
గత సంవత్సరం కేరళలోని వయనాడ్‌లో వచ్చిన భారీ వర్షాలు, విరిగి పడిన కొండచరియలు ఎంతోమంది జీవితాలను అస్తవ్యస్తం చేశాయి. ఈ నేపథ్యంలో వరదబాధితులకు వేగంగా సహాయం అందించడానికి ఆర్మీ ఆఫీసర్ సీతా షెల్కే 144 మంది ఆర్మీ జవానుల బృందంతో కలిసి ‘బేలీ వంతెన’ నిర్మించింది.
ఆనాటి వరదల్లో సర్వస్వం కోల్పోయిన మహిళలకు ఇప్పుడు ‘బేలీ’ అండగా నిలబడింది. అయితే ఇది వంతెన కాదు. వరద బాధిత మహిళలు తమ జీవితాలను పునర్మించుకోవడానికి వచ్చిన ప్రాజెక్ట్. ‘బేలీ అంబరిల్లా అండ్ బ్యాగ్స్ ప్రాజెక్ట్’ ద్వారా ఎంతోమంది మహిళల జీవితాల్లో కొత్త వెలుగు వచ్చింది.
జిల్లా అధికార యంత్రాంగం స్వయం సహాయక బృందం ‘కుటుంబశ్రీ’ భాగస్వామ్యంతో ‘బేలీ అంబరిల్లా అండ్ బ్యాగ్స్ ప్రాజెక్ట్’ను ప్రారంభించింది. ఆనాటి వరదల్లో ‘బేలీ వంతెన’ ఎంతోమంది బాధితులను కాపాడింది. ఆ కృతజ్ఞతతోనే ఈ జీవనోపాధి ప్రాజెక్ట్‌కు ‘బేలీ’ అని నామకరణం చేశారు. ‘బేలీ ప్రాజెక్ట్’లోని మహిళలు తయారు చేస్తున్న రంగురంగుల గొడుగులు, బ్యాగులను కుటుంబశ్రీ స్టాల్స్, ట్రైబల్ డిపార్ట్‌మెంట్ ఔట్‌లెట్స్‌లో ప్రదర్శిస్తున్నారు.
‘బేలీ బ్రాండ్’ బ్యాగులు, గొడుగులకు తక్కువ కాలంలోనే మంచి పేరు వచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి వీటికి ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. ‘బేలీ ప్రాజెక్ట్’కు సంబంధించిన పని ప్రదేశం... కేవలం బ్యాగులు, గొడుగుల తయారీ కేంద్రం మాత్రమే కాదు. ‘విపత్కర పరిస్థితులను తట్టుకొని నిలబడవచ్చు. మోడువారిన పరిస్థితులలోనూ కొత్తగా పునర్జీవించవచ్చు’ అని బలంగా చెప్పే ప్రదేశం.
(చదవండి: ఆ గుండె17 నిమిషాల పాటు ఆగింది!)