తిరుమలలో కొలువైన శ్రీనివాసుడిని ఒడిలో పెట్టుకుని నిలిచిన కొండలకు కూడా ప్రత్యేకమైన పేర్లు, పురాణగాథలు, ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్నాయి. అందుకే తిరుమల కేవలం ఒక కొండపై ఉన్న ఆలయం కాదు, ఏడు కొండల సమాహారంగా భక్తుల హృదయాల్లో నిలిచిన పవిత్ర క్షేత్రం. తిరుమలలోని ఏడు కొండలను శేషాద్రి, గరుడాద్రి, వేంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి, అంజనాద్రిగా పిలుస్తారు. ఈ కారణంగానే శ్రీవారిని ‘ఏడుకొండలవాడు’గా భక్తులు పిలుస్తారు.
శేషాద్రి: ఆదిశేషుడు శ్రీమహావిష్ణువుకు శేషశయ్యగా సేవ చేస్తాడన్న వైష్ణవ సంప్రదాయంలో భాగంగానే ఈ కొండకు శేషాద్రి అనే పేరు వచ్చింది. తిరుమల కొండల సమూహానికే శేషాచలం అనే పేరు కూడా ప్రసిద్ధి. శ్రీవారి నివాసాన్ని శేషుడి దివ్యరూపంతో అనుసంధానించే ఈ భావన వల్ల శేషాద్రికి భక్తి సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఏర్పడింది.
గరుడాద్రి: మహావిష్ణువుకు వాహనమైన గరుడుడు శ్రీవారితో అనుబంధం గల దివ్యవిహంగంగా వైష్ణవ సంప్రదాయంలో పూజలు అందుకుంటాడు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడసేవకు ఉన్న విశిష్టత కూడా ఈ అనుబంధాన్ని గుర్తుచేస్తుంది. గరుడుని పేరుతో ఉన్న గరుడాద్రి భక్తుల దృష్టిలో శ్రీవారి సేవాభావానికి ప్రతీకగా నిలుస్తుంది. శ్రీవారి ఆదేశంతో గరుడుడే ఈ కొండను ఇక్కడకు తీసుకు వచ్చినట్లు పురాణాల కథనం.
వేంకటాద్రి: దీని శిఖరంపైనే శ్రీ వేంకటేశ్వరస్వామివారి ప్రధాన ఆలయం ఉంది. శ్రీ వేంకటేశ్వర ఆలయం పవిత్ర శేషాచల పర్వతశ్రేణుల్లోని వేంకటాద్రిపై స్వామి పుష్కరిణి దక్షిణ ఒడ్డున ఉంది. స్వామివారు ఈ కొండపై కొలువై ఉన్నందునే ‘వేంకటేశ్వరుడు’గా ప్రసిద్ధి చెందాడు.
నారాయణాద్రి: నారాయణుడు భక్తులకు ఆశ్రయదాత, పరమాత్మ అనే వైష్ణవ భావనలో ఈ కొండ పేరు ఒక ఆధ్యాత్మిక గుర్తింపుగా నిలుస్తుంది. పుష్కరిణి తీరంలో నారాయణుడు అనే భక్తుడు శ్రీవారి కోసం తపస్సు చేశాడట! ఆయనను స్వామి అనుగ్రహించడం వల్ల ఈ కొండకు నారాయణాద్రి అనే పేరు వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి.
వృషభాద్రి: వృషభాసురుడు అనే రాక్షసుడు తిరుమల ప్రాంతంలో తపస్సు చేశాడని, అనంతరం శివుడితో యుద్ధం చేసి ఓడిపోయాడని కథనం ఉంది. చివరికి అతడిని శ్రీవారు అనుగ్రహించడంతో అతడు తపస్సు చేసిన ప్రదేశానికి వృషభాద్రి అనే పేరు వచ్చినట్లు పురాణాల కథనం.
నీలాద్రి: తిరుమల కొండలలో ఒకటైన నీలాద్రి కి ఒక విశిష్టత ఉంది. నీలాద్రి అనే కొండ పేరు నీలాదేవి (ద్వాపరయుగంలో శ్రీ కృష్ణుని అష్టమహిషులలో ఒకరైన నీలాంబరి) పేరు మీదుగా వచ్చింది.
కలియుగ దైవమైన వేంకటేశ్వర స్వామికి తలనీలాలు సమర్పించే సంప్రదాయం ఈ కొండ ఆధారంగానే మొదలైంది. ఒకసారి శ్రీనివాసుడి తలపై దెబ్బ తగిలి కొంత భాగం జుట్టు ఊడిపోతుంది. అది గమనించిన నీలాదేవి, అంతటి అందమైన రూపానికి లోపం రాకూడదని భావించి, తన తలవెండ్రుకలను కోసి స్వామివారికి అమరుస్తుంది. ఆమె భక్తికి మెచ్చిన స్వామివారు, తన భక్తులు ఎవరైనా ఇక్కడికి వచ్చి తలనీలాలు సమర్పిస్తే ఆ పుణ్యం నీలాదేవికే చెందుతుందని వరమిచ్చారు.
అంజనాద్రి: అంజనాదేవి ఇక్కడ తపస్సు చేసిందని, హనుమంతుడు ఇక్కడే జన్మించాడని ప్రతీతి. అందువల్లనే ఈ కొండకు అంజనాద్రి అనే పేరు వచ్చిందని చెబుతారు. బాల హనుమంతుడు ఇక్కడి నుంచే సూర్యుడిని పండుగా భ్రమించి తినేయడానికి వెళ్లిన ఘట్టం కూడా పురాణాల్లో ఉంది.
తిరుమలలోని ఏడు కొండలలో ఒక్కక్కదానికి ఒక్కో పురాణగాథ ఉంది. తిరుమలకు చేరుకునే భక్తులు ‘ఏడుకొండలవాడా వేంకటరమణా’ అని నోరారా పిలిచినప్పుడు అది కేవలం నామస్మరణ మాత్రమే కాదు, తరతరాలుగా కొనసాగుతున్న క్షేత్ర సంప్రదాయం.


