నూజివీడు: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారాలపై డిజిటల్ ప్రచా రం ముమ్మరంగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థుల ఎంపిక పూర్తయిన దగ్గర నుంచే సోషల్ మీడియాలో ప్రచారాన్ని పెద్ద ఎత్తున సాగిస్తున్నారు. వార్డుల వారీగా ఓటర్ల ఫోన్ నంబర్లతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ప్రచారాన్ని చేస్తున్నారు.
మారిన ఎన్నికల ప్రచార పంథా
గతంలో పోటీ చేసిన అభ్యర్థులు ఓటర్లను ప్రత్యక్షంగా కలిసి తాము ఏమి చేయాలనుకుంటున్నారో తెలిపి వారి మద్దతు కోరేవారు. కాని ప్రస్తుతం ఎన్నికల ప్రచార పంథా పూర్తిగా మారిపోయింది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు సమయం తక్కువగా ఉండడంతో అభ్యర్థులు సోషల్ మీడియాను ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకుంటున్నారు. ఫేస్‌బుక్, ఇనన్‌స్ట్రాగామ్, వాట్సాప్ వంటి ప్లాట్‌ఫాంలలో తమ రోజువారీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పోస్టు చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకుంటున్నారు. మరికొందరు ఓటర్లను ఆకట్టుకునేలా ప్రత్యేక వీడియోలను పాటలతో కలిపి క్రియేట్ చేసుకొని ప్రచారం చేస్తున్నారు. రీల్స్ ద్వారా ఓటర్ల ఫోన్లకు వీడియో, ఆడియో రూపంలో సందేశం పంపిస్తున్నారు. ఇలా ప్రచారంలో డిజిటల్ ట్రెండ్‌ను అనుసరిస్తున్నారు.
ప్రచార ఆయుధంగా సోషల్ మీడియా
ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచార ఆయుధంగా సోషల్ మీడియాను ఎంచుకుంటున్నారు. నో టిఫికేషన్‌కు ముందు నుంచే తమ రోజువారీ కా ర్యక్రమాలను అందులో పోస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రచారంలో భాగంగా కాలనీ పెద్దలు, అధికారులను కలవడం, సామాజిక సేవా కార్యక్రమాలు వంటి వాటిని చిత్రీకరిస్తున్నారు. ఆయా ఫొటోలు, వీడియోలతో ప్రత్యేక రీల్స్ రూపొందించి వాటికి ఆడియోను జతచేసి పోస్ట్ చేస్తున్నారు. ఇందుకోసం కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన యువతను ఏర్పాటుచేసుకుని సోషల్ మీడియాలో తమ ప్రచారాన్ని హోరెత్తించే బాధ్యతలు వారికి అప్పగించారు.
వాట్సాప్ గ్రూప్‌లు క్రియేట్ చేసి..
కౌన్సిలర్ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం కోసమే ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్‌లను క్రియేట్ చేస్తున్నారు. అందులో కాలనీ పెద్దలు, వివిధ కుల, ప్రజా సంఘాల బాధ్యులు, విద్యావంతులు, పలుకుబడి కలిగిన వ్యక్తుల నంబర్లను సేకరించి యాడ్ చేస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతల ఫొటోలతో కూడిన రీల్స్‌ను సిద్ధం చేస్తూ వాటిని ఆయా గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. కౌన్సిలర్‌గా తమను ఆదరించి గెలిపించాలని, ఎన్నుకుంటే తాము చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను అందులో వివరిస్తూ వీడియోలు పెడుతున్నారు. ప్రస్తుతం పట్టణంలోని అన్ని వార్డుల్లో ఇలాంటి ప్రచారాలు దర్శనమిస్తున్నాయి.
సోషల్ మీడియా వేదికగా ఎన్నికల ప్రచారం
వార్డుల వారీగా వాట్సాప్ గ్రూప్‌లు
పోస్టింగ్ చేసేందుకు ప్రత్యేక టీమ్‌లు
ఓటర్లను ఆకర్షించే యత్నాలు


