అరణ్యంలో హైటెక్‌ నిఘా | - | Sakshi
Sakshi News home page

అరణ్యంలో హైటెక్‌ నిఘా

Sep 9 2026 3:10 AM | Updated on Sep 9 2026 3:10 AM

న్యూస్‌రీల్‌

చట్టాలు కఠినం

సాంకేతిక పరిజ్ఞానంతో అడవులు, వన్యప్రాణుల రక్షణ

లైవ్‌ కంట్రోల్‌ రూమ్‌, కెమెరా ట్రాప్‌లు

డ్రోన్లతో కట్టుదిట్టమైన పర్యవేక్షణ

బుధవారం శ్రీ 9 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

బుట్టాయగూడెం: అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ కోసం అటవీశాఖ సరికొత్త సాంకేతికతతో కూడిన నిఘా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై అడవుల్లో స్మగ్లర్లు అడుగుపెట్టినా, కార్చిచ్చు రగులుతున్నా క్షణాల్లో సమాచారం అధికారులకు చేరుతుంది. పాపికొండల అభయారణ్యంలోని ఎత్తైన ప్రాంతాల్లో అత్యాధునిక కెమెరాలను అమర్చి, అడవిలో జరిగే ప్రతి కదలికను కంట్రోల్‌ రూమ్‌ నుంచి లైవ్‌గా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. వీటితో పాటు 4జీ, పీటీజెడ్‌, ఫ్లాష్‌, డ్రోన్‌ కెమెరాలతో అటవీ ప్రాంతాన్ని కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తున్నారు.

1,012.86 చదరపు కిలోమీటర్లలో విస్తరణ

ఏలూరు జిల్లా పశ్చిమ ఏజెన్సీ పరిధిలోని బుట్టాయగూడెం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఉన్న పాపికొండల అభయారణ్యం 1,012.86 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉండటంతో, వేటగాళ్ల ఆగడాలకు పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు అధికారులు దట్టమైన అటవీ ప్రాంతంలో ట్రాప్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా జంతువులతో పాటు అడవిలోకి అక్రమంగా చొరబడే వ్యక్తుల స్పష్టమైన చిత్రాలు నమోదవుతాయి. జంతు గణన కోసం అభయారణ్యం పరిధిలోని 116 ప్రాంతాల్లో మొత్తం 232 ట్రాప్‌ కెమెరాలను అమర్చారు. వీటి ద్వారా జంతుగణన సులభమవుతుంది.

అభయారణ్యంలో అరుదైన జీవజాలం

ఈ అభయారణ్యంలో ఎలుగుబంట్ల సంఖ్య అధికంగా ఉంది. వీటితో పాటు చిరుతలు, పెద్దపులులు, కొండగొర్రెలు, జింకలు, చుక్కల దుప్పులు, సాంబార్లు, అడవిపందులు, అడవి దున్నలు, ముళ్లపందులు, నక్కలు, ముంగీసలతో పాటు ప్రమాదకరమైన గిరినాగులు, నెమళ్లు, గద్దలు వంటి రకరకాల జీవజాలం సంచరిస్తోంది. వన్యప్రాణులను వేటాడినా, అక్రమాలకు పాల్పడినా కఠిన చట్టాల కింద చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.

అడవులు, వన్యప్రాణుల సంరక్షణకు ఆధునిక సాంకేతికతతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. నిఘా కెమెరాల ద్వారా కార్యాలయం నుంచే అడవిని నేరుగా పర్యవేక్షిస్తున్నాం. స్మగ్లింగ్‌కు పాల్పడినా, వన్యప్రాణులను వేటాడాలని చూసినా వెంటనే గుర్తించి కఠిన చట్టాల ద్వారా జైలుకు పంపుతాం. – ఎస్‌కే వలీ, అటవీశాఖ రేంజ్‌ అధికారి, పోలవరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement