ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వాయు కాలుష్య నియంత్రణలో ఏలూరు నగరం జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచిందని నగర పాలక కమిషనర్ భాను ప్రతాప్ తెలిపారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ‘నేషనల్ క్లీన్ ఎయిర్’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ (2025–26)’లో ఏలూరు జాతీయ స్థాయిలో 4వ ర్యాంక్ సాధించిందని మంగళవారం విలేకరులకు తెలిపారు. గతంలో 31వ ర్యాంకులో ఉన్న నగరం, అధికారుల కృషి ఫలితంగా కేటగిరీ–3 విభాగంలో ఈ ఘనత సాధించిందని వివరించారు. నగరంలో కాలుష్యాన్ని 69 మైక్రోగ్రాముల నుంచి 61 మైక్రోగ్రాములకు తగ్గించడంలో అధికారులు చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిచ్చాయని పేర్కొన్నారు. జాతీయ స్థాయి గుర్తింపు సాధించినందుకు నగరపాలక సంస్థ అధికారులను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అభినందించారని తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఏలూరును సంపూర్ణ పారిశుద్ధ్య నగరంగా తీర్చిదిద్దాలని ఆదేశించినట్లు స్పష్టం చేశారు.
ఆకివీడు: స్థానిక సీహెచ్‌సీ ముగ్గురు గైనకాలజిస్టులను నియమించినట్లు జిల్లా వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ డాక్టర్ పగడాల సూర్యనారాయణ తెలిపారు. సీహెచ్‌సీలో గైనకాలజిస్టుల కొరతపై ఇటీవల ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన ఆయన, మంగళవారం ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సూర్యనారాయణ మాట్లాడుతూ తాత్కాలిక ప్రాతిపదికన వారంలో రెండేసి రోజుల చొప్పున విధులు నిర్వహించేలా భీమవరం నుంచి ఇద్దరు, నూజివీడు నుంచి ఒకరు చొప్పున ముగ్గురు వైద్యులను ఏర్పాటు చేశామని చెప్పారు. త్వరలోనే ఇక్కడ శాశ్వత గైనకాలజిస్టును నియమిస్తామని స్పష్టం చేశారు. గతంలో ఇక్కడ పనిచేస్తూ అమరావతికి డిప్యూటేషన్‌పై వెళ్లిన డాక్టర్ ప్రశాంత్ సోమవారం తిరిగి బాధ్యతలు స్వీకరించారని వివరించారు. అనంతరం వార్డులను పరిశీలించి, ఇన్‌పేషెంట్లతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలను తెలుసుకున్నారు.
భీమడోలు: కొల్లేరు కాంటూరు పరిధిలోని అంబర్‌పేట రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 322 జిరాయితీ భూములను రీసర్వే కార్యక్రమంలో ప్రభుత్వ భూములుగా మార్చొద్దని, తమకు భూ హక్కు కల్పించాలని సన్న, చిన్నకారు రైతులు మంగళవారం భీమడోలు తహసీల్దార్ బి.రమాదేవికి వినతిపత్రం అందించారు. ఆరు దశాబ్ధాలుగా 55 ఎకరాల భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని, ఇటీవల జిరాయితీ భూములను ప్రభుత్వ భూములుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని, అదే జరిగితే తామంతా రోడ్డున పడతామని, తమకు న్యాయం చేయాలని వారు వేడుకున్నారు.


