పూల కళాతోరణం షర్మిల నిలయం | Art gallery Of Sharmila Agarwal Home | Sakshi
Sakshi News home page

పూల కళాతోరణం షర్మిల నిలయం

Published Tue, Jan 9 2024 6:07 AM | Last Updated on Tue, Jan 9 2024 6:07 AM

Art gallery Of Sharmila Agarwal Home - Sakshi

హైదరాబాద్, శ్రీనగర్‌ కాలనీ, షర్మిలా అగర్వాల్‌ ఇంట్లోకి అడుగుపెడితే మ్యూజియంలోకి ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది. విశాలమైన రెండు గదుల గోడల నిండా ఆమె వేసిన చిత్రలేఖనాలు, ఆమె సేకరించిన అరుదైన కళారూపాలు ఉన్నాయి. సెంటర్‌ టేబుళ్లు, కార్నర్‌ స్టాండుల్లో ఇకేబానా (జపాన్‌ పుష్పాలంకరణ కళ) ఫ్లవర్‌ అరేంజ్‌మెంట్‌ అలరిస్తుంది. మరోవైపు ర్యాక్‌లలో ఆమె ఆవిష్కరించిన పుస్తకాల ప్రతులు కొలువుదీరి ఉన్నాయి.

షర్మిలా అగర్వాల్‌ స్వయంగా రచయిత్రి, చిత్రకారిణి, ఇకేబానా పుష్పాలంకరణలో నిష్ణాతురాలు. ఈ మూడు కళలూ ఒకరిలో రాశిపోసి ఉండడంతో కావచ్చు ఆమె చిత్రాల్లో... ఆమె కవిత్వంలో కనిపించే భావుకత ద్యోతకమవుతుంది, అలాగే అదే చిత్రాల్లో ఆమె అలంకరించే ఇకేబానా కూడా కనిపిస్తుంది. రచయిత కావడంతో ఇకేబానా పుష్పాలంకరణను అక్షరబద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు పుస్తకాలు వెలువరించారామె.

గడచిన గురువారం (నాలుగవ తేదీన) ‘ఇకేబానా సులభం’ తెలుగు పుస్తకాన్ని ఆవిష్కరించారు. చిన్నపిల్లలకు ప్రాక్టీస్‌ వర్క్‌బుక్స్‌ పోలిన పది పుస్తకాల సెట్‌ను నేడు విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సాక్షితో మాట్లాడుతూ ‘గురువు పర్యవేక్షణలో నేర్చుకోవడం అందరికీ సాధ్యం కాదు, కాబట్టి ఈ పుస్తకాల సహాయంతో ఇంట్లోనే ప్రాక్టీస్‌ చేయవచ్చు. ఇకేబానా పుష్పాలంకరణ కళ ప్రతి తెలుగింటికీ చేరాలనేది నా కల. పుస్తకాన్ని ఎవరికి వారు స్వయంగా నేర్చుకోవడానికి అనువుగా రూపొందించాను’ అన్నారామె.  
 
పువ్వు మాట్లాడుతుంది!
‘‘పూలు మన మనసుకు అద్దం పడతాయి. పుష్పాలంకరణ మన ఇంటికి వచ్చిన అతిథులకు మన మాటగా మౌనంగా స్వాగతం పలుకుతుంది, మనసును ఆహ్లాదపరుస్తుంది. అందుకే ప్రతి ఇంటిలో తాజా పువ్వు కనిపించాలి. అందుకే నా ఈ ప్రయత్నం. ఇక నా వివరాలకు వస్తే... నేను పుట్టింది, పెరిగింది ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో. రాసే అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది. నా కవితలు స్థానిక హిందీ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.

పెయింటింగ్స్‌ కూడా ఇష్టంగా వేసేదాన్ని. ఇక చదువు కూడా అదే బాటలో సాగింది. లిటరేచర్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్, ఫైన్‌ ఆర్ట్స్‌లో కోర్సు చేశాను. మీనియేచర్‌ పెయింటింగ్స్‌ ఎక్కువగా ప్రాక్టీస్‌ చేస్తుంటాను. పెళ్లి తర్వాత హైదరాబాద్‌ రావడం నాకు టర్నింగ్‌ పాయింట్‌ అనే చెప్పాలి. హైదరాబాద్‌ నగరం చిత్రకారిణిగా నాకు గుర్తింపునిచ్చింది. సోలో ఎగ్జిబిషన్‌లు పెట్టాను, వేరే ప్రదర్శనల్లో నా చిత్రాలను ప్రదర్శించాను.

నా స్టూడియోలో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు అన్ని ప్రదేశాల ప్రత్యేకతలనూ చూడవచ్చు. హిందీలో చంద్‌ లమ్హే,, కహా అన్‌ కహా రాశాను. పెయింటింగ్‌ గురించి మెళకువలు నేర్పించడానికి ‘ఇన్నర్‌ రిఫ్లెక్షన్స్‌’ పేరుతో రచనను సిద్ధం చేస్తున్నాను. ఇకేబానా గురించి చెప్పాలంటే ఇది నిరంతరనం సాధన చేయాల్సిన కళ. ఈ ఆర్ట్‌లో కొత్త విషయాలను నేర్చుకోవడానికి జపాన్‌కి ఆరుసార్లు వెళ్లాను.

గతంలో ‘ఇకేబానిస్ట్స్‌ అరౌండ్‌ ద వరల్డ్, ఇకేబానా ఫర్‌ బిగినర్స్, ఇకేబానా జపానీ పుష్పకళ’ ప్రచురించాను. ‘ఇకేబానా మనదేశానికి వచ్చి అరవై ఏళ్లు దాటింది. ముంబయికి చెందిన నిర్మలా లుక్మాణి 1961లో జపాన్‌కెళ్లి ఒహారా స్కూల్‌లో డిగ్రీ చేసి తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లోనే విద్యార్థులకు శిక్షణనివ్వడం మొదలుపెట్టారు...’ వంటి చారిత్రక వివరాలందించాను.

తెలుగు స్నేహితుల సహాయంతో ‘ఇకేబానా సులభం’ పుస్తకంలో... ఇకేబానా కళను నేర్చుకోవాలనే ఆసక్తి ఉండి, స్వయంగా క్లాసులకు హాజరు కాలేని వాళ్లకు పూసగుచ్చినట్లు వివరించాను.

ఫ్లవర్‌పాట్‌ కొలతలు, కొమ్మలు, పూల పరిమాణాలతో సహా కచ్చితంగా రేఖాచిత్రాలతో పుస్తకం రాశాను. జపాన్‌లో ఉపయోగించే పూలతో అలంకరణను చూపిస్తూనే మనకు లభించే పూలు, ఆకులతో అలంకరించడం కూడా ఫొటోలతో చూపించాను. ఫ్లవర్‌వాజ్‌లుగా ఉపయోగించే పాత్రలు, పిన్‌హోల్డర్‌లు, పూలు... ఎందులోనూ కృత్రిమత్వం ఉండదు. నురుగులాంటి వాటికి నిషేధం. శ్వాసకు హాని కలగరాదు, మట్టిలో కరిగే క్రమంలో నేలకు హాని కలిగించరాదు. ఇది నియమం.
 
చిత్ర వైవిధ్య లేఖనం
నేను పుట్టిపెరిగిన ఉత్తరాది జీవనశైలిని నా చిత్రాలు ప్రతిబింబిస్తుంటాయి. అక్కడి జీవనశైలిలో టెర్రస్‌కు ప్రాధాన్యం ఎక్కువ. ఉష్ణోగ్రతలు గరిష్టం, కనిష్టం రెండూ తీవ్రంగా ఉంటాయి. వేసవిలో సాయంత్రం నుంచి తెల్లవారే వరకు డాబా మీద గడుపుతారు. శీతాకాలంలో మధ్యాహ్నపు ఎండ కోసం డాబా మీద ఉంటారు. దైనందిన జీవితంలో సగభాగం డాబా మీద గడుస్తుంది. కాబట్టి డాబా అన్ని ఏర్పాట్లతో ఉంటుంది. నా చిత్రాలు ఉత్తరాది జీవితాన్ని కళ్లకు కడతాయి.

ఇకేబానా పరిణామక్రమం కూడా చిత్రాల్లో మిళితమై ఉంటుంది. ఈ కళ జపాన్‌ స్కూళ్ల నుంచి మన దేశానికి థియరిటికల్‌గా వచ్చి అరవై ఏళ్లు దాటినప్పటికీ సంపన్న, ఎగువ మధ్యతరగతి దగ్గరే ఆగి పోయింది. సామాన్యులకు చేరాలంటే నేను ఊరూరా స్కూళ్లను పెట్టలేను, కాబట్టి అక్షరం అనే మాధ్యమాన్ని ఎంచుకున్నాను. తెలుగు నేల నాకు చాలా ఇచ్చింది. తెలుగు నేలకు నేను తిరిగి ఇవ్వడం ద్వారా కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. ఈ పుష్పాలంకరణ కళను తెలుగు రాష్ట్రాల్లో కుగ్రామాలకు కూడా చేర్చాలనేది నా ఆకాంక్ష’’ అన్నారు షర్మిలా అగర్వాల్‌.

ఈ పెయింటింగ్‌ను పరిశీలించండి. ఇందులో అజంతా గుహలున్నాయి. బౌద్ధ భిక్షువులు, రికా (ఇకేబానాలో ఓ శైలి) పుష్పాలంకరణ ఒక భాగంలో కనిపిస్తాయి. మరొక భాగంలో అంతఃపుర స్త్రీలు పుష్పాలంకరణ చేస్తున్నారు, కిందవైపు సామాన్య మహిళలు ఫ్లవర్‌ అరేంజ్‌మెంట్‌లో సంతోషిస్తున్నారు. జపాన్‌ నుంచి ఈ కళ బౌద్ధ భిక్షువుల ద్వారా ఇండియాకి వచ్చినప్పుడు రాజకుటుంబాల మహిళలకు చేరింది. ఆ తర్వాత సామాన్యులకు పరిచయమైంది. ఇది ప్రాచీన చారిత్రక నేపథ్యం.  

– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement