ఉండిలో ఆక్వా రైతుల నిరసన | - | Sakshi
Sakshi News home page

ఉండిలో ఆక్వా రైతుల నిరసన

Nov 4 2026 1:26 AM | Updated on Nov 4 2026 1:26 AM

ఉండి: విద్యుత్‌ సమస్యలను పరిష్కరించి ఆక్వా సాగును కాపాడాలని కోరుతూ మండలంలోని చినపుల్లేరు గ్రామానికి చెందిన పలువురు ఆక్వా రైతులు ఉండిలోని 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో లైన్‌మెన్‌ అందుబాటులో లేకపోవడం వల్ల తరచూ విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలుగుతోందని, దీనివల్ల ఆక్వా సాగులో తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఫ్యూజులు పోయినా లేదా ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినా, గ్రామానికి లైన్‌మెన్‌ లేకపోవడంతో ఎవరిని సంప్రదించాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.

జనరేటర్లపై ఆధారపడితే పెట్టుబడి భారం

గ్రామ పరిధిలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిన ప్రతిసారీ జనరేటర్లపై ఆధారపడి సాగు చేయాలంటే విపరీతమైన పెట్టుబడి భారం పడుతోందని వాపోయారు. తమ గ్రామానికి చెందిన లైన్‌మెన్‌ ఇతర మండలానికి బదిలీపై వెళ్లడంతో, ఆయన స్థానంలో వాండ్రం లైన్‌మెన్‌ను ఇన్‌చార్జ్‌గా నియమించారని చెప్పారు. అయితే తుపాను కారణంగా దెబ్బతిన్న విద్యుత్‌ లైన్లను పునరుద్ధరించే క్రమంలో ఆయన కూడా అందుబాటులో లేకపోవడంతో తాము మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు తెలిపారు. అందువల్ల తమ గ్రామానికి వెంటనే మరో లైన్‌మెన్‌ను ఇన్‌చార్జ్‌గా నియమించాలని కోరుతూ విద్యుత్‌ శాఖ ఏఈ పి.శ్రీనివాసరావును కలిసి వినతిపత్రం అందజేశారు.

సమస్య పరిష్కారానికి హామీ

రైతుల విజ్ఞప్తిపై ఏఈ శ్రీనివాసరావు స్పందిస్తూ.. చినపుల్లేరు లైన్‌మెన్‌ పదోన్నతిపై బదిలీ అయ్యారని, వెంటనే మరొకరిని ఇన్‌చార్జ్‌గా నియమిస్తామని హామీనిచ్చారు. గ్రామంలోని విద్యుత్‌ సమస్యలతో పాటు ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందిని తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్‌, ఆక్వా రైతు బొర్రా సువర్ణరాజుతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.

లైన్‌మెన్‌ను వెంటనే నియమించాలని డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement