Timber‌ Depot: ‘టేక్‌’ఓవర్‌ చేసింది

Adapa Priya Special Story On ECONaturals Exim Timber Depot - Sakshi

తిండిలేని పరిస్థితి నుంచి ఉన్నత పారిశ్రామికవేత్తగా ఎదిగారు నాడు ఛీ అన్నవారు నేడు ఆమె అభివృద్ధికి ఆశ్చర్యపోతున్నారు. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా టింబర్‌ డిపో యజమానిగా ఎదిగారు ప్రియ అడపా ఉద్యోగిగా చేరిన కంపెనీకే యజమాని అయ్యారు ముళ్ళబాటను రెండు దశాబ్దాలలో పూలబాటగా మార్చుకున్నారు. ఇంటీరియర్‌ డెకరేషన్, ఫర్నిచర్‌ తయారీలతో వ్యాపారంలో ముందడుగు వేస్తున్నారు. ఉత్తమ ఎంటర్‌ప్రెన్యూర్‌గా లేడీ లెజెండ్‌ అవార్డును అందుకున్న ప్రియ అడపా విజయగాథ ఆమె మాటల్లోనే...

మా తల్లిదండ్రులకు మేం ఇద్దరు మగ పిల్లలు, ముగ్గురు ఆడపిల్లలం. నేను మూడో అమ్మాయిని. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవటంతో, మా అమ్మమ్మ దగ్గర ఏలూరులో ఏడాదిపాటు పెరిగాం. అక్కడ ఎక్కువ కాలం ఉండటం ఇబ్బంది కావటంతో నా పదమూడో ఏట రెండు వేల రూపాయల ఉద్యోగానికి హైదరాబాద్‌ వచ్చాను. కొంతకాలానికి ఒక టింబర్‌ డిపోలో ఐదు వేల రూపాయల జీతానికి రిసెప్షనిస్టుగా చే రాను.

ఆ తర్వాత అదే టింబర్‌ డిపోకు ఇన్‌చార్జి బాధ్యతలు కూడా చేపట్టాను. ఉద్యోగం చేస్తూనే, బీకాం కంప్యూటర్స్‌ పూర్తి చేశాను. క్రమేపీ నా జీతం లక్ష రూపాయలకు చేరింది. మా డిపోలో ఇంపోర్ట్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్‌ ఎక్కువగా జరిగేది. కొంతకాలానికి ఆ యజమాని విదేశాలకు వెళ్లిపోవాలనే ఉద్దేశంతో డిపో మూసేద్దామనుకున్న సమయంలో 2013 లో నేను ఆ కంపెనీని కొన్నాను. అదే అప్పుడు ‘ఎకో నేచురల్‌’ అనే నా బ్రాండ్‌. నా వయస్సు 24 సంవత్సరాలు. అంతకాలం నేను దాచుకున్న డబ్బుతో గుడ్‌ విల్‌ కింద రూ. 8 ల„ý లు చెల్లించాను.

స్నేహితుల సహకారంతో..
కంపెనీ బాధ్యతలు చేపట్టినప్పుడు ఏడాది పాటు సమస్యలు ఎదుర్కొన్నాను. నాకున్న అనుభవం తో వాటిని అధిగమించాను. స్నేహితుల సహకారంతో ఓపెన్‌ స్పేస్‌లో షెడ్‌ వేసి, లైసెన్స్‌ కొనుక్కుని కంపెనీని విస్తరించాను. ఒక అమ్మాయి ఇంత పెద్ద ఆర్డర్‌ చేస్తుందా అని కొందరు, అమ్మాయికి సపోర్ట్‌ చేద్దాం అని కొందరు, ఆడపిల్ల కనుక మోసం చేయదని కొందరు... ఇలా అందరూ అమ్మాయి అనే అంశం మీదే మాట్లాడినా, ఆర్డర్లు ఇస్తున్నారు. మా టింబర్‌ డిపోలో నాణ్యమైన టేకు చెక్క మాత్రమే సప్లయి చేస్తున్నాను. టేకు చెక్కతో చాలా సమస్యలు ఎదురవుతాయి. టేకు లోపల గుల్లగా ఉంటే బావుండదు. నా అనుభవాన్ని ఉపయోగించి, వాటితో చిన్న చిన్న ఇంటీరియర్స్‌ చేయటం ప్రారంభించాను. దాంతో నష్టాల నుంచి బయటకు వచ్చాను. నేను స్వయంగా ఒక ఎకరంలో పూర్తిగా టేకు చెక్కతో ఫామ్‌ హౌస్‌ కట్టాను.

లొంగిపోకూడదు..
ఒంటరిగా ఉన్న అమ్మాయి కనిపిస్తే చాలు.. ఆశలు చూపిస్తారు, ప్రలోభాలకు గురి చేస్తారు. ఆ ఆశలు కొంతకాలం వరకే ఉంటాయి. పదిరోజుల ఆనందం కోసం ఎదురు చూస్తే, జీవితాంతం బాధపడాలి. నాకు ఎంతోమంది ఎన్నో ప్రలోభాలు చూపించారు. వేటికీ లొంగకుండా, వ్యక్తిత్వంతో నిలబడ్దాను. ఉన్నత స్థాయికి ఎదిగాను. అందరికీ ఇప్పుడు నేను కొనుక్కున్న కారు, ఇల్లు కనిపిస్తాయి. ఈ స్థాయికి రావడం వెనుక 20 సంవత్సరాల స్ట్రగుల్‌ ఉంది.

ధైర్యంగా ఎదుర్కోవాలి
జీవితంలో ఎదురైన ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కోవాలే కానీ కుంగిపోకూడదు. చిన్నదో పెద్దదో ఏదో ఒకటి చేయడం మొదలు పెడితేనే ఎదగడానికి అవకాశం వస్తుంది. అమ్మాయిగా పుట్టినందుకు కూడా చాలా గర్వంగా భావిస్తాను. హైదరాబాద్‌ వచ్చిన కొత్తల్లో బ్యాగు పోగొట్టుకుని, పది రోజుల పాటు తిండి లేకుండా ఫుట్‌పాత్‌ మీదే గడిపాను. ఆ సమయంలో ఒక కుటుంబం చేసిన సహాయం నా ఎదుగుదలకు బాటలు వేసింది. ఇప్పుడు ‘ఎకో నేచురల్‌’ అంటే ఒక బ్రాండ్‌. నాకు గుర్తింపు తెచ్చిన పేరు. నా ఎదుగుదలకు చిరునామా.

– వైజయంతి పురాణపండ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top