breaking news
lord vekateswara
-
చరిత్రకు నిలయం... తిరుమల మ్యూజియం!
తిరుమలలో శ్రీవారి దర్శనం ఒక ఆధ్యాత్మిక అనుభూతి అయితే, ఆ దర్శనం వెనుక దాగిన శతాబ్దాల చరిత్రను కళ్లముందు ఆవిష్కరించే మరో ప్రపంచం ఇప్పుడు భక్తులకు అందుబాటులోకి వచ్చింది. ఆధునికీకరించిన శ్రీ వేంకటేశ్వర మ్యూజియం సెప్టెంబర్ 16న ప్రారంభమైంది.తిరుమల చరిత్ర, ఆలయ నిర్మాణ వైభవం, శాసనాలు, రాజవంశాల అనుబంధం, అన్నమయ్య భక్తి సాహిత్యం, పురాతన కళాఖండాలను ఆధునిక సాంకేతికతతో భక్తులకు పరిచయం చేయాలన్న ఆలోచన కొన్నేళ్ల క్రితమే మ్యూజియం ప్రాజెక్టు మొదలైంది. 2019లోనే టీటీడీ మ్యూజియానికి కొత్త రూపు ఇచ్చే మాస్టర్‌ప్లాన్ , 3డీ వర్చువల్ టెక్నాలజీపై ప్రణాళికలు ప్రకటించింది. 2022లో టాటా గ్రూప్, మ్యాప్ సిస్టమ్స్ సంస్థల నిపుణులతో ఆధునికీకరణ పనులు చేపడుతున్నట్లు వెల్లడించింది.ఇప్పుడు ప్రారంభమైన మ్యూజియం 14 ఇంటరాక్టివ్ గ్యాలరీలతో, సుమారు 1.20–1.25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త రూపాన్ని సంతరించుకుంది. మ్యూజియం ఆధునికీకరణలో అత్యంత ముఖ్యమైన అంశాల్లో కళాఖండాల శాస్త్రీయ విభజన, ఆడిటింగ్, డిజిటలైజేషన్ కూడా ఉన్నాయి. మ్యూజియంలో ఉన్న 8,779 కళాఖండాల్లో 7,579 వస్తువుల డిజిటలైజేషన్ 2022 నాటికే పూర్తయింది. ఇక విజయనగర సామ్రాజ్యంతో తిరుమలకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసే వస్తువులు కూడా భక్తుల్లో ఆసక్తిని కలిగిస్తాయి.తాళ్లపాక అన్నమాచార్యులు శ్రీ వేంకటేశ్వరస్వామిపై వేలాది సంకీర్తనలు రచించారు. ఆ భక్తి సాహిత్యం తరతరాలకు అందేలా రాగిరేకులపై భద్రపరిచిన సంప్రదాయం తిరుమల సాహిత్య వారసత్వంలో అపూర్వమైనది.మ్యూజియంలో మరో ఆసక్తికరమైన సంపద పురాతన నాణేలు. టీటీడీ నిర్వహించిన గత ప్రదర్శనల్లో రోమన్ కాలం, బ్రిటిష్ కాలానికి చెందిన నాణేలను కూడా ప్రదర్శించింది. తిరుమల చరిత్రను అర్థం చేసుకోవడానికి శాసనాలు కూడా అమూల్యమైన ఆధారాలు. పల్లవులు, చోళులు, విజయనగర రాజులు వంటి వివిధ రాజవంశాలకు శ్రీవారితో ఉన్న అనుబంధాన్ని మ్యూజియం గ్యాలరీల్లో పరిచయం చేస్తున్నారు.ఇక సంగీత వాయిద్యాల కథ మరింత ప్రత్యేకం. శ్రీవారి ఆలయ సంగీత సంప్రదాయంలో శతాబ్దాలుగా ఉపయోగించిన వాయిద్యాలకు కూడా చారిత్రక ప్రాధాన్యం ఉంది. ఈ మ్యూజియంలో సుమారు 400 ఏళ్ల నాటి భారీ ‘బ్రహ్మనగర’ వాయిద్యంతో పాటు సుమారు 12 అడుగుల ఎత్తైన ‘బాంకే’ అనే పురాతన బుగుల్ వంటి వాయిద్యాలు ఉన్నాయి. ఒకప్పుడు ఆలయ సేవల్లో మోగిన ఆ వాయిద్యాలు ఇప్పుడు నిశ్శబ్దంగా నిలబడి గతవైభవాన్ని గుర్తుచేస్తున్నాయి.ఈ రూపానికి రావడానికి కూడా మ్యూజియం ఒక సుదీర్ఘ ప్రయాణం చేసింది. టీటీడీ 2019లో మ్యూజియానికి కొత్త రూపు, 3డీ ఆగ్మెంటెడ్ టెక్నాలజీ, తిరుమల ఆలయ ముఖ్య ప్రాంతాలను వర్చువల్‌గా చూపించే ప్రణాళికలను ప్రకటించింది. టీసీఎస్ సహకారంతో ఈ ఏడాది 14 ఇంటరాక్టివ్ గ్యాలరీలను అభివృద్ధి చేసి తుది దశకు తీసుకొచ్చారు. ప్రస్తుత మ్యూజియంలో హోలోగ్రాఫిక్ డిస్ప్లేలు, ఇంటరాక్టివ్ టెక్నాలజీ, శబ్ద–దృశ్య అనుభూతులు వంటి ఆధునిక పద్ధతులను ఉపయోగిస్తున్నారు.అందుకే తిరుమలకు వచ్చే భక్తుడికి ఇది మరో రకమైన దర్శనం. గర్భగుడిలో స్వామివారి దర్శనం ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తే, మ్యూజియంలో తిరుమల గతం దర్శనమిస్తుంది. రాజుల సేవలు, ఆచార్యుల సంప్రదాయాలు, అన్నమయ్య సంకీర్తనలు, శిల్పుల కళ, శాసనాల చరిత్ర, ఆలయ సంగీతం ఇవన్నీ ఒకే ప్రాంగణంలో కొత్త తరానికి పరిచయం అవుతున్నాయి. గతంలో మొదలైన ఆలోచనలు, మధ్యలో సాగిన ఆధునికీకరణ, తర్వాత పూర్తయిన పనులు.. ఇవన్నీ కలిసే నేటి శ్రీ వేంకటేశ్వర మ్యూజియం రూపుదిద్దుకుంది.ఇదీ చదవండి: తిరుమల బంగారు గోపురం.. మొదట ఎవరు చేయించారంటే! -
శ్రీవారి హుండీ... భక్తుల విశ్వాసానికి ప్రతీక
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికీ పరిచయం ఉన్నది శ్రీవారి హుండీ. శ్రీవారి దర్శనం పూర్తయ్యాక భక్తులు తమ కానుకలను సమర్పించే చోటు. చిన్నారి చేతిలోని నాణెం నుంచి సంపన్న భక్తులు సమర్పించే కానుకల వరకు కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచే హుండీ తిరుమల ఆలయంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.‘హుండీ’ కాదు... ‘కానుకల సమర్పణ’తిరుమలను సందర్శించే భక్తులు స్వామివారికి కానుకలు సమర్పించే సంప్రదాయం చాలా పురాతనమైనది. పూర్వకాలంలో నేటి తరహాలో ఒక ప్రత్యేక పెట్టెలోనే కానుకలు వేయడం కాకుండా, భక్తులు తమకు సాధ్యమైన విధంగా బంగారం, వెండి, నాణేలు, ఆభరణాలు, వస్త్రాలు, ఇతర విలువైన వస్తువులను స్వామివారికి సమర్పించేవారు. కాలక్రమంలో ఈ కానుకలను ఒకేచోట స్వీకరించే వ్యవస్థ ఏర్పడింది. ఇదే నేటి హుండీ వ్యవస్థకు నాంది పలికిందని భావిస్తారు.‘నా దగ్గర ఉన్నది... నీదే’– తిరుమలలో భక్తులు హుండీలో కానుక వేయడానికి ప్రధానంగా చెప్పుకునే ఆధ్యాత్మిక భావన ఇదే! ‘స్వామివారూ.. నాకు ఇచ్చింది మీరే. అందులో కొంత మీకే సమర్పిస్తున్నాను.’’ డబ్బు ఎంత అన్నది కాదు, భక్తి ఎంత అన్నదే ముఖ్యమనే భావన. అందుకే హుండీ ముందు ధనిక పేద తారతమ్యాలు ఉండవు.తిరుమల హుండీకి మరో ప్రత్యేకతతిరుమల శ్రీవారి హుండీకి మరో ప్రత్యేకత ఉంది. భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత కూడా కానుకలు సమర్పిస్తారు. కొంతమంది మొక్కు తీర్చుకుంటారు. మరికొందరు తమ ఆదాయంలో కొంత భాగాన్ని స్వామివారికి సమర్పిస్తారు. ఇంకొందరు పేరు, చిరునామా చెప్పకుండా తమకు సాధ్యమైన మొత్తాన్ని హుండీలో వేస్తారు. అందుకే తిరుమల హుండీని కేవలం ఆదాయం వచ్చే మార్గంగా చూడటం కంటే భక్తి, మొక్కు, సమర్పణకు ప్రతీకగా చూడటం తిరుమల సంప్రదాయంలో ప్రత్యేకమైనది.హుండీకి ‘కానుకల పెట్టె’ అనే భావనపురాతన వైష్ణవ సంప్రదాయాల్లో భగవంతుడికి కానుకలు సమర్పించడం ఒక ముఖ్యమైన ఆచారం. తిరుమలలో కూడా శ్రీవారికి సమర్పించే కానుకలను ఆలయ సేవలు, నిత్యకైంకర్యాలు, ఉత్సవాలు, భక్తుల సౌకర్యాల కోసం వినియోగించే వ్యవస్థ కాలక్రమంలో అభివృద్ధి చెందింది. నేటి టీటీడీ పరిపాలనా వ్యవస్థలో హుండీ ద్వారా వచ్చే ఆదాయాన్ని అధికారికంగా లెక్కించి ఆలయ నిర్వహణ, ధార్మిక కార్యక్రమాలు, భక్తుల సౌకర్యాలు తదితర కార్యక్రమాలకు వినియోగిస్తారు.ఎందుకు ఇంత విశ్వాసం?తిరుమలలో ఒక ప్రసిద్ధ విశ్వాసం ఉంది. శ్రీవారిని దర్శించి ఆయనకు ఏదైనా సమర్పిస్తే, అది స్వామివారికి అర్పించినదే. ఈ భావన తరతరాలుగా భక్తులలో బలపడింది. అందుకే తిరుమల కొండకు వచ్చే భక్తుల్లో చాలామంది దర్శనం... తీర్థప్రసాదం... ఆ తర్వాత హుండీ... ఈ మూడింటినీ తమ యాత్రలో భాగంగా భావిస్తారు. çహుండీలో కానుక వేయడం భక్తుడి యాత్రలో చివరి ఘట్టంలా కనిపించినా, ఆధ్యాత్మికంగా అది మరో విశ్వాసానికి ఆరంభం.‘స్వామివారిపై భారం వేసి వెళ్తున్నాను’ అనే నమ్మకం. అందుకే తిరుమల హుండీ వద్దకు వచ్చే ప్రతి భక్తుడి ముఖంలో ఒకే భావన కనిపిస్తుంది. ఎవరి చేతిలో ఎంత ఉందన్నది కాదు, ఎంత భక్తితో సమర్పించారన్నదే ముఖ్యం. తిరుమల కొండపై శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సమర్పణ సంప్రదాయానికి హుండీ ఒక కనిపించే ప్రతీక. రోజూ కోట్ల రూపాయల కానుకలు చేరే ప్రదేశంగా మాత్రమే కాదు, కోట్లాది భక్తుల విశ్వాసాలను తనలో దాచుకున్న పవిత్ర స్థలంగా హుండీ తిరుమల చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.ఇదీ చదవండి: పుష్కరిణి పురాణం -
ఘంటానాదం... నైవేద్యానికి సంకేతం
తిరుమలలో రాత్రి నిశ్శబ్దం అలముకున్న వేళ ఆలయ పరిసరాల్లో వినిపించే ఘంటానాదానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతి కలిగిస్తుంది. ఆ శబ్దం వెనుక ఏదో దివ్య రహస్యం ఉందని భక్తులు భావిస్తారు. కాని, ఈ ఘంటానాదం శ్రీవారికి సమర్పించే నైవేద్యంతో ముడిపడిన ఆలయ సంప్రదాయం.శ్రీవారి ఆలయంలోని ఆనందనిలయంలో బంగారు వాకిలికి దక్షిణంవైపు రెండు పెద్ద గంటలు ఉన్నాయి. ఇవి చెక్క దూలానికి ఇనుప గొలుసులతో వేలాడదీసి ఉంటాయి. నైవేద్యం సమర్పించే సమయంలో ఈ గంటలను మోగించే వ్యక్తిని ‘ఘంటాపాణి’ అంటారు. గంట మోగడం అంటే శ్రీవారికి నైవేద్యం సమర్పించే సమయం వచ్చిందనే సంకేతం. ఈ గంటల కారణంగానే ఆ ప్రాంతానికి ‘ఘంటామండపం’ లేదా ‘తిరుమామణి మండపం’ అనే పేరు వచ్చింది.ఈ ఘంటామండపానికి ఘనచరిత్ర ఉంది. విజయనగర సామ్రాజ్యానికి చెందిన మంత్రి మల్లన్న 1417లో మహామణి మండపాన్ని నిర్మించారు. బంగారు వాకిలి, గరుడాళ్వార్ సన్నిధి మధ్య ఉన్న ఈ మండపం పదహారు స్తంభాలతో నిర్మితమైంది. శ్రీవారి ఆలయంలో సుప్రభాతం, కొలువు, పంచాంగ శ్రవణం, వివిధ ఆస్థానాలు, ప్రత్యేక సేవలు వంటి అనేక కార్యక్రమాలకు ఇది వేదికగా నిలుస్తోంది.ఈ గంటలకు సంబంధించి చంద్రగిరి రాజులతో ముడిపడిన చారిత్రక నేపథ్యం కూడా ఉంది. విజయనగర చక్రవర్తులు చంద్రగిరిలో బస చేసినప్పుడు తిరుమల ఆలయంలో మోగే ఘంటానాదం వారికి చేరేలా మధ్యలో ఘంటామంటపాలను ఏర్పాటు చేసేవారట! శ్రీవారికి నైవేద్య సమర్పణ జరిగిందనే సంకేతం అందిన తర్వాతే వారు భోజనం చేసేవారట!తిరుమలలో మోగిన గంటకు ఒకప్పుడు రాజభవనంలోనూ ప్రాధాన్యం ఉండేదన్నమాట. స్వామివారికి ముందుగా నైవేద్యం, ఆ తర్వాతే రాజుకు భోజనం అనే భావనలో భక్తి, రాజధర్మం, ఆలయ సంప్రదాయం కలిసిపోయినట్లు చరిత్ర చెబుతోంది. అయితే ‘ఈ గంట శబ్దం నేరుగా కొండ దిగి చంద్రగిరి రాజభవనానికి వినిపించేది’ అని అనుకోవడం కంటే, ఘంటానాదాన్ని మధ్యవర్తి ఘంటామంటపాల ద్వారా సంకేతంగా చేరవేసే వ్యవస్థ పనిచేసేదని గుర్తించాలి.తిరుమల ఆలయ నైవేద్య వ్యవస్థలో గంటల ప్రాధాన్యం ఇప్పటికీ కొనసాగుతోంది. రోజూ ఉదయం శ్రీవారికి సమర్పించే మొదటి నైవేద్యాన్ని ‘మొదటి గంట’గా, మధ్యాహ్నం సమర్పించే నైవేద్యాన్ని ‘రెండో గంట’గా వ్యవహరిస్తారు. లడ్డూలు, వడలు, పులిహోర, పొంగలి, దద్ధ్యోదనం తదితర ప్రసాదాలను మూలవిరాట్టుకు సమర్పిస్తారు.ఘంటానాదం కేవలం నైవేద్యానికి సంకేతం మాత్రమే కాదు, తిరుమల ఆలయ దైనందిన ఆధ్యాత్మిక క్రమంలోనూ ఒక భాగం. ఉదయం జరిగే సేవలతో పాటు ప్రత్యేక నైవేద్యాల సమయంలోనే కాకుండా, రాత్రి ఆలయ కైంకర్యాల అనంతరం ‘రాత్రి గంట’ కూడా మోగిస్తారు. ఈ గంటలకు మరో ప్రత్యేకత ఉంది. సాధారణంగా ఆలయాల్లో ఒక గంట ఉండటం ఆనవాయితీ కాగా, తిరుమలలో రెండు పెద్ద గంటలు ఉండటం విశేషం. వీటిని ‘నారాయణ గంట’, ‘గోవింద గంట’గా పెద్దలు పిలిచేవారు. కాలక్రమంలో వాటి స్థానాల్లో మార్పులు వచ్చినా, ఘంటానాద సంప్రదాయం మాత్రం కొనసాగుతోంది. -
సప్తగిరుల ప్రాశస్త్యం
తిరుమలలో కొలువైన శ్రీనివాసుడిని ఒడిలో పెట్టుకుని నిలిచిన కొండలకు కూడా ప్రత్యేకమైన పేర్లు, పురాణగాథలు, ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్నాయి. అందుకే తిరుమల కేవలం ఒక కొండపై ఉన్న ఆలయం కాదు, ఏడు కొండల సమాహారంగా భక్తుల హృదయాల్లో నిలిచిన పవిత్ర క్షేత్రం. తిరుమలలోని ఏడు కొండలను శేషాద్రి, గరుడాద్రి, వేంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి, అంజనాద్రిగా పిలుస్తారు. ఈ కారణంగానే శ్రీవారిని ‘ఏడుకొండలవాడు’గా భక్తులు పిలుస్తారు.శేషాద్రి: ఆదిశేషుడు శ్రీమహావిష్ణువుకు శేషశయ్యగా సేవ చేస్తాడన్న వైష్ణవ సంప్రదాయంలో భాగంగానే ఈ కొండకు శేషాద్రి అనే పేరు వచ్చింది. తిరుమల కొండల సమూహానికే శేషాచలం అనే పేరు కూడా ప్రసిద్ధి. శ్రీవారి నివాసాన్ని శేషుడి దివ్యరూపంతో అనుసంధానించే ఈ భావన వల్ల శేషాద్రికి భక్తి సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఏర్పడింది. గరుడాద్రి: మహావిష్ణువుకు వాహనమైన గరుడుడు శ్రీవారితో అనుబంధం గల దివ్యవిహంగంగా వైష్ణవ సంప్రదాయంలో పూజలు అందుకుంటాడు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడసేవకు ఉన్న విశిష్టత కూడా ఈ అనుబంధాన్ని గుర్తుచేస్తుంది. గరుడుని పేరుతో ఉన్న గరుడాద్రి భక్తుల దృష్టిలో శ్రీవారి సేవాభావానికి ప్రతీకగా నిలుస్తుంది. శ్రీవారి ఆదేశంతో గరుడుడే ఈ కొండను ఇక్కడకు తీసుకు వచ్చినట్లు పురాణాల కథనం.వేంకటాద్రి: దీని శిఖరంపైనే శ్రీ వేంకటేశ్వరస్వామివారి ప్రధాన ఆలయం ఉంది. శ్రీ వేంకటేశ్వర ఆలయం పవిత్ర శేషాచల పర్వతశ్రేణుల్లోని వేంకటాద్రిపై స్వామి పుష్కరిణి దక్షిణ ఒడ్డున ఉంది. స్వామివారు ఈ కొండపై కొలువై ఉన్నందునే ‘వేంకటేశ్వరుడు’గా ప్రసిద్ధి చెందాడు.నారాయణాద్రి: నారాయణుడు భక్తులకు ఆశ్రయదాత, పరమాత్మ అనే వైష్ణవ భావనలో ఈ కొండ పేరు ఒక ఆధ్యాత్మిక గుర్తింపుగా నిలుస్తుంది. పుష్కరిణి తీరంలో నారాయణుడు అనే భక్తుడు శ్రీవారి కోసం తపస్సు చేశాడట! ఆయనను స్వామి అనుగ్రహించడం వల్ల ఈ కొండకు నారాయణాద్రి అనే పేరు వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి.వృషభాద్రి: వృషభాసురుడు అనే రాక్షసుడు తిరుమల ప్రాంతంలో తపస్సు చేశాడని, అనంతరం శివుడితో యుద్ధం చేసి ఓడిపోయాడని కథనం ఉంది. చివరికి అతడిని శ్రీవారు అనుగ్రహించడంతో అతడు తపస్సు చేసిన ప్రదేశానికి వృషభాద్రి అనే పేరు వచ్చినట్లు పురాణాల కథనం.నీలాద్రి: తిరుమల కొండలలో ఒకటైన నీలాద్రి కి ఒక విశిష్టత ఉంది. నీలాద్రి అనే కొండ పేరు నీలాదేవి (ద్వాపరయుగంలో శ్రీ కృష్ణుని అష్టమహిషులలో ఒకరైన నీలాంబరి) పేరు మీదుగా వచ్చింది.కలియుగ దైవమైన వేంకటేశ్వర స్వామికి తలనీలాలు సమర్పించే సంప్రదాయం ఈ కొండ ఆధారంగానే మొదలైంది. ఒకసారి శ్రీనివాసుడి తలపై దెబ్బ తగిలి కొంత భాగం జుట్టు ఊడిపోతుంది. అది గమనించిన నీలాదేవి, అంతటి అందమైన రూపానికి లోపం రాకూడదని భావించి, తన తలవెండ్రుకలను కోసి స్వామివారికి అమరుస్తుంది. ఆమె భక్తికి మెచ్చిన స్వామివారు, తన భక్తులు ఎవరైనా ఇక్కడికి వచ్చి తలనీలాలు సమర్పిస్తే ఆ పుణ్యం నీలాదేవికే చెందుతుందని వరమిచ్చారు. అంజనాద్రి: అంజనాదేవి ఇక్కడ తపస్సు చేసిందని, హనుమంతుడు ఇక్కడే జన్మించాడని ప్రతీతి. అందువల్లనే ఈ కొండకు అంజనాద్రి అనే పేరు వచ్చిందని చెబుతారు. బాల హనుమంతుడు ఇక్కడి నుంచే సూర్యుడిని పండుగా భ్రమించి తినేయడానికి వెళ్లిన ఘట్టం కూడా పురాణాల్లో ఉంది.తిరుమలలోని ఏడు కొండలలో ఒక్కక్కదానికి ఒక్కో పురాణగాథ ఉంది. తిరుమలకు చేరుకునే భక్తులు ‘ఏడుకొండలవాడా వేంకటరమణా’ అని నోరారా పిలిచినప్పుడు అది కేవలం నామస్మరణ మాత్రమే కాదు, తరతరాలుగా కొనసాగుతున్న క్షేత్ర సంప్రదాయం. -
అన్నమయ్య... తిరుమల చరిత్ర
తిరుమల శ్రీవారి ఆలయంలో అడుగడుగునా చరిత్ర దాగి ఉంది. శిలాశాసనాలు, పురాతన మండపాలు, ఆభరణాలు మాత్రమే కాదు, స్వామివారి వైభవాన్ని కీర్తిస్తూ శతాబ్దాల క్రితం రచించిన వేలాది సంకీర్తనలు తిరుమల చరిత్రకు అద్దం పడుతున్నాయి. ఆ అపురూప సంపదకు ప్రధాన వారసత్వంగా నిలిచినవారు తాళ్లపాక అన్నమాచార్యులు. శ్రీవేంకటేశ్వరస్వామిపై భక్తితో ఆయన రచించిన కీర్తనలు నేటికీ తిరుమల కొండల్లో మార్మోగుతూనే ఉన్నాయి.తాళ్లపాక అన్నమాచార్యులు శ్రీవేంకటేశ్వరస్వామిని స్తుతిస్తూ దాదాపు 32 వేల కీర్తనలు రచించారు. తెలుగు వాగ్గేయకారుల సంప్రదాయానికి ఆయన చేసిన సేవ విశేషమైనది. భక్తి, శరణాగతితో పాటు నాటి సామాజిక పరిస్థితులను కూడా ఆయన తన సంకీర్తనల్లో ప్రతిబింబించారు.అన్నమయ్య రచనలు తొలుత తాళపత్రాలపై లిఖితమై ఉండేవి. అనంతరం ఆయన కుమారుడు తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు వాటిని రాగిరేకులపైకి లిఖింపజేశారు. క్రీ.శ. 1525–1530 మధ్య కాలంలో సంకీర్తన భాండారం నిర్మాణం పూర్తయి, తాళ్లపాక వంశానికి చెందిన రచనలను రాగిరేకులపై భద్రపరచారు. విజయనగర రాజు అచ్యుతరాయలు ఈ సంకీర్తన భాండారం నిర్మాణానికి సహకరించారు. తిరుమల ఆలయ చరిత్రపై పరిశోధన చేసిన సాదు సుబ్రహ్మణ్య శాస్త్రి ఈ రాగిరేకులను గుర్తించడంతో అన్నమయ్య సాహిత్య సంపద మళ్లీ వెలుగులోకి వచ్చింది. అయితే కాలగమనంలో అన్నమయ్య రచనల్లో కొంత భాగం శాశ్వతంగా కనుమరుగయ్యాయి. అన్నమయ్య రచించిన 32 వేల రచనల్లో 14,932 కీర్తనలను టీటీడీ అందుబాటులోకి తీసుకువచ్చింది. అన్నమయ్య కీర్తనలకు సంగీత రూపం ఇచ్చి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీటీడీ 1978లో ప్రత్యేకంగా అన్నమాచార్య ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు సంగీతం, పరిశోధన–ప్రచురణలు, రికార్డింగ్ వంటి విభాగాల ద్వారా అన్నమయ్య సాహిత్యాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తోంది. -
తిరుమల శ్రీవారి సేవలో బిగ్బాగ్ దివి.. (ఫోటోలు)
-
షూస్ వేసుకొని వెంకన్న విగ్రహం తీసుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని
-
గుడివాడ వెంకటేశ్వరస్వామి ఆలయంలో కిరీటం మాయం
సాక్షి,కృష్ణా:గుడివాడ వెంకటేశ్వరస్వామి ఆలయంలో కిరీటం మాయమైంది. గత ఏడాది మాటూరు సుబ్బారావు అనే భక్తుడు స్వామివారికి కిరీటం కానుకగా సమర్పించారు. ఏడాది తర్వాత దాత సుబ్బారావు తిరిగి దర్శనానికి వచ్చారు. అయితే, దర్శన సమయంలో కిరీటం కనిపించకపోవడంతో ఆయన పాలకవర్గాన్ని నిలదీశారు.మొదట పాలకవర్గం కిరీటం బ్యాంక్ లాకర్లో ఉందని చెప్పింది. కానీ గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. కిరీటాన్ని తాకట్టు పెట్టినట్లు వారు అంగీకరించారు.దాంతో సుబ్బారావు కిరీటం ఉందా? లేక అమ్మేశారా? అంటూ సందేహం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. అయితే, ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చిన ఆయనకు పోలీసులు షాక్ ఇచ్చారు. కిరీటంపై కోర్టుకే వెళ్లమని సూచించారని సుబ్బారావు వాపోయారు. -
తిరుమల క్యూలైన్లో ప్రాంక్ వీడియో.. టీటీడీ సీరియస్
సాక్షి, తిరుపతి: తిరుమలలో కొందరు ఆకతాయిలు రెచ్చిపోయారు. భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా ప్రాంక్ వీడియోలు తీయడం తీవ్ర కలకలం సృష్టించింది. ఇక, వీడియో అంశాన్ని భక్తులు టీటీడీ దృష్టికి తీసుకెళ్లడంతో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది.కాగా, వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. తమిళనాడుకు చెందిన ముగ్గురు యువకులు శ్రీవారి దర్శనానికి వచ్చారు. తిరుమల లోపల ప్రాంక్ వీడియో కోసం.. నారాయణగిరి షెడ్స్‌లోని క్యూలో వెళ్తూ మరో కంపార్టుమెంట్ తాళాలు తీసే ఉద్యోగిలా కలరింగ్ ఇచ్చారు. ఈ సందర్బంగా కంపార్ట్మెంట్లో నిరీక్షిస్తున్న భక్తులు ఆ తాళాలు తీసే వ్యక్తిని టీటీడీ ఉద్యోగిగా భావించి ఒక్కసారిగా పైకి లేచారు. దీంతో, వెంటనే సదరు యూట్యూబర్ కంపార్టుమెంట్ నుంచి వెకిలిగా నవ్వుతూ పరుగులు తీశాడు. ఇదంతా మరో యువకుడు వీడియో తీశాడు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలువురు నెటిజన్లు టీటీడీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వీడియోలపై టీటీడీ తీవ్రంగా ఖండించింది. భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా ప్రాంక్ వీడియోలు తీయడం హేయ మైన చర్య .. అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. • తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రాంక్ వీడియోలు ! #TTFVasan @APPOLICE100 @TTDevasthanams pic.twitter.com/vxJxCwmqMm— YS Jagan Fans Campaign™ (@YSJFansCampaign) July 11, 2024 ఇదిలా ఉండగా.. తిరుమల ఆలయంలో క్యూ లైన్లలోకి వెళ్లాలంటే సిబ్బంది ఎన్నో రకాలుగా చెకింగ్స్ చేసి పంపిస్తారు. భక్తుల వద్ద మొబైల్ ఫోన్లు ఉంటే వాటిని స్వాధీనం చేసుకుంటారు. కాగా, ఈ వీడియో చేసిన యువకులు ఆలయంలోకి ఫోన్ ఎలా తీసుకెళ్లారు? అనేది తెలియాల్సి ఉంది. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలు: తిరుమలలో పెరిగిన రద్దీ..
సాక్షి, తిరుమల: తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. కాగా, హనుమంత వాహనంపై శ్రీవారు దర్శనం ఇచ్చారు. ఈ క్రమంలో శ్రీవారి భక్తులు కర్పూర నీరాజనాలు అందిస్తున్నారు. మరోవైపు.. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు. ఇక, సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న గరుడోత్సవం రోజు శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 72,650గా ఉంది. గరుడోత్సవం నాడు శ్రీవారి హుండీ ఆదాయం 3.33 కోట్లు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 27,410గా ఉంది. సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి గరుడ సేవను చూడటానికి తిరుమల నాలుగుమాడ వీధుల్లో వేచి ఉన్న భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలను పరిశీలించడం జరిగింది. భక్తుల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలను అడిగి తెలుసుకోగా.. టీటీడీ చేసిన ఏర్పాట్లపై వారు సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. pic.twitter.com/FI3MFrUFrD — Bhumana Karunakara Reddy (@bhumanatirupati) September 22, 2023 ఇదిలా ఉండగా.. తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు శుక్రవారం రాత్రి గరుడ వాహనాన్ని అధిరోహించారు. రాత్రి 7 గంటలకు ఆరంభమైన ఈ వాహన సేవ అర్ధరాత్రి వరకు సాగింది. గరుడ వాహనం ముందు భక్త బృందాలు, భజనలు, డప్పు వాయిద్యాలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వాయు గమనంతో పోటీపడే గరుత్మంతుడిని వాహనంగా చేసుకుని విశ్వాన్ని పాలించే జగత్కల్యాణ చక్రవర్తి మలయప్ప దేదీప్యమాన కాంతులతో ఆలయ మాడ వీధుల్లో ఊరేగారు. On the evening of the fifth day of the ongoing Brahmotsavams in Tirumala, the processional deity of Lord Malayappa Swamy was carried in a procession on the Garuda Vahanam.#TTD#TTDevasthanams#Brahmotsavam2023#SalakatlaBrahmotsavam2023#GarudaVahanam pic.twitter.com/riS8YuR4kh — Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) September 22, 2023 విశిష్టమైన గరుడ వాహన సేవలో గర్భాలయ మూలమూర్తికి వాడుతున్న మకరకంఠి, లక్ష్మిహారం, సహస్ర నామ కాసులమాల, సుదర్శన చక్రమాల, మూలవిరాట్‌కు అలంకరించే పురాతనమైన విశేష ఆభరణాలు, శ్రీవిల్లి పుత్తూరు ఆండాళ్ తులసి, పుష్పమాల, చెన్నై నూతన ఛత్రాలను(గొడుగులు) అలంకరించారు. తన నిత్య సేవకుడు గరుత్మంతుడిపై దేవదేవుడు వైభవంగా ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు శుక్రవారం ఉదయం స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు సాక్షాత్కరించారు. శ్రీవారు మోహినీ రూపంలో దంత పల్లకిపై, పక్కనే వెన్న ముద్ద చేతబట్టిన చిన్నికృష్ణుడితో కలిసి భక్తకోటిని అనుగ్రహించారు. కాగా, తిరుమలలో శనివారం శ్రీవారు స్వర్ణరథంపై సాయంత్రం 4 గంటల నుంచి ఆలయ పురవీధుల్లో ఊరేగనున్నారు. కాగా, శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ కుటుంబ సమేతంగా దర్శించుకుని వాహన సేవలో పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై లక్ష్మీకాసుల మాల ధరించి భక్తులకు అభయమిచ్చారు.#GarudaSeva pic.twitter.com/6JwhWGT694 — Roja Selvamani (@RojaSelvamaniRK) September 23, 2023 -
ముంబైలో 10 ఎకరా లో శ్రీవారి ఆలయానికి భూమి పూజ
-
వైభవంగా శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠ
– స్వామి, అమ్మవార్లకు శాంతి కల్యాణోత్సవం – తొండమాన్‌పురంలో ముగిసిన కుంభాభిషేక మహోత్సవాలు శ్రీకాళహస్తి రూరల్: శ్రీకాళహస్తి రూరల్ మండలం తొండమాన్‌పురంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ కుంభాభిషేక మహోత్సవాలు గురువారం వైభవంగా ముగిశాయి. చివరి రోజు స్వామి, అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠతో పాటు ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన, స్వామివారి కల్యాణోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఉదయం 4గంటల నుంచి ఆలయ ఆవరణలో టీటీడీ వేదపండితులు స్వామి, అమ్మవార్లకు నిత్య ఆరాధన, బాలభోగం, నిత్యహోమం, మహాపూర్ణాహుతి, చతుస్థాన కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం కలశాలను గ్రామోత్సవం అనంతరం ఆలయంపై ప్రతిష్ఠించారు. ఆలయ గర్భగుడిలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. తదుపరి కన్యాలగ్న పుష్కరాంశ సమయం ఉదయం 9.14 గంటలకు వుహాకుంభ ప్రోక్షణ చేసి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం తీర్థప్రసాద వినియోగం, భక్తులకు స్వామి దర్శనం, ఏకాంతసేవ కార్యక్రమాలను కమనీయంగా నిర్వహించారు. తొండమాన్‌పురం యువత ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం, మజ్జిగ పంపిణీ చేశారు. – కల్యాణం.. కమనీయం కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా ఆలయ అర్చకులు స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. టీటీడీ నుంచి స్వామి, అమ్మవార్లకు ఆలయ అధికారులు పట్టువస్త్రాలను తీసుకొచ్చారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై విశేషాలంకార శోభితులైన స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను కొలువుదీర్చి శాస్త్రోక్తంగా కల్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ పరిశీలకులు ఓడూరు గిరిధర్‌రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి, బీజేపీ నాయకుడు కోలా ఆనంద్, స్థానిక సర్పంచి బర్రి సునీత, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బర్రి హేమభూషణ్‌రెడ్డి, ఏపీసీడ్స్ మాజీ డైరెక్టర్ దందోలు భక్తవత్సలరెడ్డి, స్థానిక ఎంపీటీసీ సభ్యుడు వెంకటసుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలంరెడ్డి వేణుగోపాల్‌రెడ్డి, జయచంద్రారెడ్డి, కందాటి శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


