● టీడీపీ కార్యకర్త మాదాల సునీత
● తన స్థలాన్ని దౌర్జన్యంగా లాక్కోవాలని చూస్తున్నారంటూ ఆందోళన
ఆగిరిపల్లి: మంత్రి కొలుసు పార్థసారథి, ఆయన అనుచరుల వల్ల తనకు ప్రాణహాని ఉందని ఏలూరు జిల్లా ఆగిరిపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త మాదాల సునీత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తన స్థలాన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆగిరిపల్లిలోని తన స్థలంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తమ ఇంటితో కలిపి 1.04 ఎకరాల స్థలం తమ తండ్రి నుంచి తనకు వారసత్వంగా వచ్చిందని, 2013లో రిజిస్ట్రేషన్ కూడా అయిందని చెప్పారు. ఆగిరిపల్లిలో పీ–4 పథకం కింద అనర్హులను ఎంపిక చేశారని, పైగా వారికి తన భూమిని ఇచ్చేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మంత్రి అనుచరులు, స్థానిక తహసీల్దార్ ప్రసాద్ కన్ను ఈ భూమిపై పడిందని, పలు రకాలుగా తమను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇక్కడ వీఆర్‌వోగా పనిచేసిన పల్లగాని వంశీ, సర్వేయర్ మునీర్, ఆర్.యూనస్ తన స్థలంలోకి వచ్చి ఇది గయాలు భూమి అని, తమకు రూ.50 లక్షలు చెల్లించాలని బెదిరించారని చెప్పారు. ఈ నెల 25న మంత్రి పార్థసారథి వచ్చి తన అనుచరులతో గేటు తాళాలు పగలగొట్టించారని తెలిపారు. జూన్ నెలలో అక్రమంగా తన స్థలంలోకి వచ్చి జేసీబీతో తవ్వుతుండగా తాను ప్రశ్నిస్తే.. ఆ స్థలాన్ని ప్రభుత్వం తమకు మంజూరు చేసిందని బత్తుల శివ చెప్పాడని ఆమె పేర్కొన్నారు. అక్కడే ఉన్న మంత్రి అనుచరుడు నెర్సు సతీష్, ఆయన వర్గానికి చెందిన మల్లి తనను అసభ్య పదజాలంతో దూషించి భయపెట్టారని చెప్పారు. తనను తిట్టిన సతీష్‌ది కంకిపాడు మండలం ఉప్పులూరు అని తెలిపారు. గతంలో ఎస్‌ఐగా పనిచేసిన శుభశేఖర్, ప్రస్తుత తహసీల్దార్ ప్రసాద్‌లది కూడా ఉప్పులూరేనని చెప్పారు. ఎస్‌ఐ, తహసీల్దార్ మంత్రికి కుడి–ఎడమ జేబుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తహసీల్దారు ఆస్తులపై ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మండలంలో కొండలు, గుట్టలను దోచేస్తున్నారన్నారు. కొండలను మాయం చేసే స్కిల్ ఉంటేనే మంత్రి పదవికి అర్హతా? అని ఆమె ప్రశ్నించారు.
ఆ ఆరోపణల్లో వాస్తవం లేదు
ఆగిరిపల్లిలో సునీత చేసిన ఆరోపణలపై తహసీల్దార్ ప్రసాద్‌ను అడగగా.. సర్వే నంబరు 83/1లో ఉన్న మొత్తం ఏడెకరాల్లో మాదల వెంకటప్పయ్యకు సెటిల్‌మెంట్ కింద ఒక ఎకరా భూమిని కేటాయించినట్లు తెలిపారు. మిగిలిన భూమిలో 5.65 ఎకరాల్లో పలువురు ఇళ్లు నిర్మించుకోగా, 35 సెంట్ల ప్రభుత్వ భూమి మిగిలి ఉందని చెప్పారు. ఆరోపణలు చేస్తున్నవారికి ఆ 35 సెంట్ల భూమిపై ఎలాంటి హక్కులు లేవని, అది పూర్తిగా ప్రభుత్వ భూమి అని ఆయన స్పష్టం చేశారు.


