తిరుమల శ్రీవారి ఆలయంలో అడుగడుగునా చరిత్ర దాగి ఉంది. శిలాశాసనాలు, పురాతన మండపాలు, ఆభరణాలు మాత్రమే కాదు, స్వామివారి వైభవాన్ని కీర్తిస్తూ శతాబ్దాల క్రితం రచించిన వేలాది సంకీర్తనలు తిరుమల చరిత్రకు అద్దం పడుతున్నాయి. ఆ అపురూప సంపదకు ప్రధాన వారసత్వంగా నిలిచినవారు తాళ్లపాక అన్నమాచార్యులు. శ్రీవేంకటేశ్వరస్వామిపై భక్తితో ఆయన రచించిన కీర్తనలు నేటికీ తిరుమల కొండల్లో మార్మోగుతూనే ఉన్నాయి.
తాళ్లపాక అన్నమాచార్యులు శ్రీవేంకటేశ్వరస్వామిని స్తుతిస్తూ దాదాపు 32 వేల కీర్తనలు రచించారు. తెలుగు వాగ్గేయకారుల సంప్రదాయానికి ఆయన చేసిన సేవ విశేషమైనది. భక్తి, శరణాగతితో పాటు నాటి సామాజిక పరిస్థితులను కూడా ఆయన తన సంకీర్తనల్లో ప్రతిబింబించారు.
అన్నమయ్య రచనలు తొలుత తాళపత్రాలపై లిఖితమై ఉండేవి. అనంతరం ఆయన కుమారుడు తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు వాటిని రాగిరేకులపైకి లిఖింపజేశారు. క్రీ.శ. 1525–1530 మధ్య కాలంలో సంకీర్తన భాండారం నిర్మాణం పూర్తయి, తాళ్లపాక వంశానికి చెందిన రచనలను రాగిరేకులపై భద్రపరచారు. విజయనగర రాజు అచ్యుతరాయలు ఈ సంకీర్తన భాండారం నిర్మాణానికి సహకరించారు.
తిరుమల ఆలయ చరిత్రపై పరిశోధన చేసిన సాదు సుబ్రహ్మణ్య శాస్త్రి ఈ రాగిరేకులను గుర్తించడంతో అన్నమయ్య సాహిత్య సంపద మళ్లీ వెలుగులోకి వచ్చింది. అయితే కాలగమనంలో అన్నమయ్య రచనల్లో కొంత భాగం శాశ్వతంగా కనుమరుగయ్యాయి. అన్నమయ్య రచించిన 32 వేల రచనల్లో 14,932 కీర్తనలను టీటీడీ అందుబాటులోకి తీసుకువచ్చింది.
అన్నమయ్య కీర్తనలకు సంగీత రూపం ఇచ్చి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీటీడీ 1978లో ప్రత్యేకంగా అన్నమాచార్య ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు సంగీతం, పరిశోధన–ప్రచురణలు, రికార్డింగ్ వంటి విభాగాల ద్వారా అన్నమయ్య సాహిత్యాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తోంది.


