
పిల్లల్లో ఆస్తమా వచ్చి వాళ్లు బాధపడుతుంటే చూసేవాళ్లకు ఆ దృశ్యం చాలా హృదయవిదారకంగా ఉంటుంది. అలా ఆయాసపడుతూ ఊపిరి అందని చిన్నారులను చూస్తే చాలా బాధగా ఉంటుంది. అయితే చిన్నవయసులో ఆస్తమా వచ్చిన చిన్నారుల విషయంలో అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదంటూ డాక్టర్లు భరోసా ఇస్తున్నారు. నిజానికి పిల్లల్లో వచ్చే ఈ ఆరోగ్య సమస్యను ‘రియాక్టివ్ ఎయిర్ వే డిసీజ్’ అంటారు. కానీ సామాన్య జనవాడుకలో దీన్ని ఆస్తమాగా చెబుతుంటారు.
చిన్నారుల ఆస్తమా చికిత్సలో అవసరాన్ని బట్టి కొన్ని మందులు నెబ్యులైజేషన్ తర్వాత వారిలో మున్ముందు ఆస్తమా రాకుండా చూసేందుకు డాక్టర్లు రెండు రకాల ఇన్‌హేలర్స్ సూచిస్తుంటారు. ఇందులో మొదటి రకం ఇన్‌హేలర్స్‌ను ‘రిలీవర్స్’ అంటారు. ఇవి తక్షణం ఊపిరి అందేందుకు మొట్టమొదటి చికిత్స (ఫస్ట్ లైన్ ట్రీటెమెంట్) కోసం వాడేవి. ఇవి అటాక్‌నుంచి రిలీవ్ చేస్తాయి కాబట్టి వీటిని ‘రిలీవర్స్’ అంటారు. ఇవి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే గాలిగొట్టాలను వెడల్పుగా విప్పారేలా చేసి పిల్లలు హాయిగా గాలితీసుకునేందుకు ఉపయోగపడతాయి.
ఇక ఆస్తమా అటాక్ వచ్చినప్పుడు ఊపిరితిత్తుల్లో కొన్ని ఇన్‌ఫ్లమేటరీ సెల్స్ పుడతాయి. వీటిని తొలగించడం రిలీవర్స్‌కు సాధ్యం కాదు. అలాంటి వాటిని తొలగిస్తూ మున్ముందుకు అటాక్ రాకుండా నివారించే ఇన్‌హేలర్స్‌ను ‘ప్రివెంటర్స్’ అంటారు. అవి నివారణకు ఉపయోగపడతాయి కాబట్టి వాటిని ప్రివెంటార్స్‌గా అభివర్ణిస్తారు. ఇలా ఈ రెండు రకాల ఇన్‌హేలర్స్‌తో చిన్నారుల ఊపిరితిత్తుల కార్యకలాపాలు వీలైనంత నార్మల్‌గా పనిచేసేలా డాక్టర్లు చూస్తారు. ఇవి వాడుతూపోతుంటే క్రమంగా ‘రిలీవర్స్’ వాడాల్సిన అవసరం దాదాపుగా పూర్తిగా తగ్గిపోతుంది.
పిల్లల్లో వ్యాధి తీవ్రత ఎంతగా ఉందో, దాన్ని అదుపులో ఉంచేందుకు మందుల డోస్‌లు ఎంతెంత మార్చాలో తెలుసుకోవడం కోసం అవసరమైనప్పుడు డాక్టర్లు ‘పల్మునరీ ఫంక్షన్ టెస్ట్ – పీఎఫ్‌టీ’ అనే పరీక్ష చేస్తారు. పిల్లలు పెరుగుతున్నకొద్దీ చాలామందిలో అటాక్స్ దాదాపు పూర్తిగా తగ్గిపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువ. చాలామంది పిల్లల్లో ఆర్నెల్లలోనే ఆస్తమా పూర్తిగా అదుపులోకి వచ్చేసే అవకాశాలుంటాయి. ఒకసారి ఆస్తమా అదుపులోకి వచ్చాక ఇన్‌హేలర్స్ దాదాపు నిలిపివేయవచ్చు కూడా.
అయితే ఈ ఇన్‌హేలర్స్‌కు పిల్లలు అలవాటు పడిపోతారేమోనని కొంతమంది తల్లిదండ్రులు ఆందోళన పడుతుంటారు. ఇది కేవలం అ΄ోహ మాత్రమే. పైగా ఇన్‌హేలర్స్ ఎంత సురక్షితమంటే నోటి నుంచి తీసుకునే మందులతో పోలిస్తే వాటిలోంచి దేహంలోకి వెళ్లే మందు కేవలం సమస్య ఉన్న చోటికే పరిమితమవుతుంది. దేహమంతటా తన దుష్ప్రభావాలు చూపదు. అందుకే అవి పూర్తిగా సురక్షితమని పేరెంట్స్ నమ్మవచ్చు.
(చదవండి: Dental Health: ఓపెన్ యువర్ మౌత్..! నోటి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఇలా..)