
నోరు బాగుంటే ఊరు బాగుంటుందని సామెత. ఊరూ... ఊరి వ్యక్తులతో సంబంధాలే కాదు... నోటి పలువరస బాగుంటే, దంతాలకు సంబంధించిన వ్యాధులేమీ లేకపోతే వ్యక్తి చిరునవ్వు, ఇనుమడించిన ముఖపు అందం, మంచి పలువరస కారణంగా చక్కటి ఉచ్చారణ... ఇలా చాలా అంశాలు బాగుంటాయి. నోరూ లేదా దంతాలకు సంబంధించి ఏదైనా సమస్య వస్తే... అప్పటికప్పుడు ఆ సమస్యకు చికిత్స అందించడమన్నది కాకుండా... ఓ పూర్తి స్థాయి చికిత్సను ‘సమగ్రం’గా అందించడం ద్వారా నోటి ఆరోగ్యాన్ని అన్ని విధాలా కాపాడే చికిత్స ప్రక్రియే‘ఫుల్ మౌత్ రీ–హ్యాబిలిటేషన్’. సంక్షిప్తంగా ‘ఎఫ్‌ఎమ్‌ఆర్’ అని పిలిచే ఈ చికిత్స ప్రక్రియ గురించి తెలిపేదే ఈ కథనం.
నోటిలోని పళ్లకూ, పలువరసకూ అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ పళ్లు అరిగి΄ోవడం, కొన్ని విరిగి΄ోవడం, కొన్ని చోట్ల సందులు రావడం వంటివి జరుగుతుండటం మామూలే. దీనికి తోడు కొందరిలో చిగుర్ల సమస్యలూ రావచ్చు. మరికొందరిలో ఒకటో రెండూ పళ్లు ఊడి΄ోవచ్చు. అయితే ఇవన్నీ జరుగుతున్నప్పటికీ తమకు సంబంధించినంతవరకూ ఏ సమస్యా లేక΄ోతే కొందరు దంతవైద్యుడి వద్దకు వెళ్లరు. చికిత్స తీసుకోరు. కారణం... పని నడుస్తోంది కాబట్టి అలా రోజులు వెళ్లదీయడమే పనిగా పెట్టుకుంటారు.
కొన్ని సమస్యలు...
అలా నోటిలో పళ్లు అరగడం, విరగడం, దంతాలూ ఊడిపోవడం వల్ల సందులు రావడాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల మరికొన్ని సమస్యలు రావచ్చు. ఉదాహరణకు...
పలువరసలోని కొన్ని పళ్లు ఊడటం వల్ల దంతాల మధ్య సందులు (గ్యాప్) వచ్చి అక్కడ ఆహారం చిక్కుకుపోయి, అది కుళ్లుతుండటం వల్ల దంతక్షయం మరింత వేగంగా జరగడం. అలా పళ్లు ఊడిన చోట ఆహారం చిక్కుకు΄ోయి కుళ్లుతుండటంతో నోటి దుర్వాసన వస్తుండటం. పళ్లు ఊడిన కారణంగా ముఖం ఆకృతి చెడిపోయి మునపటి కంటే అందవిహీనంగా కనిపించడం.
పళ్లు ఊడటం లేదా పలువరసలో సందుల కారణంగా మాట్లాడుతున్నప్పుడు పళ్లసందుల నుంచి గాలిపోతూ ఉచ్చారణ సరిగా లేకపోవడం, దాంతో సరైన కమ్యూనికేషన్ జరగక... ఎదుటివారికి మాట సరిగా అర్థం కాకపోవడం. ఊడినపళ్ల కారణంగా చిరునవ్వు నవ్వేందుకు ఇబ్బంది పడుతూ నలుగురిలో మనస్పూర్తిగా నవ్వలేకపోవడం.
ఆరోగ్యపరంగానూ మరికొన్ని నష్టాలు...
ఊడిన పళ్ల కారణంగా ఆహారాన్ని సరిగా / పూర్తిగా నమలలేకపోవడం. పలువరసలో వచ్చిన గ్యాప్ కారణంగా పళ్లు ఉన్నచోటి నుంచి పక్కకు కదిలిపోతూ ఉండటం. ఊడిన పళ్ల వల్ల వచ్చిన సందుల కారణంగా పలువరస చెడిపోయి కొరికినప్పుడు పైవరస, కింది వరస పళ్లు సరిగా అమరకపోఒవడం (అలైన్‌మెంట్ సరిగా జరగకపోవడం). (రెండు దవడలూ కలిసినప్పుడు అవి సరిగా అమరకపోవడం).
నములుతున్నప్పుడు కింది దవడ కదిలినప్పుడల్లా క్లిక్ క్లిక్ మంటూ శబ్దం (క్లికింగ్ సౌండ్) రావడం.
మానసిక సమస్యలకూ దారితీసే ప్రమాదం...
ఇలా పలువరసకు వచ్చే సమస్యలతో కేవలం భౌతికంగా కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు రావడం లుక్స్‌పరంగా ఇబ్బంది కలగడం మాత్రమే కారణంగా... ఆత్మవిశ్వాసం లోపించడం, చిరునవ్వు నవ్వలేకపోవడంతో కొన్ని సందర్భాల్లో కొందరిలో ఈ సమస్య మానసికమైన రుగ్మతలకూ కారణమయ్యేందుకూ అవకాశాలు లేకపోలేదు.
పై ప్రక్రియలన్నింటి సాయంతో కొన్ని కొన్ని సిట్టింగులలో నోటికి అవసరమైన పూర్తిస్థాయి సమగ్రమైన సంయుక్త చికిత్సను ఈ ‘ఫుల్ మౌత్ రీ–హ్యాబిలిటేషన్’లో అందిస్తారు. దాంతో పేషెంట్లకు దంతపరంగా లేదా నోటి ఆరోగ్యపరంగా అవసరమైన అనేక అవసరాలు ఒకే సమగ్రచికిత్సలో తీరి΄ోవడం సాధ్యమవుతుంది.
అన్ని రకాల సమస్యలకూ కలిపి ఒక సమగ్ర చికిత్సే ‘ఎఫ్‌ఎమ్‌ఆర్’...
దంతాల సమస్యలకు చికిత్సలు విడివిడిగా ఉంటాయి. ఉదాహరణకు పళ్లు అరిగినప్పుడు ఫిల్లింగ్ చేయడం లేదా క్యాప్ వేయడం, అలాగే చిగుర్లకు వచ్చే జింజివైటిస్, పెరియోడాంటైస్ వంటి సమస్యలకూ ఇవ్వాల్సిన చికిత్సలూ ఇలా రకరకాల సమస్యలకు నిర్దిష్టంగా చికిత్సలు ఇస్తుంటారు. అయితే అనేక రకాల సమస్యలు ఒకేసారి కనిపించినప్పుడు అనేక చికిత్సలను కలగలిపి ఒకే సమగ్ర చికిత్సగా ఇవ్వడమూ సాధ్యమవుతుంది.
ఇందులో అరిగిన / విరిగిన పళ్లకు పైన దంతాన్ని పునర్నిర్మించడం (క్రౌన్స్), పన్నుకూ పన్నుకూ మధ్య మరో పన్ను పోయినప్పుడు బ్రిడ్జ్ చికిత్సలు, ఆర్థోడాంటిక్స్ (దవడ పళ్లు లేదా దవడల అమరిక సరిగా లేనప్పుడు ఇవ్వాల్సిన చికిత్సలూ), చిగుర్లకు చికిత్సలూ... వీటన్నింటినీ కలిపి సంయుక్తంగా చికిత్సలను అందించడాన్ని ‘ఫుల్ మౌత్ రీ–హ్యాబిలిటేషన్’ (ఎఫ్‌ఎమ్‌ఆర్)గా చెబుతారు.
ఎఫ్‌ఎమ్‌ఆర్‌లో ఏం జరుగుతుంది...
ఈ సమగ్ర చికిత్స ప్రక్రియలో కంప్యూటర్ సహాయంతో నోటి తాలూకు పూర్తి చిత్రీకరణ... ఉదాహరణకు... కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్ (క్యాడ్) అలాగే కంప్యూటర్ ఎయిడెడ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ (క్యామ్) లతో నోటి నిర్మాణాన్ని తొలుత రూపొందించుకుంటారు.
అటు తర్వాత నోటిలో ఉన్న సమస్యలన్నింటినీ తెలుసుకుని, ఏయే రకాల సమస్యలకూ ఏయే చికిత్సలనే ఓ సమగ్ర ప్రణాళికను రచించుకుంటారు. అవసరాన్ని బట్టి ఎలాంటి కృత్రిమమైన ఇంప్లాంట్స్ అమర్చాలో నిర్ణయించుకుంటారు.
ఇక అందానికీ, లుక్స్‌కు సంబంధించిన సమస్య అయితే దానికి తగ్గట్టుగా కాస్మటిక్ చికిత్స కోసం అవసరమైన వినీర్స్ (బాధితుల వ్యక్తిగత అవసరాల కోసం తగిన విధంగా రూపొందించిన పంటిపై అమర్చేందుకు ఆ పంటి రంగే కలిగిన పలుచటి పొరల్లాంటివి) సమకూర్చుకుంటారు. చిగుర్ల సమస్యలు ఉంటే దానికి ఇవ్వాల్సిన మందులను సూచిస్తారు.
డాక్టర్ సుధీర్ చౌదరి కరణంఆర్థోడాంటిస్ట్ – ఇంప్లాంట్ స్పెషలిస్ట్
(చదవండి: Parenting Tips: పిల్లలు ప్రయోజకులు అవ్వాలంటే..? ఐఏఎస్ అధికారిణి పేరెంటింగ్ టిప్స్‌లు..!)