పీజీఆర్‌ఎస్‌ అర్జీల పరిష్కారానికి చర్యలు | - | Sakshi
Sakshi News home page

పీజీఆర్‌ఎస్‌ అర్జీల పరిష్కారానికి చర్యలు

Sep 30 2026 2:04 AM | Updated on Sep 30 2026 2:04 AM

పీజీఆర్‌ఎస్‌ అర్జీల పరిష్కారానికి చర్యలు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్‌, రాబోయే ఎన్నికల సంసిద్ధతపై జిల్లా కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి మంగళవారం కలెక్టరేట్‌ వేదికగా వివిధ శాఖల అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించారు. రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్‌ జి.జయలక్ష్మి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ పాల్గొన్నారు. జిల్లాలో పీజీఆర్‌ఎస్‌ ద్వారా అందిన 22,513 దరఖాస్తుల్లో 19,472 అర్జీలను పరిష్కరించినట్లు తెలిపారు. అలాగే జూన్‌ 15 నుంచి సెప్టెంబర్‌ 28 వరకు 22ఏ భూ సమస్యలపై అందిన 491 దరఖాస్తుల్లో 211 పరిష్కరించామని, నిబంధనలకు లోబడి లేని 208 అర్జీలను తిరస్కరించామని వివరించారు. సెప్టెంబర్‌ నెలలో 13,131 పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలను పంపిణీ చేశామని, రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్‌ వేగవంతంగా సాగుతోందని వెల్లడించారు.

5 వరకు ఓటర్ల జాబితా సవరణ

రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రత్యేక ఇంటెన్సివ్‌ రివిజన్‌ కింద ఓటర్ల జాబితాలో క్లెయిమ్‌లు, అభ్యంతరాల దాఖలుకు అక్టోబర్‌ 5 వరకు గడువు ఉందని తెలిపారు. అక్టోబర్‌ 9న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రచురిస్తామని, పారదర్శకమైన జాబితా రూపకల్పనకు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. అనంతరం ఈవీఎం గోడౌన్‌ను సందర్శించి, భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరును వివిధ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు.

కీర్తిసాయి చిట్స్‌ ఆస్తుల వేలానికి సిఫార్సు

ఏలూరులోని శ్రీ కీర్తిసాయి చిట్స్‌ సంస్థపై నమోదైన సీఐడీ కేసుకు సంబంధించి జప్తు చేసిన రూ.1.06 కోట్లకు పైగా విలువైన స్థిర, చరాస్తుల (3 వాహనాలు, 5 భూములు/స్థలాలు, బంగారు నగలు) వివరాలను వేలం నిమిత్తం రాష్ట్ర కమిటీకి నివేదిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని బాధితులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వ అనుమతి కోరుతున్నట్లు స్పష్టం చేశారు.

దత్తతకు అనుమతి

బేబీ కృతిక అనే 3 నెలల పాపను దత్తత తీసుకున్న చైన్నెకి చెందిన కుమారీ, మధు శ్రీనివాసన్‌ దంపతులకు నిబంధనల ప్రకారం 60 రోజుల సమయం పూర్తి కావడంతో ఫైనల్‌ అడాప్షన్‌ ఆర్డర్‌ను కలెక్టర్‌ అందజేశారు. పాపను ప్రేమగా చూసుకుంటూ ఉత్తమ విద్య అందించాలని సూచించారు.

జెడ్పీ కార్యాలయం ఆకస్మిక తనిఖీ

జిల్లా పరిషత్‌ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌, బదిలీపై వచ్చిన ఉద్యోగులకు సీట్లు కేటాయించకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు. ఉద్యోగులు సబ్జెక్టుపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్‌, పీఎఫ్‌, మెడికల్‌ రీఎంబర్స్‌మెంట్‌ బకాయిలను త్వరితగతిన పరిష్కరించాలని స్పష్టం చేశారు.

అనివార్య కారణాలతో డీఆర్‌సీ సమావేశం వాయిదా

బుధవారం జరగాల్సిన జిల్లా సమీక్షా కమిటీ (డీఆర్‌సీ) సమావేశం అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్లు కలెక్టర్‌ వెట్రిసెల్వి ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి తేదీని త్వరలోనే వెల్లడిస్తామన్నారు. కాగా, డీఆర్‌సీ సమావేశం నిర్వహణ, ప్రజాప్రతినిధులు లేవనెత్తే ఉద్యాన పంటలు, పీ–4 పేదరిక నిర్మూలన ప్రణాళిక, పీఎం సూర్యఘర్‌ వంటి అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేసేందుకు మంగళవారం నిర్వహించిన సమీక్షలో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.జే. అభిషేక్‌ గౌడ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ వెట్రిసెల్వి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement