బాలనటిగా మొదలైన ఆమె ప్రయాణం... నేడు విభిన్న పాత్రలకు కేరాఫ్‌గా మారింది. భాష ఏదైనా పాత్రలో ఒదిగిపోవడమే తన స్టయిల్ అంటోంది అనస్వర రాజన్ .
పేరు, పాపులారిటీ ఎంత పెరుగుతున్నా, తాను మాత్రం తన ఊరి అమ్మాయిగానే ఉండటమే ఇష్టమంటున్న ఈ యంగ్ హీరోయిన్ చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం...
అలా అనుకోకుండా!
మాది కన్నూర్‌లోని చిన్న గ్రామం. సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ కలలు కనలేదు. కానీ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు అనుకోకుండా ఓ సినీ అవకాశం వచ్చింది. మొదట్లో చాలా కొత్తగా, కాస్త భయంగా అనిపించింది. కానీ ఒక్కసారి కెమెరా ముందుకొచ్చాక నటన నాకు చాలా నచ్చేసింది. అలా మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు ఇన్ని భాషల్లో ఇన్ని విభిన్నమైన పాత్రల వరకు తీసుకొచ్చింది.
ఆ పాత్రలు ప్రత్యేకం!
‘అధ్యారాత్రి’ మలయాళం సినిమాలో తల్లిగా, కూతురిగా రెండు పాత్రలు చేయడం నాకు చాలా ప్రత్యేకమైన అనుభవం. ఒకే సినిమాలో రెండు వేర్వేరు వ్యక్తుల్లా కనిపించడం చాలెంజింగ్‌గా అనిపించింది. చిన్న వయసులోనే అలాంటి అవకాశం రావడం నా అదృష్టం. అలాగే మరో మలయాళం సినిమా ‘నేరూ’లోని సారా పాత్ర కూడా నాకు చాలా ప్రత్యేకం. ఆ పాత్ర విమర్శకుల ప్రశంసలతో పాటు ఫిల్మ్‌ఫేర్ అవార్డునూ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత స్క్రిప్ట్‌ను చూసే నా విధానం కూడా మారిపోయింది.
తెలుగు ప్రేమ మర్చిపోలేను!
తెలుగులో నా సినిమా థియేటర్లో చూసినప్పుడు ప్రేక్షకుల స్పందన నాకు ఇప్పటికీ గుర్తుంది. వాళ్లు చప్పట్లు కొట్టడం, కేకలు వేయడం చూస్తుంటే చాలా ఎమోషనల్‌గా అనిపించింది. ఒక నటిగా మనం చేసే పనికి ఇంత ప్రేమ వస్తుందంటే, అంతకంటే ఆనందం ఇంకేముంటుంది!
ప్రతిదీ పట్టించుకునేదాన్ని!
నా గురించి ఎవరు ఏం అన్నారు? సోషల్ మీడియాలో ఏం రాశారు? రివ్యూ ఎలా వచ్చింది? ఇలాంటివన్నీ మొదట్లో చాలా పట్టించుకునేదాన్ని. చిన్న కామెంట్‌కు కూడా రోజంతా బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు అలా కాదు, అవసరం లేని నెగటివిటీకి దూరంగా ఉండటమే మంచిదని నేర్చుకున్నా.
డైట్ నావల్ల కాదు!
డైట్ చేయాలనే ఆలోచన అసలు లేదు. మంచి కేరళ ఇంటి భోజనం కనిపిస్తే కంట్రోల్ చేసుకోలేను. ఎంత బిజీగా ఉన్నా, నచ్చిన ఫుడ్ తినకుండా నన్ను నేను కట్టడి చేసుకోను. ఇప్పటికీ మా ఊరికి వెళ్తే, రోడ్డు పక్కన నచ్చినది కనిపిస్తే చాలు... అక్కడే ఆగి తినేస్తా!
ఒక నవ్వు... ఒక వివాదం!
‘విత్ లవ్’ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో సరదాగా నేను చెప్పిన ఓ చిన్న మాటను తీసుకుని పెద్ద వార్తలా మార్చేశారు. నవ్వుతూ మాట్లాడిన మాటను సందర్భం నుంచి విడదీసి చూపించడం నాకు చాలా బాధ కలిగించింది. అది రిపోర్టింగ్ కాదు, పూర్తిగా వక్రీకరణ. ఇప్పుడు అలాంటి వాటికి అసలు స్పందించకూడదని నిర్ణయించుకున్నా.
ఆమె నా సేఫ్ ప్లేస్!
సినిమా ప్రపంచం బయట నుంచి చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది. కానీ లోపలికి వచ్చాక ఒత్తిళ్లు కూడా ఉంటాయి. అలాంటి సమయంలో మా అక్క ఐశ్వర్యతో మాట్లాడితే చాలు, చాలా రిలీఫ్‌గా అనిపిస్తుంది. ఏ విషయం అయినా తనతోనే పంచుకుంటా. ఆమె నాకు అక్క మాత్రమే కాదు, నా ఎమోషనల్ సేఫ్ ప్లేస్.
క్యారెక్టర్ ముఖ్యం!
అందంగా కనిపించే పాత్రల కంటే నటిగా నన్ను పరీక్షించే పాత్రలు చేయడం నాకు ఇష్టం. ముఖ్యంగా నాలో నాకే తెలియని కోణాలను బయటకు తీసే పాత్రలు ఎక్కువగా నచ్చుతాయి. ఒక పాత్ర ద్వారా కొత్త మనిషిని అర్థం చేసుకోవడం; ఆ మనిషిలా ఆలోచించడం; ఆ ప్రపంచంలోకి వెళ్లడం– ఇవే నటనలో నాకు అసలైన కిక్కిస్తాయి.


