పెదవేగి: స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో బుధవారం జిల్లా స్థాయి అండర్–19 (బాలబాలికల) స్కూల్ గేమ్స్ జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. హాకీ, రగ్బీ, సెపక్ తక్రా క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జట్లకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ఎం. రమేష్ బాబు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అండర్–19 ఆర్గనైజింగ్ సెక్రటరీ కందికొండ జయరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే వ్యాయామ ఉపాధ్యాయులు రాణి, చంద్రశేఖర్, శ్రీలక్ష్మి, రాజ్‌కుమార్, ప్రేమ్‌కుమార్, యువరాజు పాల్గొన్నారు.
ఆకివీడు: మండలంలోని అయిభీమవరం గ్రామానికి చెందిన 88 ఏళ్ల వృద్ధురాలు కనుమూరు కమలమ్మ తిరుమల తిరుపతి దేవస్థానానికి తమకున్న 54 సెంట్ల భూమిని విరాళంగా అందజేశారు. కమలమ్మ భర్త సూర్యనారాయణరాజు గతంలో మరణించారు. సంతానం లేకపోవడంతో ఒకరిని దత్తతు తీసుకోగా, ఆయన ప్రస్తుతం కెనడాలో ఉంటున్నారు. తన తదనంతరం ఈ భూమిని స్వాధీనం చేసుకునేలా టీటీడీకి రాసిచ్చారు.సుమారు రూ.2.5 కోట్ల రూపాయల విలువైన భూమిని విరాళంగా ఇచ్చిన కమలమ్మను మాజీ ఎంపీ కనుమూరు బాపిరాజు–అన్నపూర్ణమ్మ దంపతులు మంగళవారం సత్కరించారు.


