
ఆరోగ్యం కోసం పానీయాలను ఆశ్రయిస్తున్న ప్రజలు
ఎండలు మండిపోతుండటంతో నగర వాసులు బెస్ట్ పానీయాల కోసం వెతుకుతున్నారు. ఇప్పటి వరకు కూల్‌డ్రింక్స్, సోడాలు ఆధిపత్యం చెలాయించినా.. ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెంచుకుంటూసహజమైన, ఆరోగ్యకరమైన పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ఎండ వేడిలో శరీరానికి అవసరమైన ఉష్ణోగ్రతల సమతుల్యత కాపాడటం ప్రామాణికంగా మారుతున్న నేపథ్యంలో పోషక విలువలు కలిగిన పదార్థాల వినియోగానికే జై కొడుతున్నారు. ట్రైనర్లు సైతం వేసవిలో సహజ, పోషక పానీయాలకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తుండటంతో ఇప్పుడిదే ట్రెండ్‌గా మారింది. – సాక్షి, సిటీబ్యూరో
అలోవేరా, కీరా, బీట్‌రూట్ ఇలా ఎన్నెన్నో.. వేసవి తాపానికి ఉపశమనం అంటున్న నిపుణులు సోషల్ మీడియాలో సెలబ్రిటీల పోస్టుల ప్రభావం ఫుట్‌పాత్ నుంచి ఫైవ్‌స్టార్ హోటల్స్ వరకు లభ్యం ఇష్టంగా జ్యూస్‌లు తాగుతున్న ఈతరం యువత హెర్బల్ రింగ్స్ ఇందులో మరో ప్రత్యేకం
సామాన్య జనాల నుంచి సెలబ్రిటీల వరకూ ఈ ఆరోగ్య పానీయాలపై ఆసక్తి పెరగడం ద్వారా, ఇది తాత్కాలిక ఫ్యాషన్ కాకుండా జీవనశైలిలో భాగంగా మారిన ఆరోగ్యకరమైన అలవాటు అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. వేసవిలో చల్లదనం కోసం, ఆరోగ్యం కోసం ఈ తాజా పానీయాల ట్రెండ్‌ను మెచ్చుకోకుండా ఉండలేమంటున్నారు. ఈ మధ్య సినీనటి కీర్తిసురేష్‌తో పాటు పలువురు టాలీవుడ్ ముద్దుగుమ్మలు తమ అందానికి, ఆరోగ్యానికి ఈ పానీయాలు కూడా ప్రధాన కారణమని చెబుతుండటంతో యువత వీటిపై మోజు పెంచుకుంటోంది. ఈ పానీయాల తయారీ కోసం ఫుడ్ బ్లాగర్స్ ప్రత్యేకంగా రీల్స్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
కూల్ కూల్ సబ్జా..
సబ్జా గింజలతో కూడిన పానీయాలకు మార్కెట్‌లో ఆదరణ లభిస్తోంది. ప్రధానంగా ఇవి శరీర చల్లదనానికి దోహదపడతాయి. ముఖ్యంగా లెమన్ జ్యూస్, రోస్ షర్బత్, మిల్క్ బేస్డ్ డ్రింక్స్‌లో సబ్జా గింజల వినియోగం విస్తృతంగా పెరిగింది. శరీరానికి కూలింగ్ ఇచ్చే ఈ గింజలు, అధిక వేడిలో పొట్టకు ఉపశమనంగా పనిచేస్తాయి.
సరికొత్తగా అలోవేరా..
ఆరోగ్యకరమైన అభిరుచులలో అలోవేరా జ్యూస్ ఒకటిగా నిలిచింది. సోషల్ మీడియాలో అలోవేరా జ్యూస్ వైరల్‌గా మారడంతో.. దీనిని సైతం ఇష్టంగా సేవిస్తున్నారు. ఇది దాహాన్ని తీరుస్తూనే, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చర్మానికి కూడా లాభదాయకంగా ఉండటంతో మహిళలకు ఈ జ్యాస్ నచ్చేసింది.
వేడిమి సమతుల్యం..
క్యారెట్, బీట్‌రూట్, కీరా వంటి కూరగాయల జ్యూస్‌లు ఆల్‌టైం ఫేవరెట్‌గా నిలుస్తున్నాయి. వీటిలో విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉండటంతో ఇబ్బంది లేకుండా తేలికగా జీర్ణమై, శరీరానికి శక్తిని అందిస్తాయి. బీట్‌రూట్ జ్యూస్ రక్తహీనత నివారణకు, క్యారెట్ జ్యూస్ కంటికి మేలు చేసేందుకు, కీరా శరీర ఉష్ణోగ్రత తగ్గించేందుకు ఉపయోగపడుతుంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఎలక్ట్రోలైట్ డ్రింక్స్‌కు బదులుగా..
సంప్రదాయ పానీయాలైన కొబ్బరి నీళ్లు, చెరుకు రసం కూడా ఎప్పటిలానే వాటి స్థానాన్ని నిలుపుకున్నాయి. వీటిలో సహజమైన తీపి, విటమిన్లు, మినరల్స్ ఉండటం వలన ఇవి ఎలక్ట్రోలైట్ డ్రింక్స్‌కు బదులు విస్తృతంగా ఉపయోగపడుతున్నాయి. కొబ్బరి నీళ్లు, కిడ్నీ ఆరోగ్యానికి మేలు చేస్తే, చెరుకు రసం శక్తిని పెంచుతుంది.
ఔషధ పానీయాలు సైతం..
ఇదే సమయంలో పుదీనా, తులసి వంటి ఔషధ గుణాలు కలిగిన పానీయాలు ఇప్పుడు మార్కెట్‌లో దొరకుతున్నాయి. వీటిలో పుదీనా శ్వాస సంబంధిత సమస్యలకు, తులసి ఇమ్యూనిటీ మెరుగు పరిచేందుకు సహాయపడతాయి. హెర్బల్ టీ, తులసి వాటర్ వివిధ రూపాల్లో లభిస్తున్నాయి.
ఇదీ చదవండి: ఫోర్బ్స్‌లో అనన్య పాండే, బాయ్ ఫ్రెండ్ రియాక్షన్ వైరల్
ఫుట్‌పాత్ టు ఫైవ్ స్టార్..
ఈ పానీయాలు కేవలం ఫుట్‌పాత్ జ్యూస్ స్టాల్స్ వరకు మాత్రమే కాకుండా.. త్రీ స్టార్, ఫైవ్ స్టార్ హోటల్స్‌లో కూడా ప్రత్యేక మెనూలో చోటు దక్కించుకున్నాయి. హోటల్ లాబీలలో గ్రీన్ హెల్త్ షాట్స్, డిటాక్స్ జ్యూస్‌లు, స్పెషల్ డ్రింక్స్ కొత్తగా కనిపిస్తున్నాయి. రాత్రి సేదతీరే క్లబ్, పబ్‌లలో కూడా ఈ పానీయాలకు ఆదరణ పెరిగింది. ఇదొక మోడ్రన్ లివింగ్ స్టైల్‌గా గుర్తింపు తెచ్చుకుంది.