సాక్షి, భీమవరం: పరిషత్ పోరులో ప్రచార పర్వానికి తెరపడింది. కొద్దిరోజులుగా హోరెత్తిన మైకులు మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి మూగబోయాయి. గురువారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. జిల్లాలోని జెడ్పీ, మండల పరిషత్ పాలకవర్గాల ఏర్పాటుకు గత నెల 19న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 21 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ, అక్టోబర్ 24న పరిశీలన, అక్టోబరు 27 వరకు ఉపసంహరణ గడువు, నవంబరు 3న పోలింగ్, 5న కౌంటింగ్‌కు షెడ్యూల్ విడుదల చేశారు. అయితే 3న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో 5న పరిషత్ పోలింగ్, 7న కౌంటింగ్‌కు ఈసీ రీషెడ్యూల్ చేసింది. పశ్చిమగోదావరి జిల్లాలో 20 జెడ్పీటీసీ స్థానాలకు గాను వైఎస్సార్‌సీపీ, కూటమి, కాంగ్రెస్ తదితర 67 మంది పోటీలో ఉన్నారు. 371 ఎంపీటీసీ స్థానాలకు గాను ఉండి నియోజకవర్గంలో 27, తణుకు నియోజకవర్గంలో నాలుగు స్థానాలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 340 స్థానాలకు ఆయా పార్టీలు, స్వతంత్రులు కలిపి 744 మంది బరిలో నిలిచారు. మొత్తం 10,52,927 మంది ఓటర్లకు 5,20,721 మంది పురుషుల, 5,32,195 మంది మహిళలు, 11 మంది ట్రాన్స్ జెండర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 1,244 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. వీటిలో 396 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పోలింగ్ నిర్వహణ, బ్యాలెట్ పత్రాల వినియోగం తదితర అంశాలపై శిక్షణ పూర్తిచేశారు. 5న జరిగే పోలింగ్, 7న జరిగే కౌంటింగ్ కోసం సర్వం సిద్ధం చేసినట్టు కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం మీడియాకు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు.
ముగిసిన ప్రచారం
గత కొద్దిరోజులుగా హోరెత్తిస్తున్న మైకులు మూగబోగా, ప్రశాంత వాతావరణం నెలకొంది. మంగళవారం సాయంత్రంతో ముగించాల్సి ఉండటంతో చివరి రోజున భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించేందుకు అభ్యర్థులు చేసుకున్న ఏర్పాట్లకు మురసు తుపాను తీవ్ర ఆటంకం కలిగించింది.
ప్రలోభాలకు తెర లేపారు
పోలింగ్‌కు ఒక్క రోజు మాత్రమే వ్యవధి ఉండటంతో మంగళవారం రాత్రి నుంచి పలు గ్రామాల్లో కూటమి ప్రలోభాలకు తెరలేపింది. మున్సిపల్ ఎన్నికల్లో మాదిరి ఓటుకు రూ. 500 నుంచి రూ. వెయ్యి వరకు పంపిణీకి సన్నాహాలు చేస్తున్నారు. అభ్యర్థులు ఎవరికి వారు తమ అనుచరుల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా పంపిణీకి శ్రీకారం చుడుతున్నారు. ఓటుకు నగదుతో పాటు, పురుషులకు మద్యం బాటిల్స్ ఇస్తుండగా, మహిళలకు చీరలు, అందజేస్తున్నట్టు తెలిసింది.
ఏలూరు జిల్లాలో 26 జెడ్పీటీసీ, 442 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 27 జెడ్పీటీసీ స్థానాలకు ఒకటి, 454 ఎంపీటీసీ స్థానాలకు 12 ఏకగ్రీవం అయ్యాయి.
ముగిసిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం
రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
పశ్చిమలో 20 జెడ్పీటీసీ, 340 ఎంపీటీసీ స్థానాలు
ఏలూరు జిల్లాలో 26 జెడ్పీటీసీ, 442 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు


