మహిళా మిలటరీ పోలీస్‌ ఫస్ట్‌ బ్యాచ్‌ వచ్చేసింది!

Army inducts 1st batch of women in military police - Sakshi

ఇండియన్‌ ఆర్మీలోని పోలీస్‌ సేనాదళం.. ‘కోర్స్‌ ఆఫ్‌ మిలటరీ పోలీస్‌ (సీఎంపీ) తొలిసారి మహిళల్ని విధుల్లోకి తీసుకుంది! శిక్షణ పూర్తి చేసుకున్న ఫస్ట్‌ బ్యాచ్‌ మహిళలు 83 మంది కార్యక్షేత్రంలోకి అడుగుపెట్టారు. సీఎంపీలో ఇప్పటివరకు ఆఫీసర్స్‌ కేటగిరీలో మాత్రమే మహిళలు ఉంటూ వస్తున్నారు. సాధారణ సైనికులుగా మహిళలు ప్రవేశించడం మాత్రం ఇదే మొదటిసారి.

బెంగళూరులోని ద్రోణాచార్య పరేడ్‌ గ్రౌండ్‌లో శనివారంనాడు చాలా నిశ్శబ్దంగా ఒక ప్రతిష్టాత్మకమైన ‘పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌’ జరిగిపోయింది! కోవిడ్‌ నిబంధనలు లేకుంటే పరేడ్‌ను చూసేందుకు యువ సైనికుల తల్లిదండ్రులు కూడా వచ్చేవారు. పైగా ఆ పరేడ్‌ మన దేశానికే ప్రథమమైనది, ప్రత్యేకమైనది. ఇండియన్‌ ఆర్మీలోని పోలీస్‌ సైనిక విభాగం అయిన ‘కోర్స్‌ ఆఫ్‌ మిలటరీ పోలీస్‌’ (సీఎంపీ) లో చేరేందుకు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న ఫస్ట్‌ బ్యాచ్‌ మహిళలు వాళ్లంతా.


బెంగళూరు ద్రోణాచార్య పరేడ్‌ గ్రౌండ్‌లో మే 8న జరిగిన మహిళా మిలటరీ పోలీస్‌ ‘పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌’.

సీఎంపీ ఆవిర్భావం తర్వాత ఈ ఆర్మీ విభాగంలో మహిళలకు ప్రవేశం లభించడం ఇదే తొలిసారి! నేటి నుంచి ఈ మహిళా మిలటరీ పోలీసులు తమ విధులకు హాజరవుతారు. ఏం చేస్తారు ఈ మహిళా మిలటరీ పోలీసు లు? కండబలం, గుండె బలం ఉన్న పనులు చేస్తారు. మిలటరీ, పోలీస్‌ క్వార్టర్స్‌ని కనిపెట్టుకుని ఉంటారు. యుద్ధ ఖైదీల కదలికలపై ఒక కన్నేసి ఉంచుతారు. ఆర్మీ సైనికులు క్రమశిక్షణను, ఆదేశాలను అతిక్రమించకుండా చూస్తారు. త్రివిధ దళాలలోని మూడు పోలీసు విభాగాలకు, పౌర రక్షణ పోలీసు విభాగాలకు సమన్వయకర్తలుగా ఉంటారు. ఆర్మీ సిబ్బందికి సంబంధం ఉన్న కేసులలో విచారణలకు హాజరవుతారు. ఆర్మీల చీఫ్‌లు ఎవరైతే ఉంటారో వాళ్లకు భద్రతగా ఉంటారు. ఇంకా అనేకం ఉన్నాయి. చొరబాటు ‘దారులలో’ శత్రువు సృష్టించిన కృత్రిమ ట్రాఫిక్‌ జామ్‌లను క్లియర్‌ చేస్తారు.

టెలీ కమ్యూనికేషన్‌ తెగిపోయినప్పుడు రంగంలోకి దిగి సమాచారాన్ని పునరుద్ధరిస్తారు. ఇవన్నీ చేయడానికి సీఎంపీ విభాగం అరవై ఒక్క వారాల శిక్షణ ఇస్తుంది. తాజాగా ఈ శిక్షణ పూర్తి చేసిన ఎనభై మూడు మంది మహిళా అభ్యర్థులు ఆర్మీ పొదిలోకి అస్త్రాలుగా పదును తేలారు. బెంగళూరులోని ‘కోర్స్‌ ఆఫ్‌ మిలటరీ పోలీస్‌ సెంటర్‌ అండ్‌ స్కూల్‌’ శిక్షణను ఇచ్చింది. ఆర్మీ తొలిసారి మహిళల కోసం ‘సోల్జర్‌ జనరల్‌ డ్యూటీ’ కేటగిరీ ఉద్యోగాలకు గత ఏడాది విడుదల చేసిన నోటిఫికేషన్‌ చూసి ఉత్సాహంగా దరఖాస్తు చేసుకున్నవాళ్లలో శిక్షణకు అర్హులైన వాళ్లే.. ఈ ఎనభై మూడు మంది. భారత రక్షణదళంలో కేవలం ఆర్మీకి మాత్రమే ‘ఆఫీసర్‌’ ర్యాంకు కన్నా దిగువన ఉండే హోదాలలో మహిళల్ని నియమించుకునే అధికారం ఉంది. నావిక, వైమానిక దళాలకు ఆ అవకాశం లేదు. అయినప్పటికీ ఆర్మీలోని సీఎంపీకి మహిళా సోల్జర్‌లను తీసుకోడానికి 82 ఏళ్లు పట్టింది. సీఎంపీ ఆవిర్భవించింది 1939లో.

మహిళా ఆఫీసర్‌లను తీసుకుంటున్న ఆర్మీకి కానీ, ఆర్మీలోని సీఎంపీ విభాగానికి కానీ ఇంతకాలం సాధారణ మహిళా సైనికులను తీసుకోడానికి ఉన్న అభ్యంతరం ఏమిటి?! జటిల సమస్య లు, కఠిన పరిస్థితులు ఉండే విధుల్లో మహిళల్ని తీసుకోవడం సరికాదు అన్న ఆలోచనా ధోరణే. అయితే అలవాటు లేని రంగాలలో సైతం మహిళ లు రాణిస్తుండటంతో ఆ ధోరణి మారింది. అదొక్కటే కాదు దేశ భద్రత విభాగాలలో ఆర్మీకి మహిళా సైనికుల చేయూత అవసరం అవుతోంది. అందుకే సీఎంపీలోకి మహిళల్ని తీసుకునేందుకు ఆర్మీ 2019 జనవరిలో ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి పొందింది. ఏడాదికి వంద మంది చొప్పున 2036 నాటికి 1700 మంది మహిళల్ని సీఎంపిలోకి తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. సీఎంపీలో ప్రస్తుతం సుమారు 9000 మంది సిబ్బంది ఉండగా, మొత్తం ఆర్మీలో రిజర్వు సిబ్బంది కాకుండా 12 లక్షల మందికి పైగా ఉన్నారు. వారిలో మహిళా అధికారులు 1672 మంది, సాధారణ స్థాయి మహిళలు సుమారు ఏడు వేల మంది.                     

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top