జమిందారుల ఏలుబడిలో..
జంగారెడ్డిగూడెం(బుట్టాయగూడెం): జంగారెడ్డిగూడెం.. శతాబ్దాల చరిత్ర ఉన్న ప్రాంతం. కాకతీయ ప్రాంత ప్రజలు వలసలు వచ్చి స్థిరపడిన ఓ కు గ్రామం తదనంతర కాలంలో పట్టణంగా రూపాంతరం చెందింది. పదుల సంఖ్య నుంచి జనాభా సుమారు 80 వేలకు చేరింది. 13వ శతాబ్ద కాలంలో ముస్లిం దండయాత్ర ఫలితంగా కాకతీయ సామ్రాజ్యం పతనమైంది. దీంతో రాజోద్యోగులు, సైనికాధికారులు, ప్రజల బతుకుదెరువు కోసం వలసబాట పట్టారు. అప్పటి ఓరుగల్లు (వరంగల్లు), నల్గొండ ప్రాంతాలకు చెందిన ప్రజలు గుంపులుగా తూర్పువైపు వలస వచ్చి నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో నివాసం ఏర్పరుచుకుని వ్యవసాయం, పశుపోషణతో జీవనం సాగించారు. ఇలా ప్రయాణిస్తున్న ప్ర జా గుంపు తాడువాయి రెడ్డిరాజులు నిర్మించిన పురాతన శివాలయం వద్ద పూరిళ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తుండగా వరదలతో ప్రాణనష్టం కలిగింది. దీంతో ఆ ప్రాంతం సురక్షితం కాదని ప్రజాగుంపు ఆరు మైళ్లు ప్రయాణించి ఇప్పుడు జంగారెడ్డిగూడెంగా ఉన్న ప్రాంతాన్ని నివాసయోగ్యంగా గుర్తించి స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు. ఇక్కడకు వచ్చిన జన సమూహానికి జంగారెడ్డి, గంగిరెడ్డి అనే సోదరులు పెద్దలుగా ఉండేవారు. జంగారెడ్డి అనే పెద్ద ఏలిన ప్రాంతం కావడంతో కాలక్రమేణా జంగారెడ్డిగూడెంగా పేరొచ్చింది.
మూడో గ్రేడ్ మున్సిపాలిటీ
పట్టణం ప్రస్తుతం మూడో గ్రేడ్ మున్సిపాలిటీ స్థాయికి చేరుకుంది. పట్టణానికి తూర్పున బైనేరు వాగు, పడమర జల్లేరు వాగు, ఉత్తరాన పులివాగు, దక్షిణాన ఎర్రకాలువ ప్రవహిస్తున్నారు. నలు దిక్కు లా నీరుతో పాటు పట్టణంలో ఆలయాలతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. పట్టణ సమీపంలోని గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయ క్షేత్రంగా విరాజిల్లుతోంది. అలాగే పట్టణంలో గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వరస్వామి ఆలయం మహిమ గల క్షేత్రంగా వినుతికెక్కింది. మండలంలోని తాడువాయిలో శివాలయం శైవక్షేత్రంగా పేర్గాంచింది. అలాగే పట్టణంలో పలు ఆలయాలు, చర్చిలు, మసీదులు ఆధ్యాత్మిక భావాన్ని నింపుతున్నాయి.
ఎన్నికల సందడి
మున్సిపల్ ఎన్నికల సందడితో జంగారెడ్డిగూడెం కళకళలాడుతుంది. పట్టణంలో 32 వార్డులతోపాటు చైర్‌పర్సన్ (బీసీ–మహిళ రిజర్వేషన్) స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో సుమారు 48,463 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
13వ శతాబ్దంలో ఆవిర్భవించిన గ్రామం
నలుదిక్కులా నీరు.. ఈ ఊరు
కుగ్రామం నుంచి పట్టణం వరకు ప్రస్థానం
ప్రకృతి ఆలవాలం.. ఆధ్యాత్మిక శోభితం
తూర్పుగోదావరి జిల్లా భద్రాచలం డివిజన్‌లో పోలవరం తాలూకాలో జంగారెడ్డిగూడెం అంతర్భాగమై ఉంది. నిజాం పాలన కాలంలో దత్తు మండలం (గుంటూరు నుంచి గజం) బ్రిటిష్ వారి వంశమైంది. 1954 కాలంలో నూజివీడు సంస్థానం మొగల్తూరు దివానంలో కొంతకాలం ఉండేది. పోలవరం జమిందారులు మంగపతీ దేవ్, లక్ష్మీనారాయణదేవ్‌ల ఏలుబడిలో కొంతకాలం సాగింది. తర్వాత గూటాల జమిందారిణి మన్యం మహాలక్ష్మి ఏలుబడిలోకి వచ్చింది. తర్వాత కొచ్చర్లకోట దివానం కింద మారింది. ఆర్థికంగా బలపడటంతో జీలుగుమిల్లి నుంచి దిప్పకాయలపాడు వరకూ ఉన్న కొన్ని గ్రామాలు లక్కవరం జమిందారు మంత్రిప్రగడ మలయామార్చులు కొనుగోలు చేశారు. వారి దత్తత కుమారుడు భుజంగరావు ధర్మపాలకుడనే పేరు పొందారు. దేశానికి స్వరాజ్యం సిద్ధించి 1949లో జమిందారీ వ్యవస్థ రద్దు కాగా 1958లో రివిజన్ సర్వే ద్వారా భూమి యాజమాన్యం కరువైంది. ఈ ప్రాంతంలో రెడ్లు, బ్రాహ్మణులు, వైశ్యులు, కాపులు, గౌడ, సాలి, గొల్ల, తేలిక, దళిత వర్గాలు అప్పట్లో గుర్తించిన కులాలు.


