స్థానిక ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలి

Nov 4 2026 1:26 AM | Updated on Nov 4 2026 1:26 AM

స్థానిక ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలి మున్సిపల్‌ నామినేషన్ల స్వీకరణకు మూడు కేంద్రాలే రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్‌

వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర వర్కింగ్‌

ప్రెసిడెంట్‌ నౌడు వెంకటరమణ

దెందులూరు: రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా జరిగిన అవాంఛనీయ సంఘటనలపై ఎన్నికల కమిషన్‌, రాష్ట్రస్థాయి అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నౌడు వెంకటరమణ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థుల నుంచి పత్రాలు లాక్కొని, దౌర్జన్యాలకు పాల్పడి, వాటిని చించివేయడం ప్రజాస్వామ్యానికే మాయనిమచ్చ అన్నారు. ఈ దాడులకు గురైన వారిలో అధికంగా బీసీ అభ్యర్థులు ఉండటం తీవ్రంగా ఆందోళన చెందాల్సిన విషయమన్నారు.

బీసీ వర్గాలపై దాడులా?

నామినేషన్ల ఘట్టం సమయంలో 144 సెక్షన్‌ అమల్లో ఉన్నప్పటికీ.. వందల మంది గుంపులుగా ఎలా వచ్చారు? పోలీసు అధికారులు వారిని లోపలికి ఎలా అనుమతించారు? ఎన్నికల అధికారులు ఏం చేస్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు. సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ బీసీ వర్గాల అభ్యర్థులపై దాడులు చేసి, నామినేషన్‌ పత్రాలు చింపివేయడాన్ని రాష్ట్రంలోని బీసీ వర్గాలన్నీ గమనిస్తున్నాయని హెచ్చరించారు. బీసీ వర్గాలపై దాడులు చేసి, వారిని రాజకీయంగా, సామాజికంగా కించపరిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

అధికారం ఉందనే అహంకారంతో..

అధికారం ఉందనే అహంకారంతో నామినేషన్లకు వచ్చిన వారిపై దౌర్జన్యం చేసి పత్రాలు చింపివేయడం ఏ సంస్కృతికి నిదర్శనమని నిలదీశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్‌, కౌంటింగ్‌ ప్రక్రియల్లో ఎటువంటి దాడులు, దౌర్జన్యాలు, రిగ్గింగ్‌లు జరగకుండా ఎన్నికల అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని.. సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

తాడేపల్లిగూడెం మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను భద్రతా కారణాలరీత్యా మూడింటికే పరిమితం చేసినట్లు మునిసిపల్‌ కమిషనర్‌ ఎం. ఏసుబాబు తెలిపారు. మంగళవారం మునిసిపల్‌ కార్యాలయంలో ఎన్నికల ముందస్తు సమీక్ష నిర్వహించారు. రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూలు వచ్చే అవకాశం ఉందని, షెడ్యూలు వచ్చాక చేపట్టాల్సిన చర్యలపై ఆర్డీఓ సూర్యారావు, డీఎస్పీ నరసింహమూర్తి, మునిసిపల్‌ అధికారులతో చర్చించినట్లు చెప్పారు. గతంలో నామినేషన్‌ల స్వీకరణకు మునిసిపల్‌ కార్యాలయం, ఇండోర్‌ స్టేడియం, బీఆర్‌ మార్కెట్‌, శేష్‌మహల్‌ వెనుక సచివాలయాలను అనుకున్నామన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా శేష్‌మహల్‌ వెనుక కేంద్రాన్ని రద్దు చేసి, మునిసిపల్‌ కార్యాలయంలోనే అదనపు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సమావేశంలో నామినేషన్ల కేంద్రాలు, చెక్‌పోస్టులు, డిస్ట్రిబ్యూషన్‌, రిసీవింగ్‌, స్ట్రాంగ్‌ రూమ్‌లు, కౌంటింగ్‌ కేంద్రాల ఏర్పాట్లు, శాంతిభద్రతల పరిరక్షణపై సమీక్షించారు. అసిస్టెంట్‌ కమిషనర్‌ డి. భవానీబాబు, ఎంఈ వెంకటరమణ, ఏసీపీ సీతారాం, మేనేజర్‌ ప్రసాదరావు, టీపీఓ జగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

భీమడోలు: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా భీమడోలు ఎకై ్సజ్‌ శాఖ పరిధిలోని మద్యం దుకాణాలను మంగళవారం సాయంత్రం రెండు రోజుల ముందే సీజ్‌ చేశారు. ఈనెల 5న పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. దీనితో భీమడోలు, ఉంగుటూరు, ద్వారకాతిరుమల, నిడమర్రు మండలాల్లోని 23 బ్రాందీ షాపులు మూతపడ్డాయి. పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన అనంతరం గురువారం సాయంత్రం 5 గంటలకు దుకాణాలు తెరుచుకుంటాయి. అలాగే ఈనెల 7న శనివారం కౌంటింగ్‌ ఉండటంతో, దానికి ముందురోజు 6వ తేదీ సాయంత్రం 5 గంటలకే షాపులను మళ్లీ మూసివేస్తారు. కౌంటింగ్‌ ముగిసిన వెంటనే మద్యం దుకాణాలు యథావిధిగా పనిచేస్తాయని అధికారులు తెలిపారు. ఎన్నికల నియమావళిలో భాగంగా విధించిన ఈ ఆంక్షలను అందరూ తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement