
కపిల్‌దేవ్‌గా రణవీర్ సింగ్ వేడి వేడి షాట్స్ సర్వ్ చేస్తాడు. లాల్‌సింగ్ చద్దాగా ఆమిర్ ఖాన్ పొగలు గక్కే సబ్జీ రెడీ చేస్తాడు. మైదాన్‌లో అజయ్ దేవ్‌గణ్ కొట్టే గోల్స్‌ను చూస్తే కడుపు నిండిపోవాల్సిందే. 2020 కరోనాతో ప్రేక్షకుల కడుపు మాడ్చింది. 2021 మీ కోసం బాలీవుడ్ ఫ్రెష్ మెనూను తెస్తోంది. దాదాపు ఇరవై ముప్ఫై మంచి సినిమాలు ఈ సంవత్సరం రిలీజుల కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రేక్షకులు కూడా. కరోనా వార్తలు ఎలా ఉన్నా రెడీ అవండి. ఏమో.. అంతా బాగైపోవచ్చేమో. వీటి రిలీజుకు మనం థియేటర్‌లో కలవొచ్చేమో. చూద్దాం.
తలుపులు మూసేస్తారు. లైట్లు ఆఫ్ చేసేస్తారు. తెర మీద వెలుతురు వస్తుంది. ఆ తర్వాత పెద్ద సౌండ్ వస్తుంది. హీరో హీరోయిన్లు పాట పాడతారు. విలన్ భయపెడతాడు. ఏదో ఉద్వేగానికి కన్నీరొస్తుంది. ఏదో సన్నివేశానికి పకపకమని నవ్వు వస్తుంది. పెద్ద తెర మీద సినిమా చూడటం ఒక అనుభవం. ఒక ఆనందం. హెల్తీ కాలక్షేపం. భారతదేశంలో సగటు కుటుంబానికి అదే పెద్ద వ్యాహ్యాళి. కాని 2020 థియేటర్ల సీట్లను, ప్రేక్షకుల వినోదాన్ని కూడా ఖాళీ చేసింది. కాని 2021 మొదలు ఆశలు రేపుతోంది. ఒకవైపు వాక్సిన్ వార్తలు, మరోవైపు తగ్గుతున్న కరోనా మరణాల రేటు ఈ సంవత్సరపు సినిమాల మీద ఆశలు పెట్టుకునేలా చేస్తున్నాయి. కరోనా వల్ల వెనక్కు నెట్టబడిన సినిమాలు ఈ సంవత్సరంలో పడ్డాయి. ఈ సంవత్సరం కోసం రెడీ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. అవేమిటో చూద్దాం.
అత్‌రంగీ రే
అంతా సక్రమంగా జరిగితే ఫిబ్రవరిలో ‘మేడమ్ చీఫ్ మినిస్టర్’ సినిమా విడుదలవుతుంది. రిచా చద్దా ఇందులో ముఖ్యపాత్ర. దళిత స్వీపర్‌గా నటిస్తోంది. కథ ప్రకారం ముఖ్యమంత్రి అయ్యి అవినీతి చెత్త ఊడుస్తుందేమో. ‘జానీ ఎల్‌ఎల్‌బి’ వంటి హిట్ కొట్టిన సుభాష్ కపూర్ దీని దర్శకుడు. మన సౌత్ ధనుష్, అక్షయ్ కుమార్, సారా అలీఖాన్ నటించిన ‘అత్‌రంగీ రే’ మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అనంద్ ఎల్.పాయ్ దర్శకుడు. ఈ రెండూ కాకుండా మన రానా నటించిన ‘హాతీ మేరే సాథీ’ (అరణ్య) కూడా మార్చిలోనే ప్రేక్షకుల ముందుకు రావాలి లెక్క ప్రకారం.
బెల్‌బాటమ్
1980ల నాటి కథతో అక్షయ్ కుమార్ నటించిన ‘బెల్ బాటమ్’ ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది. వాణి కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా గత సంవత్సరమే రిలీజ్ కావాల్సి ఉన్నా కరోనా వల్ల కాలేదు. అలాగే భారీ ఖర్చుతో తీసిన రోహిత్ శెట్టి సినిమా ‘సూర్యవంశీ’ కూడా గత సంవత్సరం రిలీజ్ కాకుండా ఈ సంవత్సరంలోకి వచ్చింది. ‘సూర్యవంశీ’లో అక్షయ్ పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. అక్షయ్ నటించిన ‘రక్షాబంధన్’ ఈ యేడు రిలీజ్ కానున్న మరో మూవీ. దీనికి కూడా ఆనంద్ ఎల్.పాయ్ దర్శకుడు.
’83
కపిల్ దేవ్ వరల్డ్ కప్ సాధించడానికి ఎంత కష్టపడ్డాడో అతని జీవితం మీద వచ్చిన ‘83’ రిలీజ్ కావడానికి కూడా అన్ని కష్టాలు వస్తున్నాయి. 2020 ఏప్రిల్‌లో రిలీజ్ కావాల్సిన సినిమా ఓటిటి రిలీజ్‌ను నిరాకరించి థియేటరికల్ రిలీజ్ కోసం ఓపిగ్గా ఎదురు చూస్తోంది. రణ్‌వీర్ సింగ్ కపిల్ దేవ్‌గా నటించిన ఈ సినిమాకు కబీర్ ఖాన్ దర్శకత్వం వహించాడు.
ఆమిర్ ఖాన్ – సల్మాన్ ఖాన్
ఈ ఇద్దరు ఖాన్‌లను 2021 ఎలా కరుణిస్తుందో చూడాలి. సల్మాన్‌ఖాన్ నటించిన ‘రాధే’ ఇప్పటికే పూర్తిగా రెడీ అయ్యి థియేటర్ల కోసం ఎదురు చూస్తోంది. ప్రభుదేవా దీని దర్శకుడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘పోకిరి’ రీమేక్ హిట్ అయ్యింది. మేలో రంజాన్ పండక్కి ఈ సినిమా రిలీజ్ చేయాలని సల్మాన్ అనుకుంటున్నాడు. ఇక ‘ఫారెస్ట్ గంప్’ రీమేక్‌గా ఆమిర్ నటించిన ‘లాల్‌సింగ్ చద్దా’ సంవత్సరాంతానికి ప్లాన్ చేశారు. అప్పటికి వాక్సిన్ పూర్తిగా అందుబాటులోకి వచ్చేసుంటుంది కాబట్టి లైన్ అతనికే క్లియర్‌గా ఉంది.
బ్రహ్మాస్త్ర– మైదాన్
అమితాబ్ బచ్చన్, నాగార్జున, రణబీర్ కపూర్, ఆలియాభట్‌లు నటించిన భారీ చిత్రం ‘బ్రహ్మస్త్ర’ రిలీజ్ 2018 నుంచి ఆలస్యం అవుతూ 2021లో పడింది. అయాన్ ముఖర్జీ దీని దర్శకుడు. ఏలియన్స్ తరహా సూపర్ నేచురల్ కంటెంట్ ఈ సినిమాలో ఉంటుందని ఆశిస్తున్నారు. ఇక 1960లో ఫుట్‌బాల్ మనదేశంలో ఉజ్వలంగా ఉన్నప్పటి కథతో తీసిన సినిమా ‘మైదాన్’ మీద అజయ్ దేవ్‌గణ్ ఆశలు పెట్టుకుని ఉన్నాడు. అక్టోబర్‌లో ఈ సినిమా విడుదల కానుంది.
సర్దార్ ఉధమ్‌సింగ్
ఉధమ్ సింగ్ ఎంతటి విప్లవ వీరుడో అందరికీ తెలుసు. జలియన్‌వాలాబాగ్ ఘటనతో ప్రతీకారానికి ప్రతిన బూనిన ఈ పంజాబ్ వీరుడు బ్రిటిష్ అధికారి మైకేల్ ఫ్రాన్సిస్‌ని హతమార్చి చరిత్రకెక్కాడు. పంజాబ్‌లో ఇతని బయోపిక్ వచ్చినా బాలీవుడ్‌లో రావడం ఇదే ప్రథమం. ప్రసిద్ధ దర్శకుడు సూజిత్ సర్కార్ దర్శకత్వం వహించగా ‘ఉరి’ ఫేమ్ వికీ కౌశల్ ఉధమ్ సింగ్ పాత్ర పోషించాడు. ఈ సంవత్సరం రిలీజుల్లో ఇదీ ఒక ఆకర్షణ.
ఇవి కాకుండా తెలుగు ‘జెర్సీ’ రీమేక్‌గా వస్తున్న షాహిద్ ఖాన్ జెర్సీ, జాన్ అబ్రహమ్ ‘సత్యమేవ జయతే 2’, ఫర్హాన్ అఖ్తర్ ‘తూఫాన్’, అభిషేక్ బచ్చన్ ‘బిగ్‌బుల్’, రణ్‌వీర్ సింగ్ ‘జాయెష్‌భాయ్ జోర్‌దార్’ తదితర సినిమాలు ఉన్నాయి. వీటి ఫలితాలను మన తీర్పులను సంవత్సరాంతంలో మాట్లాడుకుందాం.
గుంగుబాయ్ ఖతియావాడి
ఈ ముంబై కామాటిపురాకు చెందిన ఒక సెక్స్‌వర్కర్ బయోపిక్. గంగుబాయ్ అనే అమ్మాయిని ఆమె ప్రియుడు రామ్‌నిక్ లాల్ 1960లో కామాటిపురలో అమ్మేశాడు. ఆమె అక్కడే ఉండిపోయింది. ఆ తర్వాత వేశ్యాగృహానికి యజమాని అయ్యింది. ఆమె జీవితం ఆధారంగా ప్రసిద్ధ దర్శకుడు సంజయ్‌లీలా బన్సాలీ ఆలియా భట్‌తో ఈ సినిమా తీశాడు. ఈ సంవత్సరం విడుదల అవుతోంది.
– సాక్షి ఫ్యామిలీ