బీరకాయతో నాన్‌వెజ్‌.. చికెన్‌, రొయ్యలు, ఖీమా

3 Mouth Warming Non Veg Recipes With Ridge Gourd In Telugu - Sakshi

కూరగాయలన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. బీరకాయలో పీచుపదార్థం, విటమిన్‌ సి, మెగ్నీషియం, ఐరన్, జింక్, రైబోఫ్లావిన్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బీర తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గడమే కాకుండా రక్తహీనత, చెడు కొలెస్ట్రాల్‌ నియంత్రణలో ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు కూడా తగ్గుతారు. రుచిలో కాస్త చప్పగా ఉండే బీరకాయను వివిధ రకాల కాంబినేషన్లలో వండితే మరిన్ని పోషకాలతో పాటు రుచి కూడా పెరుగుతుంది.   

ఎండురొయ్యలు బీర కుర్మా
కావలసినవి: ఎండు రొయ్యలు – పావు కేజి; బీరకాయ – ఒకటి; ఆయిల్‌ – మూడు టీస్పూన్లు; ఉల్లిపాయ – ఒకటి(సన్నగా తరుక్కోవాలి); ఉప్పు – రుచికి సరిపడా; అల్లం వెల్లుల్లి పేస్టు – అరటీస్పూను; కరివేపాకు – ఒక రెమ్మ; చింతపండు – పావు టీస్పూను; ధనియాల పొడి – పావు టీస్పూను; జీలకర్ర పొడి – పావు టీస్పూను; కారం – రెండు టీస్పూన్లు; గరం మసాలా – అరటీస్పూను.

తయారీ..ముందుగా ఎండు రొయ్యల తల, తోక తీసి ఇసుకలేకుండా శుభ్రంగా కడిగి పక్కనపెట్టుకోవాలి.
►బీరకాయ తొక్కతీసి సన్నని ముక్కలు చేయాలి.
►స్టవ్‌ మీద పాన్‌ పెట్టి వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఉప్పువేసి వేగనివ్వాలి.
►మరో పాన్‌లో కప్పు నీళ్లు పోసి ఎండు రొయ్యలు వేసి నాలుగు నిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
►ఉల్లిపాయ ముక్కలు వేగాక అల్లంవెల్లుల్లి పేస్టు, కరివేపాకు, పసుపు వేసి మరో ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి.
►ఇప్పుడు బీరకాయ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి మరో ఐదు నిమిషాలపాటు మూత పెట్టి ఉడకనిచ్చి, ఉడికించి పెట్టుకున్న ►ఎండు రొయ్యలు వేసి మరో ఎనిమిది నిమిషాలు మగ్గనివ్వాలి
►తరువాత గరం మసాలా వేసి తిప్పి నూనె పైకి తేలేంత వరకు ఉడికిస్తే ఎండురొయ్యలు బీరకాయ కుర్మా రెడీ.  

బీరకాయ చికెన్‌
కావలసినవి: బోన్‌లెస్‌ చికెన్‌ – అరకేజి; ఆయిల్‌ – నాలుగు టీ స్పూన్లు; పచ్చిమిరపకాయలు – మూడు (నిలువుగా కట్‌ చేయాలి); ఉల్లిపాయ – ఒకటి (ముక్కలుగా కట్‌ చేయాలి); అల్లం వెల్లుల్లి పేస్టు – ఒకటిన్నర టీ స్పూను; పసుపు – అర టీస్పూను; బీరకాయ ముక్కలు – ఒక కప్పు; కారం – రెండు టీ స్పూన్లు; ధనియాల పొడి – టీ స్పూను; గరం మసాలా – పావు టీ స్పూను; తరిగిన కొత్తిమీర – పావు కప్పు; ఉప్పు – రుచికి సరిపడా.

తయారీ.. చికెన్‌ను శుభ్రంగా కడిగిపెట్టుకోవాలి.
►స్టవ్‌ మీద పాన్‌ పెట్టి వేడెక్కిన తరువాత ఆయిల్‌ వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేయాలి.
►ఉల్లిపాయలు వేగాక అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు వేసి వేయించాలి.
►అల్లం వెల్లుల్లి పేస్టు వేగాక చికెన్‌ ముక్కలు వేసి మూతపెట్టి పదినిమిషాలు ఉడికించాలి.
►తరువాత బీరకాయ ముక్కలు వేసి మూతపెట్టి  ఐదు నిమిషాలయ్యాక, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి.
►తరువాత ధనియాల పొడి, గరం మసాలా వేసి ఆయిల్‌ పైకి తేలాక, కొత్తిమీర వేసి స్టవ్‌ ఆపేస్తే బీరకాయ చికెన్‌ రెడీ. 

బీర ఖీబా
కావలసినవి: మటన్‌ ఖీమా – పావు కేజి; బీరకాయ ముక్కలు – అరకేజి(తొక్కతీసినవి); తరిగిన పచ్చిమిర్చి – రెండు; వెల్లుల్లి తురుము – టీస్పూను; ఉల్లిపాయ ముక్కలు – అరకప్పు; మిరియాల పొడి – టీ స్పూను; పసుపు – టీస్పూను; కారం – రెండు టీ స్పూన్లు; గరం మసాలా – అరటీస్పూను; జీలకర్ర – టీస్పూను; ఆవ నూనె – నాలుగు టీ స్పూన్లు; ఉప్పు– రుచికి సరిపడా.

తయారీ.. మటన్‌ ఖీమాను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
►స్టవ్‌ మీద పాన్‌ పెట్టి ఆయిల్‌ వేసి వేడెక్కాక జీలకర్ర వేసి వేగనివ్వాలి. తరువాత పచ్చిమిర్చి తరుగు, వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
►ఇవన్నీ వేగాక పసుపు, బీరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి.
►బీరకాయ ముక్కలు సగం ఉడికిన తరువాత కొద్దిగా ఉప్పు, మటన్‌ ఖీమా వేసి మూతపెట్టి పదిహేను నిమిషాలు ఉడికించాలి.
►ఖీమాలో వచ్చిన నీళ్లన్నీ ఇగిరిపోయాక, కారం, మిగిలిన మసాలా పొడులు వేసి వేగనివ్వాలి.
►చివరిగా ఉప్పు చూసి సరిపోకపోతే కొద్దిగా వేసి ఆయిల్‌ పైకి తేలేంత వరకు వేగనిస్తే బీర ఖీమా రెడీ. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top