ఏలూరు టౌన్: స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో (జీజీహెచ్) ఓ వైద్యుడి ప్రవర్తన వివాదాస్పదమైంది. అత్యవసర ద్వారం వద్ద కారు పార్కింగ్ విషయమై ప్రశ్నించిన సెక్యూరిటీ సిబ్బందిపై న్యూరో సర్జన్ డాక్టర్ విద్యాసాగర్ దుర్భాషలాడారంటూ సిబ్బంది ఆకస్మిక ధర్నాకు దిగారు.
అసలేం జరిగిందంటే:
రెడ్‌క్రాస్, అత్యవసర విభాగాలకు వెళ్లే మార్గంలో డాక్టర్ విద్యాసాగర్ తన కారును నిలిపారు. అంబులెన్సుల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని, కారును కేటాయించిన పార్కింగ్ ప్రదేశంలో పెట్టాలని విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కోరారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వైద్యుడు, తమపై దుర్భాషలాడుతూ, అవమానకర రీతిలో ప్రవర్తించారని సెక్యూరిటీ సిబ్బంది ఆరోపించారు. అంతేకాకుండా తమ ఫోన్‌ను సైతం లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్యామల వద్దకు చేరడంతో, ఆమె ఇరువర్గాలను పిలిచి సర్దుబాటు చేసేందుకు యత్నించారు. అయితే అక్కడ కూడా సదరు వైద్యుడు సీనియర్ ప్రొఫెసర్లపై అనుచితంగా ప్రవర్తించారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వైద్యుడు అకారణంగా రెచ్చిపోవడంపై ఆసుపత్రి సిబ్బంది, ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


