చింతలపూడి: చింతలపూడిలో నూతనంగా మంజూరైన 1వ అదనపు సివిల్ జడ్జి కోర్టు (జూనియర్ డివిజన్)–కమ్–1వ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టును ఆదివారం ప్రారంభించారు. స్థానిక సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కోనకంటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నినాల జయసూర్య, జస్టిస్ సుబ్బారెడ్డి, ఏలూ రు జిల్లా ప్రధాన న్యాయమూర్తి (పీడీజే) ఎస్. శ్రీదేవి అతిథులుగా హాజరయ్యారు. చింత లపూడి ప్రాంతంలో అదనపు కోర్టు అందుబా టులోకి రావడంతో కేసుల విచారణ మరింత వేగవంతమై, కక్షిదారులకు సత్వర న్యాయం జరుగుతుందని వక్తలు పేర్కొన్నారు. నూతన కోర్టు ప్రారంభంపై న్యాయవాదులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. జూనియర్ సివిల్ జడ్జి ఏబీ అప్పారావు, న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.సూరయ్య, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు ఉన్న కారణంగా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు (డిసెంబర్ 3) పీజీఆర్‌ఎస్ కార్యక్రమం రద్దు చేసినట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదివారం ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ ఫి ర్యాదులను అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని, ప్రజలు తమ ఫిర్యా దు నమోదు, ఫిర్యాదుల స్థితి తదితర సమాచారాన్ని 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి తెలుసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : తుపాను కారణంగా జిల్లాలో రానున్న మూడు రోజులపాటు భారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. నదులు, చెరువులు, కాలువలకు గండ్లు పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఏలూరు కలెక్టరేట్‌లో 18002331077, 08812– 224519, 9491041419 నంబర్లతో కంట్రోల్‌రూమ్ ఏర్పాటుచేసినట్టు పేర్కొన్నారు. జి ల్లాలో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సమీ ప జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఉప ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ ప్రత్యేక పూజలు చేశారు. ఈఓ కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఆదివారం రోజున ప్రత్యేక, అంతరాలయ దర్శినాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డు ప్రసాదం, అమ్మవారి చిత్రపఠాలు విక్రయం, వాహన పూజలు, విరాళాల ద్వారా రూ.44,580 ఆదాయం వచ్చిందని తెలిపారు. ఆలయంలో ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు.
దమ్మపేట: ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి బైక్‌తో ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండల పరిధిలోని ముష్టిబండ గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన ముళ్లగిరి సుధీర్(18) మండలంలోని వడ్లగూడెం గ్రామానికి చెందిన తన సమీప బంధువు సుందరంతో కలిసి బైక్‌పై అదే గ్రామం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో ముష్టిబండలో ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సుధీర్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సుందరం గాయపడగా చికిత్స నిమిత్తం దమ్మపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


