వైభవంగా శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠ | lord venkatesa statue lying | Sakshi
Sakshi News home page

వైభవంగా శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠ

Aug 19 2016 12:47 AM | Updated on Sep 4 2017 9:50 AM

ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన చేస్తున్న దృశ్యం

ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన చేస్తున్న దృశ్యం

శ్రీకాళహస్తి రూరల్‌ మండలం తొండమాన్‌పురంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ కుంభాభిషేక మహోత్సవాలు గురువారం వైభవంగా ముగిశాయి.

 
– స్వామి, అమ్మవార్లకు శాంతి కల్యాణోత్సవం
– తొండమాన్‌పురంలో ముగిసిన కుంభాభిషేక మహోత్సవాలు
 
శ్రీకాళహస్తి రూరల్‌: శ్రీకాళహస్తి రూరల్‌ మండలం తొండమాన్‌పురంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ కుంభాభిషేక మహోత్సవాలు గురువారం వైభవంగా ముగిశాయి. చివరి రోజు స్వామి, అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠతో పాటు ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన, స్వామివారి కల్యాణోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఉదయం 4గంటల నుంచి ఆలయ ఆవరణలో టీటీడీ వేదపండితులు స్వామి, అమ్మవార్లకు నిత్య ఆరాధన, బాలభోగం, నిత్యహోమం, మహాపూర్ణాహుతి, చతుస్థాన కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం కలశాలను గ్రామోత్సవం అనంతరం ఆలయంపై ప్రతిష్ఠించారు. ఆలయ గర్భగుడిలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. తదుపరి కన్యాలగ్న పుష్కరాంశ సమయం ఉదయం 9.14 గంటలకు వుహాకుంభ ప్రోక్షణ చేసి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం తీర్థప్రసాద వినియోగం, భక్తులకు స్వామి దర్శనం, ఏకాంతసేవ కార్యక్రమాలను కమనీయంగా నిర్వహించారు. తొండమాన్‌పురం యువత ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం, మజ్జిగ పంపిణీ చేశారు. 
– కల్యాణం.. కమనీయం
కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా ఆలయ అర్చకులు స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. టీటీడీ నుంచి స్వామి, అమ్మవార్లకు ఆలయ అధికారులు పట్టువస్త్రాలను తీసుకొచ్చారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై విశేషాలంకార శోభితులైన స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను కొలువుదీర్చి శాస్త్రోక్తంగా కల్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, వైఎస్సార్‌సీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ పరిశీలకులు ఓడూరు గిరిధర్‌రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి, బీజేపీ నాయకుడు కోలా ఆనంద్, స్థానిక సర్పంచి బర్రి సునీత, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ బర్రి హేమభూషణ్‌రెడ్డి, ఏపీసీడ్స్‌ మాజీ డైరెక్టర్‌ దందోలు భక్తవత్సలరెడ్డి, స్థానిక ఎంపీటీసీ సభ్యుడు వెంకటసుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ సేవాదళ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలంరెడ్డి వేణుగోపాల్‌రెడ్డి, జయచంద్రారెడ్డి, కందాటి శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement