవరకు కలపాలి ∙కండెన్స్‌డ్‌ మిల్క్, వెనిలా ఎసెన్స్‌ జత చేసి సుమారు రెండు మూడు నిమిషాలు బాగా గిలకొట్టాక, పావు కప్పు క్రీమ్‌ జత చేసి మరోమారు గిలకొట్టాలి ∙మైదా పిండి, బేకింగ్‌ పౌడర్, కస్టర్డ్‌ పౌడర్‌... వీటిని జల్లెడ పట్టి, పైన తయారుచేసి ఉంచుకున్న మిశ్రమంలో వేసి కలపాలి ∙ఏడు అంగుళాల అల్యూమినియం కేక్‌ ట్రే కి బటర్‌ పూసి, కేక్‌ మిశ్రమాన్ని అందులో పోసి సమానంగా పరిచి, కుకర్‌లో ఉంచి సుమారు అరగంటసేపు సన్నని మంట మీద ఉంచి (విజిల్‌ పెట్టకూడదు) దింపి, పది నిమిషాలు చల్లారాక, అంచుల మీదుగా చాకుతో కట్‌ చేసి కేక్‌ను బయటకు తీయాలి

500 మి.లీ. క్రీమ్‌ను బాగా గిలకొట్టాలి ∙పావు కప్పు పంచదార పొడి జత చేసి మరోమారు గిలకొట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి (వాడే ముందు మాత్రమే బయటకు తీయాలి) ∙కేక్‌ను ఒక ప్లేట్‌లోకి తిరగదీసి అంచులను చాకుతో నీట్‌గా కట్‌ చేయాలి ∙చాకుతో కేక్‌ చుట్టూ క్రీమ్‌ అప్లయ్‌ చేయాలి ∙పైన మధ్యభాగంలో మాత్రం కొద్దిగా ఎక్కువ క్రీమ్‌ను ఉంచి, దాని మీద కొద్దిగా పంచదార సిరప్‌ చిలకరించి ఆ పైన మరి కాస్త క్రీమ్‌ వేసి, దాని మీద తాజా పండ్ల ముక్కలు వేసి, చేతితో నెమ్మదిగా ఒత్తాలి ∙పైన మళ్లీ క్రీమ్, పళ్ల ముక్కలు వేసి ఒత్తాలి ∙ఇలా మూడు పొరలు పూర్తయ్యాక చివరగా పంచదార సిరప్, క్రీమ్‌ వేసి పెద్ద చాకు సహాయంతో సమానంగా పరిచి, ఎక్కువైన క్రీమ్‌ను చాకుతో తీసేసి, కేక్‌ను ఫ్రీజ్‌లో సుమారు అర గంట సేపు ఉంచి తీయాలి ∙చివరగా మళ్లీ కేక్‌ మీద క్రీమ్‌ వేసి చాకుతో సమానంగా పరిచి, చుట్టూ కూడా వచ్చేలా చేసి, చివరగా స్ట్రాబెర్రీ వేఫర్‌లు అలంకరించి సుమారు నాలుగు గంటలు ఫ్రిజ్‌లో ఉంచి, తీసి అందించాలి.

బ్లూ బెర్రీ రసగుల్లా చీజ్‌ కేక్‌
కావలసినవి:  బిస్కెట్లు – 125 గ్రా.; కరిగించిన బటర్‌ – 75 మి.లీ.; క్రీమ్‌ చీజ్‌ – 200 గ్రా.; పంచదార పొడి – 1/3 కప్పు; క్రీమ్‌ – 300 మి.లీ. (బాగా గిలకొట్టాలి); కండెన్స్‌డ్‌ మిల్క్‌ – 200 మి.లీ.; చైనా గ్రాస్‌ – 10 గ్రా.; బ్లూ బెర్రీలు – 3 టేబుల్‌ స్పూన్లు (ఎండినవి వాడుతుంటే, ముందు రోజు రాత్రి అర కప్పు నీళ్లలో నానబెట్టాలి); బాదం పప్పులు – 3 టేబుల్‌ స్పూన్లు; చిన్న రసగుల్లాలు – 30.

తయారీ:  
బిస్కెట్లను చేత్తో గట్టిగా నలిపి పొడి చేసి, కరిగించిన బటర్‌లో నెమ్మదిగా వేస్తూ కలపాలి (కలపడం పూర్తయ్యే సరికి తడిసిన ఇసుకలా ఉంటుంది)
ఈ మిశ్రమాన్ని తొమ్మిది అంగుళాల స్ప్రింగ్‌ ఫామ్‌ కేక్‌ టిన్‌లో పోసి గట్టిగా ఒత్తి ఫ్రిజ్‌లో ఉంచాలి
1/3 వంతు కప్పు నీళ్లలో చైనా గ్రాస్‌ను సుమారు పావు గంట సేపు నానబెట్టాలి
ఒక పాత్రలో క్రీమ్‌ వేసి బాగా గిలకొట్టాలి
మరో పాత్రలో క్రీమ్‌ చీజ్, పంచదార పొడి వేసి గిలకొట్టాలి
సన్నని మంట మీద పాన్‌ ఉంచి, వేడయ్యాక, నానబెట్టి ఉంచుకున్న చైనా గ్రాస్‌ వేసి పూర్తిగా ఉడికేవరకు ఉంచి తీసేయాలి
పాన్‌లో కండెన్స్‌డ్‌ మిల్క్, గోరు వెచ్చని నీళ్లు జత చేయాలి
ఉడికించిన చైనా గ్రాస్‌ జత చేసి, బాగా కలిపి రెండు నిమిషాలు ఉంచి, దించి కొద్దిగా చల్లార్చాలి
ఈ మిశ్రమాన్ని క్రీమ్‌ చీజ్‌ మిక్స్‌కి జత చేసి బాగా గిలకొట్టాలి
బెర్రీలు, బాదం పప్పులు వేసి కలపాలి
(బ్లూబెర్రీలు నానబెట్టిన నీళ్లు కొన్నిటిని జత చేయవచ్చు)
గిలకొట్టిన క్రీమ్, రసగుల్లాలను వేయాలి
కేక్‌ టిన్‌లో చీజ్‌ కేక్‌ మిశ్రమం వేసి సమానంగా పరిచి ఫ్రిజ్‌లో సుమారు 12 గంటలు ఉంచి తీయాలి
కేక్‌ను టిన్‌ నుంచి జాగ్రత్తగా విడదీసి అందంగా అలంకరించి అందించాలి. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top